శాంతిదూత.. స్ఫూర్తి ప్రదాత

2 Oct, 2019 12:11 IST|Sakshi
జిల్లా పర్యటనలో భాగంగా ఏలూరులో రైలు దిగుతున్న గాంధీజీ

‘పశ్చిమ’లో స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిల్చిన వైనం

జిల్లా అంతటా బాపూజీ పాదముద్రలు   

ఏలూరు (టూటౌన్‌): జాతిపిత మహాత్మాగాంధీజీకి జిల్లాతో విడదీయలేని బంధం ఉంది. బాపు పాదముద్రలు జిల్లా అంతటా ఉన్నాయి. అహింసే ఆయుధంగా కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఉద్యమ స్ఫూర్తిని రగిలిం చిన బాపూజీ ‘పశ్చిమ’ నేలపై కూడా అడుగులు వేశారు. కిలోమీటర్ల కొలదీ నడిచి స్వాతంత్య్ర కాంక్షను   రగిలించారు. జిల్లాలో జాతిపిత 1921, 1929, 1933లో పర్యటించి ఇక్కడి నేలను పునీతం చేశారు. మహాత్ముడి 150వ జయంతి సందర్భంగా ఆయన పర్యటన వివరాలు 

తొలిసారి 1921లో..
1921 మార్చి 21న, ఏప్రిల్‌ 1 రెండు రోజులు అఖిల భారత కాంగ్రెస్‌ సమావేశం విజయవాడలో జరిగింది. గాంధీజీ, నెహ్రూ, పటేల్‌ వంటి మహానాయకులు ఈ సమావేశాలకు హాజరయ్యారు. సమావేశాలు ము గిసిన తర్వాత గాంధీజీ విజయవాడ నుంచి జిల్లాలోకి ప్రవేశించారు. భార్య కస్తూరిబాతో కలిసి తిలక్‌ స్వరా జ్య నిధి సేకరణకు రాజమండ్రికి వెళ్లిన మహాత్ముడు 1921 ఏప్రిల్‌ 3న ఏలూరులో అడుగుపెట్టారు. మా గంటి అన్నపూర్ణాదేవి కోరిక మేరకు రైల్వేస్టేషన్‌లో రైలు దిగారు. ఏలూరువాసులు ఆయన్ను బ్యాండ్‌ మేళం, సన్నాయి, భజనలతో రెండు గుర్రపు భగ్గీలపై పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం టౌన్‌ హాలులో 10 వేల మంది మహిళలతో నిర్వహించిన సభలో గాంధీజీ మాట్లాడారు. సత్తిరాజు వెంకటరత్తమ్మ, స్త్రీ సమాజ భవనానికి గాంధీ శంకుస్థాపన చేశారు. అనంతరం గాంధీ దంపతులకు నగర ప్రజలు సత్కారం చేశారు. గాంధీజీ విద్యాలయాన్ని ప్రారంభించారు. తదుపరి శనివారపుపేట చెన్నకేశవస్వామి ఆలయానికి చెందిన పొలంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించగా అనువాదకులు దొరకలేదు. మున్సిపల్‌ చైర్మన్‌ మోతే గంగరాజు, వల్లూరి రామారావు పంతులు, బడేటి వెంకటరామయ్యనాయుడు, యర్రమిల్లి మంగయ్య, సోమంచి సీతారామయ్య తదితరులు ఈ సభలో ఉన్నారు. 

రెండోసారి 1929లో..  
1921 ఏప్రిల్‌ రెండో వారంలో యంగ్‌ ఇండియా పత్రికలో జిల్లా పర్యటనపై గాంధీజీ వ్యాసం రాశారు. ఆంధ్రులు బలవంతులు, శక్తివంతులు, ఉదారవం తులని రాయడంతో పాటు మాగంటి అన్నపూర్ణాదేవి గురించి ప్రస్తావించారు. గాంధీజీ రెండోసారి 1929 ఏప్రిల్‌ 23–28 మధ్య ఖద్దర్‌ నిధి కోసం జిల్లాలో యాత్ర నిర్వహించారు. 23న పెదపాడు సమీపంలోని పెరికేడులో అడుగుపెట్టారు. వసంతవాడ, నాయుడుగూడెం, పునుకొల్లు, కలపర్రు, వట్లూరులో పర్యటించి సాయంత్రం 6 గంటలకు ఏలూరు బహిరంగ సభలో ప్రసంగించారు. రాత్రి గాంధీ విద్యాలయంలో బస చేశారు. 24న ఉదయం ధర్మాజీగూడెం, పెదవేగి, విజయరాయి, నడిపల్లి, దెందులూరు, కొవ్వలి, పోతునూరు, గుండుగొలనులో పర్యటించారు. ఆ రాత్రి భోగరాజు వీర్ల వెంకయ్య నివాసంలో నిద్రించారు. 25న తాడేపల్లిగూడెం చేరుకుని చిలకంపాడు, పిప్పర, గణపవరం, ఉండి, ఆకివీడు, భీమవరం, వీరవాసరం, పొలమూరు మీదుగా  పెనుమంట్ర వెళ్లి దాట్ల నీలాద్రిరాజు ఇంట్లో బస చేశారు. 26న పెనుమంట్ర నుంచి ఆలమూరు, వెలగలేరు, కవిటం, జిన్నూరు, పోడూరు, మట్లపాలెం, పాలకొల్లులో పర్యటించి ఆచంట చేరుకుని అక్కడ రాత్రికి నెక్కింటి దొరయ్య నివాసంలో బస చేశారు. 27న పెనుగొండ వెళ్లి ఏలేటిపాడు, తణుకు, సమిశ్రగూడెం, నిడదవోలు, బ్రాహ్మణగూడెం, చాగల్లులో పర్యటించారు. రాత్రి అక్కడ గౌతమి విద్యానికేతన్‌ స్కూల్లో బస చేశారు. 28న కొవ్వూరు చేరుకుని ఉదయం 7.30 గంటలకు కలకత్తా మెయిల్‌లో విశాఖ వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా గాంధీజీ జిల్లాలోని 48 గ్రామాల్లో 250 మైళ్ల దూరం ప్రయాణం చేశారు. లంకలకోడేరుకు చెందిన వస్తాదురాజు ఆయనకు బాడీగార్డ్‌గా వ్యవహరించారు.

మూడోసారి 1933లో..
అçస్పృస్యత నివారణ కోసం 1933 డిసెంబర్‌ 26న గాంధీజీ జిల్లాలో పర్యటించారు. ఆరోజు సాయంత్రం సీతానగరం నుంచి గోదావరి దాటి తాళ్లపూడిలో అడుగుపెట్టారు. ప్రక్కిలంక, మలకపల్లి, ధర్మవరం, చాగ ల్లు, నిడదవోలు మీదుగా తణుకు చేరుకున్నారు. 27న తణుకులో బయలుదేరి పాలకొల్లు, బల్లిపాడు, భీమవరం మీదుగా తాడేపల్లిగూడెం వచ్చారు. అక్కడ భైర్రాజు రామరాజు నివాసంలో భోజనం చేశారు. అక్కడ నుంచి రైలులో పూళ్ల, కైకరం, దెందులూరు మీదుగా ఏలూరు వచ్చి అక్కడ రాయుడు గంగయ్య నాయకత్వంలో వెన్నవెల్లి దళితపేటలో మాట్లాడారు. 28న రైలులో కృష్ణా జిల్లాకు వెళ్ళారు. ఈ పర్యటనలో రూ.8,156 నగదు, రూ.2,315 విలువైన నగలు విరాళాలుగా సేకరించారు. 

అధ్యయన కేంద్రానికి విశేష గుర్తింపు
నరసాపురం గాంధీజీ అధ్యయన కేంద్రానికి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది.  కేంద్రం ఆధ్వర్యం లో దేశవ్యాప్తంగా పలు ఫొటో ఎగ్జిబిషన్‌లు నిర్వహించారు. ఇక్కడ గాంధీజీ జీవిత చరిత్రకు సంబంధించి అరుదైన ఫొటోలున్నాయి. న్యాయమూర్తులు, శాసనమండలి చైర్మన్‌ చక్రపాణి, సామాజికవేత్త మేథాపాఠ్కర్, అమెరికాలో శాంతిదూతలుగా ముద్రపడిన నలుగురు విదేశీ మహిళల సైతం కేంద్రాన్ని సందర్శించి ఆనందం వ్యక్తం చేశారు. మహాత్ముడి పర్యటనలకు గుర్తుగా నాడు ప్రతి గ్రామంలోనూ స్థూపాలు, విగ్రహాలు, పఠన మందిరాలు లాంటివి ఏర్పాటు చేయడంతో పిల్లలకు గాంధీ పేర్లు పెట్టారు.

మరిన్ని వార్తలు