మాస్‌ కాపీయింగ్‌కు తెరపడేనా?  

26 Nov, 2018 14:44 IST|Sakshi

పది పరీక్షల నిర్వహణలో మార్పులకు శ్రీకారం

ప్రభుత్వ స్కూల్లోనే పరీక్షల నిర్వహణ

పెదవి విరుస్తున్న టీచర్లు

సాక్షి, ముదినేపల్లి రూరల్‌: పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ నిరోధించేందుకు విద్యాశాఖ ప్రభుత్వ స్కూళ్లల్లో మాత్రమే పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వచ్చే మార్చిలో జరగబోయే పరీక్షలకు ఇప్పటి నుంచే సన్నాహాలు చేపట్టారు. కేవలం పరీక్షా కేంద్రాల మార్పు వల్లే మాస్‌ కాపీయింగ్‌ నిరోధించడం ఏమేరకు సాధ్యపడుతుందనేది నియోజకవర్గంలోని ఉపాధ్యాయుల్లో చర్చనీయాంశంగా మారింది.


ఉత్తమ ఫలితాల కోసం అడ్డదారులు
ఇప్పటివరకు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో పరీక్షా కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ప్రైవేట్‌ స్కూళ్ల విద్యార్థులు ప్రభుత్వస్కూళ్లలోనూ, ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లలోని కేంద్రాల్లో పరీక్షలు రాస్తున్నారు.

ఇన్విజిలేటర్లు, డీవోలు, సీఎస్‌లుగా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులే విధులు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ ఫలితాల కోసం ప్రైవేటు విద్యాసంస్థల నిర్వాహకులు ప్రభుత్వ స్కూళ్ల ఉపాధ్యాయులతో కుమ్మక్కై మాస్‌కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 


పేరుకే చట్టం
పరీక్షల్లో కాపీయింగ్‌ నిరోధించేందుకు విద్యాశాఖ యాక్ట్‌ 25 అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం విద్యార్థి మాస్‌కాపీయింగ్‌ చేస్తు పట్టుబడితే విద్యార్థితో పాటు ఇన్విజిలేటర్, చీఫ్‌ సూపరెంటెండెంట్‌ బాధ్యత వహించాల్సి ఉంది. వీరిని విధుల నుంచి తప్పించడంతో పాటు జరిమానా, సస్పెన్షన్, జైలు శిక్ష విధించాలి. అయితే ఈ చట్టం పేరుకే తప్ప ఆచరణలో ఎక్కడా అమలు కావడం లేదు.

దీని ప్రకారం ఇప్పటి వరకు ఏ ఒక్క ఉపాధ్యాయుడిని బాధ్యుడిని చేయలేదంటే మాస్‌కాపీయింగ్‌ లేనట్లా? లేక చట్టాన్ని సక్రమంగా అమలుచేయడం లేదో అర్థంకాని పరిస్థితి. దీన్ని అమలు చేయాల్సిన స్క్వాడ్‌ అధికారులే మాస్‌ కాపీయింగ్‌ ప్రోత్సహిస్తూ యాక్ట్‌ 25ను అపహాçస్యం చేస్తున్నట్లు విమర్శలొస్తున్నాయి.


అధికారుల ఒత్తిడి
విద్యార్థుల సామర్థ్యాలతో పనిలేకుండా పది పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా అధికారులు ఉపాధ్యాయులపై ఒత్తిడి తేవడం ఆనవాయితీగా మారింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఫలితాల సాధన కోసం మాస్‌కాపీయింగ్‌ను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడుతున్నట్లు ఉపాధ్యాయులు వాపోతున్నారు.

ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలనే ఒత్తిడి ఉన్నంత కాలం పరీక్షా కేంద్రాలు ఏవిధంగా మార్పు చేసినా మాస్‌కాపీయింగ్‌కు తెరపడదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. 

మరిన్ని వార్తలు