మార్చి 4న కొవ్వొత్తులతో నిరసన

15 Feb, 2018 16:16 IST|Sakshi
ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వీనర్‌ కొణతాల రామకృష్ణ

సాక్షి, విశాఖపట్నం : రాష్ర్ట విభజన హామీల అమలు కోసం మార్చి 4న కొవ్వొత్తులతో మహా నిరసన ప్రదర్శ నిర్వహించాలని ఉత్తరాంధ్ర చర్చా వేదిక తలపెట్టింది. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వీనర్‌గా కొనసాగుతున్నారు. ఈ నెల 12 నుంచి నర్సీపట్నం, విజయనగరం, మాడుగుల ప్రాంతాల్లో చేపట్టిన ‘ ఉత్తరాంధ్ర జనఘోష’ కార్యక్రమాలు విజయవంతం కావడంతో మార్చి 2 వరకు ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాలో ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్దమయ్యారు. పార్లమెంటు సమావేశాలకు ఒకరోజు ముందు విశాఖ ఆర్కే బీచ్‌లో ఈ కొవ్వొత్తుల మహా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

రాష్ర్టంలోని అన్ని పార్టీల నాయకులను స్వయంగా వెళ్లి ఆహ్వానించాలని కొణతాల యోచిస్తున్నారు. విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల సాధనే లక్ష్యంగా ఈ పోరాటం సాగుతుందని తెలిపారు. ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్రకు బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీ, ప్రత్యేక రైల్వే జోన్‌, రాయలసీమ అభివృద్ధి మండలి ఏర్పాటు, ఎయిమ్స్‌ ఆసుపత్రి,  విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు, విశాఖ మెట్రో రైలు, ఒడిశాతో ఉన్న జలవివాదాల పరిష్కారం వంటి హామీల సాధనే లక్ష్యంగా మహా నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు.

రాష్ర్ట విభజన హామీల అమలు కోసం అన్ని పార్టీలను ఒకే తాటిపై తెచ్చేందుకు ఉ‍త్తరాంధ్ర చర్చావేదిక ఆహ్వానం పంపుతుందని తెలిపింది.  కొవ్వొత్తుల మహా ప్రదర్శనలో అన్ని రాజకీయ పార్టీలను భాగస్వాములను చేస్తున్నప్పటికీ ఆయా పార్టీలేవీ తమ జెండాలను ప్రదర్శించకూడదనే షరతులు విధించింది. ఈ కొవ్వొత్తుల మహా ప్రదర్శనలో పాల్గొనే వారంతా ఎవరికి వారే స్వచ్ఛందంగా కొవ్వొత్తులు తెచ్చుకునేలా పిలుపునివ్వాలని ఉత్తరాంధ్ర చర్చావేదిక నిర్ణయించింది. కేంద్ర హామీల అమలుతో పాటు రాష్ర్ట వార్షిక బడ్జెట్‌లోనూ ఉత్తరాంధ్ర వాటా కోసం ఈ ప్రదర్శన ద్వారా ఒత్తిడి తేవాలని ఉత్తరాంధ్ర చర్చావేదిక నాయకులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు