పాజిటివ్‌ అనుమానం.. ప్రాణం తీసింది.. 

20 Jul, 2020 11:29 IST|Sakshi

పిఠాపురం: కరోనా భయం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. గొల్లప్రోలుకు చెందిన వృద్ధుడు (63) కొంతకాలంగా యూరినల్‌ సమస్యతో బాధ పడుతూ కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్యం పొందుతున్నాడు. రెండు రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతుండడంతో ఆదివారం అతడిని భార్య పిఠాపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లింది. రెండతస్తుల భవనంలోని ఆస్పత్రికి ఇబ్బంది పడుతూనే తన భర్తను తీసుకువెళ్లింది. మేడ పైకి ఎక్కడంతో ఆయాసపడుతున్న అతడిని చూసిన ఆస్పత్రి సిబ్బందికి అనుమానం వచ్చింది. ప్రస్తుత కరోనా టెస్టు చేయించుకుంటే తప్ప చికిత్స చేయలేమని చెప్పారు. దీంతో భయాందోళనలకు గురైన భార్యాభర్తలిద్దరూ తిరిగి కిందకు దిగారు. కరోనా అనుమానంతో ఆందోళనకు గురైన బాధితుడు ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు వదిలాడు.

భార్య లబోదిబోమంటూ రోదిస్తున్నా ఎవరూ దగ్గరకు వెళ్లే సాహసం చేయలేకపోయారు. చివరకు వారి బంధువులకు సమాచారం అందగా వారు ఓ ప్రైవేటు అంబులెన్సులో స్వగ్రామమైన గొల్లప్రోలు తీసుకువెళ్లారు. కరోనా టెస్టు చేయించకుండా అంతిమ సంస్కారాలు చేయకూడదని చెప్పడంతో తిరిగి మృతదేహాన్ని పిఠాపురం ఆస్పత్రికి తరలించారు. అప్పటి వరకూ మృతదేహాన్ని చూడడానికి కూడా బంధువులు సాహసించలేదు. కరోనా టెస్టు చేసిన వైద్యులు అతడికి కరోనా లేదని చెప్పడంతో తిరిగి ఇంటికి తీసుకు రాగా, అందరూ వచ్చి అంత్యక్రియలు పూర్తి చేశారు. మామూలు వ్యక్తులనే అనుమానిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అనారోగ్యంతో అందులోనూ ఆయాసంతో ఉన్న వ్యక్తిని టెస్టు చేయించుకోమనడం ఆస్పత్రి సిబ్బంది చెప్పడం సమంజసమే. అయినప్పటికీ కరోనా అనుమానం అనారోగ్యంతో ఉన్న వ్యక్తి గుండె ఆగేలా చేసింది.

మరిన్ని వార్తలు