కాపీయింగ్‌ ఓపెన్‌

13 Oct, 2017 13:19 IST|Sakshi
ఓ మూలన కుర్చీలో కాపీలు పెట్టుకుని చూసి రాస్తున్న విద్యార్థిని

ఎన్‌ఐఓఎస్‌ పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌

బహిరంగంగానే పుస్తకాలు పెట్టి రాయిస్తున్న వైనం

ఫ్లయింగ్, సిట్టింగ్‌ స్క్వాడ్‌లు ఉండగానే చూచిరాతలు

నెల్లూరు (టౌన్‌): కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఓపన్‌ స్కూల్‌ పరీక్షలు(ఎన్‌ఐఓఎస్‌) అపహాస్యం పాలవుతున్నాయి. విద్యా కేంద్రాలు, పరీక్ష నిర్వహణ సెంటర్ల నిర్వాహకులు కుమ్మక్కై పుస్తకాలను బహిరంగంగానే పెట్టి విద్యార్థులతో పరీక్షలు రాయిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్న ఫ్లయింగ్, సిట్టింగ్‌ స్క్వాడ్‌ అధికారులు ఇదంతా మామూలేనని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

బడి బయట పిల్లలు, రోజు బడికి వచ్చి చదువుకోలేని వారి కోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపన్‌ స్కూల్‌ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఏటా పది, ఇంటర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈనెల 6 నుంచి 23వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలను పొదలకూరు రోడ్డులోని కేంద్రీయ విద్యాలయం,  తెలుగుగంగ కార్యాలయం వద్దనున్న సింహపురి ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌లో నిర్వహిస్తున్నారు. కేంద్రీయ విద్యాలయంలో 300 మంది, సింహపురి స్కూల్‌లో 173 మంది పరీక్షలు రాస్తున్నారు. ఇప్పటికే రెండు పరీక్షలు ముగిశాయి. గురువారం జరిగిన హిందీ పరీక్షకు హాజరైన వారికి సింహపురి పరీక్ష కేంద్రంలో నిర్వాహకులు బహిరంగంగానే పుస్తకాలు అందించి రాయిస్తున్నారు. ఒక్కో గదిలో ఒకరు లేదా ఇద్దర్ని కూర్చొబెట్టి పరీక్షలు రాయిస్తుండగా, మరికొన్ని గదిలో పది అంతకంటే మించి అభ్యర్థులు పరీక్షలు రాయడం కనిపించింది. పాఠశాల లోపలకు ఎవరూ రాకుండా గేట్లు మూసివేసి జాగ్రత్తపడ్డారు. విద్యార్థులు పుస్తకాలు చూసి రాస్తున్న సమయంలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు బంగారయ్య, సుబ్బారావు, సిట్టింగ్‌ స్క్వాడ్‌ వెంకటేశ్వర్లు  సెంటరులోనే ఉండడం గమనార్హం. వారి సమక్షంలోనే మాస్‌ కాపీయింగ్‌ జరుగుతున్నా పరీక్షలు పకడ్బంధీగా జరుగుతున్నాయని బుకాయిస్తున్నారు. కేంద్రీయ విద్యాలయంలోనూ ఇదే తరహాలో జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.

లక్షలు చేతులు మారినట్లు ఆరోపణలు
ఎన్‌ఐఓఎస్‌ పరీక్షలకు లక్షల్లో చేతులు మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరీక్షలను కొంతమంది మాఫియాగా ఏర్పడి అంతావారై జరిపిస్తున్నారని చెబుతున్నారు. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడానికి ముందుగానే విద్యార్థుల నుంచి రూ. 20వేల నుంచి రూ.25 వేల వరకు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భాగంగానే పరీక్ష కేంద్రంలో బహిరంగంగా పుస్తకాలు, కాపీలు అందజేసి   పరీక్షలు రాయిస్తున్నట్లు సమాచారం. అభ్యర్థుల నుంచి వసూలు చేస్తున్న మొత్తాలను పరీక్ష సెంటర్‌ నిర్వాహకుల నుంచి ఫ్లయింగ్, సిట్టింగ్‌ స్క్వాడ్‌ అధికారులకు పంచుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ రీతిలో పరీక్షలు నిర్వహిస్తుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ఓపన్‌ పరీక్షలకు అభ్యర్థులు క్యూ కడుతున్నారు. కష్టపడకుండానే నేరుగా పట్టాలు చేతపట్టుకోవచ్చన్న భావన వీరిలో ఉండటంతో విద్యా కేంద్రాలు మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లుతున్నాయి.  ఈ విషయమైన ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ వెంకటేశ్వర్లును వివరణ కోరగా. పరీక్షలను పకడ్బంధీగా నిర్వహిస్తున్నాం. మాస్‌ కాపీయింగ్‌ ఎక్కడా జరగడం లేదు. మేం దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.

మరిన్ని వార్తలు