భయం గుప్పెట్లో మన్యం

27 May, 2015 23:51 IST|Sakshi
భయం గుప్పెట్లో మన్యం

బాక్సైట్‌కు వ్యతిరేకంగా ఆదివాసీలతో ఉద్యమానికి మావోయిస్టులు అడుగులు వేస్తుండగా, వారిని ఆదిలోనే అడ్డుకునేందుకు పోలీసులు బలగాలు మన్యాన్ని చుట్టుముట్టడంతో అంతటా భయానక వాతావరణం చోటుచేసుకుంది. ఏక్షణాన ఏమి జరుగుతుందోనని బిక్కుబిక్కు మంటూ గిరిపుత్రులు కాలం వెళ్లదీస్తున్నారు. కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీ కునుకూరు-పోకలపాలెం మధ్య బుధవారం నాటి ఎదురు కాల్పుల ఘటన ఇందుకు నిదర్శనం.
- కునుకూరులో ఎదురు కాల్పుల కలకలం
- మన్యాన్ని చుట్టుముట్టిన పోలీసు బలగాలు
- మావోయిస్టు అగ్రనేత చలపతిపై గురి
కొయ్యూరు:
మావోయిస్టుల కదలికలు పెరగడం.. మరోవైపు పోలీసుల కూంబింగ్ ఉధృతంతో మన్యం భయం గుప్పెట్లోకి వెళ్లింది. కొద్ది రోజులుగా బాక్సైట్‌కు వ్యతిరేకంగా మారుమూల గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ఉద్యమానికి పిలుపునిస్తున్న మావోయిస్టు అగ్రనేత చలపతిపై పోలీసులు గురిపెట్టారు. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో కీలక నేతగా ఉన్న ఇతని కదలికలు మండలంలోని బూదరాళ్ల పంచాయతీలో కొనసాగుతున్నట్టుగా తెలుసుకున్న పోలీసులు పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. బాక్సైట్ తవ్వకాలను అడ్డుకునేందుకు దళసభ్యులు గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి ఉద్యమానికి పిలుపునిస్తున్నారు. ఇందులో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేస్తున్నారు. వారి ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపట్టాలని స్పష్టం చేస్తున్నారు. ఇది గమనించిన పోలీసులు ప్రజాప్రతినిధులకు కౌన్సెలింగ్ చేస్తున్నారు. ఎలాంటి ఆందోళనలు చేపట్టరాదని చెబుతున్నారు. అటు మావోయిస్టుల మాట వినకుంటే ప్రాణా లు పోతాయన్న భ య ం ఒక వైపు...పోలీసులను కాదని వెళితే ఇబ్బందులు వస్తాయన్న ఆందోళన  ప్రజాప్రతినిధులను వెంటాడుతోంది.  

టీడీపీ నేతలపై గురి
ముఖ్యంగా టీడీపీ నేతలపై మావోయిస్టులు గురిపెట్టినట్టుగా తెలుస్తోంది. బాక్సైట్ విషయమై వారు నోరు మెదపక పోవడంతో పాటు గిరిజనుల పోరాటంలో పాల్గొనకపోవడాన్ని గమనించిన దళసభ్యులు ఆగ్రహంతో ఉన్నారు. ఇటీవల గిరిజనులతో సమావేశంలో ఇదే విషయాన్ని ప్రధానంగా చర్చించినట్టు తెలిసింది. వచ్చే నెల 3న టీడీపీ నేతల ఇళ్ల ఇద్ద ఆందోళనకు పిలుపునిచ్చారు. టీడీపీ నేతలు,కార్యకర్తలు ఆందోళనకు రాకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించినట్టు భోగట్టా. ఈ నేపథ్యంలో మండలంలోని కునుకూరు వద్ద బుధవారం ఎదురు కాల్పుల ఘటనతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. నలువైపుల నుంచి కూంబిం గ్‌ను ఉధృతం చేశారు. దీంతో ఏ క్షణాన ఏమి జరుగుతుందోనన్న భయాందోళనలు గిరిజనుల్లో వ్యక్తమవుతోంది.

కునుకూరులో భయాందోళనలు
ఎదురు కాల్పులతో కునుకూరు గ్రామస్తులు భయంతో వణికిపోతున్నార. ఈ సంఘటనలో ఎవరికీ ఏమీ కాకున్నా..మున్ముందు ఎవరి నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయోని ఆందోళన చెందుతున్నారు. ఇంటి నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. 2007లో ఈ గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలోని కన్నవరంలో జరిగిన ఎన్‌కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. నాటి నుంచి ఈ ప్రాంతంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు.

మరిన్ని వార్తలు