ఉత్కంఠ రేపుతున్న శ్రీమఠం ‘కరెన్సీ’ కథ

25 Aug, 2019 08:06 IST|Sakshi
ఎస్‌ఐ మధుసూదన్‌కు ఫిర్యాదు అందజేస్తున్న కోడుమూరు వాసి అనిల్‌శర్మ  

స్టేషన్‌లో పరస్పర ఫిర్యాదులు 

శ్రీమఠం ఉద్యోగుల నుంచి హాని ఉందంటూ భక్తుడు మరో ఫిర్యాదు 

సాక్షి, మంత్రాలయం : కరెన్సీ కథ మలుపులు తిరుగుతూనే ఉంది. ఒకరిపై ఒకరు ఫిర్యాదుల పర్వం కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు సమస్య జటిలం కావడంతోపాటు ఉత్కంఠను రేపుతోంది. ఈనెల 18న రాఘవేంద్రస్వామి మహారథోత్సవం సందర్భంగా పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు రూ.100 కరెన్సీ నోట్లు విసరడంతో మొదలైన వివాదం ఆజ్యం పోసుకుంటోంది. నోట్లు విసిరి తొక్కిసలాటకు కారకులైన మఠాధీశులపై కేసు నమోదు చేయాలంటూ సీఐ కృష్ణయ్యకు 22న మంత్రాలయానికి చెందిన వి.నారాయణ ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం మఠం ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టాలని ఉదయం నుంచి సాయంత్రం వరకు మల్లగుల్లాలు పడి చివరకు మిన్నకుండిపోయారు.

మఠం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పీఠాధిపతిపై కేసు నమోదుకు ఫిర్యాదు చేయడం ఇదే ప్రథమం. అయితే పీఠాధిపతిపై ఫిర్యాదు చేసిన నారాయణపై కేసు నమోదు చేయాలంటూ కోడుమూరుకు చెందిన అనిల్‌శర్మ అనే అర్చకుడు ఫిర్యాదు చేశాడు. శుక్రవారం సాయంత్రం కర్నూలులో ఓఎస్‌డీ రామాంజనేయులుకు ఫిర్యాదు చేయగా మంత్రాలయం స్టేషన్‌కు ఎండార్స్‌ చేశారు. శనివారం అనిల్‌ శర్మ తన సహచరులతో కలిసి వచ్చి ఎస్‌ఐ మధుసూదన్‌కు ఫిర్యాదు అందజేశారు. పీఠాధిపతిని బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారని, గతంలోనూ పీఠాధిపతి పట్ల అనుచిత వాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలా ఉండగా నారాయణ సైతం మరోమారు స్టేషన్‌ మెట్లెక్కారు. కొందరు మఠం ఉద్యోగులు శుక్రవారం తనపై అనుచిత వాఖ్యలు చేయడమే గాకుండా ఇంటిని ముట్టడిస్తామని చర్చించారని ఎస్‌ఐకి ఫిర్యాదు చేశాడు. ముగ్గురు ఉద్యోగుల నుంచి తనకు హాని ఉందని వారి పేర్లు, ఫోన్‌నంబర్లు ఎస్‌ఐకి అందజేశాడు. ఇలా ఫిర్యాదుల పర్వంతో కరెన్సీ కథ రక్తి కట్టిస్తోంది. రోజురోజుకు మలుపులు తిరుగుతుండటంతో ఆసక్తి నెలకొంది. ఎంత వరకు ఈ వ్యవహారం దారి తీస్తుందో వేచిచూద్దాం.. 
ఇది చదవండి : నోట్లు విసిరిన మంత్రాలయం మఠాధీశులు.. తీవ్ర వివాదం

మరిన్ని వార్తలు