సర్వర్ జామ్

17 Nov, 2014 01:42 IST|Sakshi

ఉపకార వేతనాలు, ఫీజ్ రీయింబర్స్‌మెంట్ కోసం దరఖస్తు చేసుకునే గడువు ముగుస్తున్న తరుణంలో మీ సేవ కేంద్రాల  సర్వర్లు జామ్ కావడం విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. దరఖాస్తుతోపాటు కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాలు తప్పనిసరిగా జత చేయాల్సి ఉండటంతో వీటి కోసం పెద్ద సంఖ్యలో విద్యార్థులు మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ దరఖాస్తులను ఆయా మండలాల తహశీల్దార్లు పరిశీలించి మంజూరు చేస్తే.. మీ సేవ కేంద్రాలు ధ్రువపత్రాలు జారీ చేస్తాయి. అయితే గత రెండు రోజులుగా మీ సేవతోపాటు మండల కార్యాలయాల్లోని సర్వర్లు జామ్ కావడం, ఒక్కోసారి ధ్రువపత్రాలు జారీ చేసే సైట్ ఓపెన్ కాకపోవడంతో వీటి జారీ ప్రక్రియతో తీవ్ర జాప్యం జరుగుతోంది. జిల్లాలో 230కి పైగా వివిధ రకాల కళాశాలలు ఉన్నాయి. వీటిలో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాలకు చెందిన సుమారు రెండు లక్షల మంది విద్యార్థులు ఉపకార వేతనాలు, ఫీజ్ రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. వీరిలో సుమారు లక్ష మంది రెన్యూవల్ విద్యార్థులు ఉన్నారు. కాగా రెన్యూవల్‌కు దరఖాస్తు గడువు ఈ నెల పదో తేదీతోనే ముగిసినప్పటికీ ప్రభుత్వం వారం రోజులు పొడిగించింది.
 
 ఆ గడువు కూడా సోమవారం ముగుస్తోంది. ఈ తరుణంలో సాంకేతిక సమస్యలతో ధ్రుపపత్రాలు అందక విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. మీ సేవ కేంద్రాలు, తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకునే గడువు కూడా ఈ నెల 30తో ముగుస్తున్నందున ఆ విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో ధ్రువపత్రాల కోసం ఎదురుచూస్తున్నారు. వీరికి తోడు 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థుల స్కాలర్‌షిప్పుల దరఖాస్తుకూ ఇదే సమయం కావడంతో మీ సేవ కేంద్రాలకు దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా అందుతున్నాయి. వీటిని స్వీకరించి, నమోదు చేయలేక కేంద్రాల్లోని సిబ్బంది అవస్థలు పడుతున్నారు. జిల్లాలో 38 మండలాలు, ఆరు మున్సిపాలిటీల పరిధిలో 80 వరకు మీ సేవ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో కేంద్రం నుంచి సగటున రోజుకు 500 వరకు దరఖాస్తులు తహశీల్దార్ కార్యాలయాలకు చేరుతున్నాయి. ఈ లెక్కన రోజుకు 40 వేల వరకు ధ్రువపత్రాలు జారీ చేయాల్సిన పరిస్థితి ఉంది.  ఈ సమయంలో సర్వర్లు పనిచేయకపోవడం,  నెట్ కనెక్ట్ కాకపోవడం వంటి సాంకేతిక సమస్యలు తలెత్తడం అటు అధికారులను, ఇటు విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
 

మరిన్ని వార్తలు