సిండి‘కేటుగాళ్లు’

3 Jul, 2019 07:03 IST|Sakshi

సాక్షి, పలాస(శ్రీకాకుళం) : జీడి పప్పు ఉత్పత్తిలో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న పలాస జీడి పరిశ్రమలు ప్రస్తుతం దళారుల కనుసన్నల్లో నడుస్తున్నాయి. ఇక్కడ దళారులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా ధరలు ఉంటున్నాయి. జీడి పిక్కలు, జీడి పప్పు ధరలను వారు నిర్ణయించే స్థితికి నేడు దిగజారాయి. పలాస ప్రాంతం నుంచి గతంలో పరిశ్రమదారులు నేరుగా దేశంలోని కోల్‌కతా, ముంబయి, చెన్నై, హైదరాబాద్, విజయవాడ, గుజరాత్‌ వంటి వివిధ ప్రాంతాలకు జీడి పప్పును డిమాండ్‌ ఉన్న మేరకు స్వేచ్ఛగా విక్రయించుకునే వారు. జీడి పప్పు ధర ఆధారంగా పిక్కల ధరలు కూడా నిర్ణయించేవారు. కాలక్రమేణా జీడి పప్పు ఎగుమతి కొద్ది మంది దళారుల చేతిల్లోకి వెళ్లిపోయింది. గతేడాది ఈ సీజన్‌లో జీడి పిక్కలు కొనుగోళ్లు ఉద్దానంలో ముమ్మరంగా చేపట్టారు. అప్పట్లో ఒక్కో బస్తా(80కిలోలు) జీడి పిక్కల ధర రూ.13వేలు ఉండేది. ఈ ఏడాది ప్రస్తుతం ఉద్దానం ప్రాంతంలో వ్యాపారులు ఒక బస్తాను రూ. 9వేలకు కొంటున్నారు. కొన్ని గ్రామాల్లో జీడి పప్పు దిగుబడులు బాగా లేవనే నెపంతో రూ.8,600లకు కొంటున్నారు. తప్పని పరిస్థితిలో విక్రయించాల్సిన పరిస్థితి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. \

ఇబ్బడి ముబ్బడిగా విదేశీ పిక్కలు 
గతేడాది అక్టోబర్‌లో వచ్చిన తిత్లీ తుపానుకు జీడి తోటలు సర్వనాశనం అయ్యాయి. అక్కడక్కడ మిగిలిన చెట్లుకు చిగుర్లు వచ్చి జీడి పిక్కలు కాపునకు వచ్చాయంటే ప్రస్తుతం గిట్టుబాటు ధర లభించడం లేదు. ఉద్దానంలో పరిస్థితి ఇలా ఉంటే పలాస జీడి పరిశ్రమలకు విదేశాల నుంచి పిక్కలు ఇబ్బడి ముబ్బడిగా వస్తున్నాయి. దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, ఘనా, టాంజినియా, బిసావో తదితర దేశాల నుంచి పలాస పట్టణానికి చెందిన కొద్ది మంది దళారులు జీడి పిక్కలను దిగుమితి చేస్తున్నారు. వారు విశాఖపట్నం పోర్టు నుంచి ఈ పిక్కలను తీసుకొచ్చి గొడౌన్లలో నిల్వ చేస్తున్నారు. అవసరం కొద్ది కృత్రిమ డిమాండ్‌ను సృష్టించి పిక్కలను స్థానిక వ్యాపారులకు విక్రయిస్తున్నారు. గత నెలలో ఈ జీడి పిక్కల బస్తా ధర రూ.6వేలు ఉండగా నేడు వాటిని పప్పు దిగుబడి పేరుతో రూ.6వేల నుంచి రూ.8వేలకు విక్రయిస్తున్నారు. జీడి పప్పు, పిక్కల ధర మొదటిలో డిమాండ్‌ను బట్టి ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని, దళారుల చేతిలోకి వెళ్లి పోయిందని స్థానిక వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

చీటీలపై ఆర్థిక లావాదేవీలు..
దళారులు, స్థానిక వ్యాపారులకు మధ్య జరిగే ఆర్థిక లావాదేవీలు కూడా అకౌంట్‌ ఫర్‌ కాకుండా జాగ్రత్తపడుతున్నారు. చిన్న చీటీలపై ఆర్థిక లావాదేవీలు నడుస్తున్నాయి. దీంతో ఎవరు ఎప్పుడు ఏ ధర ఇచ్చి కొంటున్నారు. అమ్ముతున్నారు అనే దానికి ఆధారాలు ఉండవు. ఈ విధంగా దళారుల  చేతిలో పడి జీడి వ్యాపారులు నలిగిపోతుండగా జీడి రైతులు కూడా గిట్టు బాటు ధరలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. పలాస నియోజకవర్గ స్థాయిలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఉన్నప్పటికీ ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు ఉంది. ఇప్పటికైనా మార్కెట్‌ కమిటీ అధికారులు ఎప్పటికప్పుడు జీడి పిక్కల ధరలు ప్రకటించి రైతులకు న్యాయం చేయాలని రైతు సంఘ నాయకులు కోరుతున్నారు.    

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు