పుష్పపల్లకోత్సవం.. నయనానందకరం

20 Feb, 2020 08:18 IST|Sakshi
భ్రమరాంబామల్లికార్జునస్వామివార్లకు వాహన పూజలు నిర్వహిస్తున్న అర్చకులు

పురవీధుల్లో  మల్లన్న విహారం

2 వేల కేజీలకు పైగా పూలతో పుష్పపల్లకీ

లక్షలాది మంది భక్తజనం మధ్య గ్రామోత్సవం

సాక్షి, శ్రీశైలం: మల్లికార్జునస్వామి స్వామి పుష్పపల్లకోత్సవం కనుల పండువగా జరిగింది.  దేవేరి భ్రామరితో కలిసి  శ్రీశైలేశుడు పురవీధుల్లో విహరించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన మల్లన్న పుష్పపల్లకీ గ్రామోత్సవాన్ని లక్షలాది మంది భక్తజనం తిలకించి తరించారు. అంతకు ముందు ఆలయప్రాంగణంలోని అక్కమహాదేవి కల్యాణమండపంలో శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల ఉత్సవమూర్తులకు విశేష వాహనసేవలు నిర్వహించారు. తర్వాత ఉత్సవమూర్తులను ఆలయప్రదక్షిణ చేయించారు.

ఈ కార్యక్రమంలో శ్రీశైలం ఈఓ కేఎస్‌రామారావు, మాజీ ఈఓ వంగాలశంకర్‌రెడ్డి, ట్రస్ట్‌బోర్డ్‌ చైర్మన్‌ శివరామిరెడ్డి,సభ్యులు గిరీష్‌పాటిల్, చాటకొండ శ్రీని వాసులు,మర్రి శ్రీరాములు, రావినాద్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఆలయ ప్రదక్షిణానంతరం ఉత్సవమూర్తులను  ఊరేగింపుగా రథశాల వద్దకు చేర్చి పుష్పాలంకృతశోభతో కళకళలాడుతున్న పల్లకీలో ఉత్సవమూర్తులను కూర్చొబెట్టారు. ఈ పుష్పపల్లకీ కోసం 2000 కేజీలకు పైగా తెలుపు, పసుపు చామంతులు,ఎరుపు,పసుపు బంతిపూలు, కనకాంబరం, నందివర్ధనం, కాగడా, జబ్ర, కార్నేషన్, ఆర్కిడ్స్, గ్లాడియోలస్, టైగర్‌రోజ్, స్టార్‌ రోజ్, ఆస్టర్, ఆ్రస్టిడ్‌ మొదలైన 18 రకాల పుష్పాలను వినియోగించినట్లు హారి్టకల్చరిస్ట్‌ లోకేష్‌ తెలిపారు.  దీంతో పాటు వేలాది విడి పుష్పాల(కట్‌ప్లవర్స్‌)తో అత్యంత సుందరంగా పల్లకీని తీర్చిదిద్దారు.

నేడు శ్రీశైలంలో... 
శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజు  గురువారం శ్రీభ్రమరాంబామల్లికార్జున స్వామివార్లను గజవాహనంపై  ఆవహింపజేసి విశేషపూజలు చేస్తారు. తర్వాత  గ్రామోత్సవం నిర్వహిస్తారు.   ఆలయప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో గజవాహనంపై అధిష్టింపజేసిన ఉత్సవ మూర్తులకు విశేషపూజలు చేస్తారు. వాహన సమేతులైన స్వామి అమ్మవార్లను ప్ర«ధానాలయ గోపురం నుంచి «రథశాల వద్దకు చేరుస్తారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత నందిమండపం, అంకాలమ్మగుడి, బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు ఊరేగిస్తారు. గురువారం  జరిగే ప్రత్యేక పూజల్లో భాగంగా ఉదయం 7.30 గంటలకు నిత్యహోమ బలిహరణలు, జపానుష్టానములు నిర్వహిస్తారు.


మల్లన్న గ్రామోత్సవానికిభారీగా తరలివచ్చిన భక్తజనం

మంత్రి పేర్ని నాని రాక 
కర్నూలు(సెంట్రల్‌) : రాష్ట్ర సమాచార, రోడ్డు రవాణా శాఖమంత్రి  పేర్ని నాని మల్లన్న బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు గురువారం శ్రీశైలానికి రానున్నారు. మచిలిపట్నం నుంచి గురువారం ఆయన బయలు దేరి సాయంత్రం నాలుగు గంటలకు శ్రీశైలం చేరుకుంటారు.  21వ తేదీ జరిగే వివిధ బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని ఆ రాత్రి అక్కడే బస చేసి మరుసటి రోజు తిరిగి మచిలిపట్నంకు వెళ్లిపోతారు.

మరిన్ని వార్తలు