రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మెడికోల మృతి

15 Apr, 2018 07:10 IST|Sakshi

కొణిజర్ల (ఖమ్మం జిల్లా) : వైద్యులుగా పీజీ చదువు పూర్తి చేసి మరి కొద్దిరోజుల్లో తమ స్వంత స్థలాలకు వెళ్లి ఎందరికో బతుకును ఇవ్వాల్సిన మెడికోలను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. కారు, కంటైనర్‌ లారీ ఢీకొని ఇద్దరు మమత వైద్య కళాశాలకు చెందిన పీజీ వైద్య విద్యార్థు«లు మృతి చెందిన ఘటన మండలంలోని తనికెళ్ల సమీపంలో శనివారం సాయంత్రం జరిగింది. 

వైరా సీఐ మల్లయ్యస్వామి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపంలోని శ్రీరామపురానికి చెందిన డాక్టర్‌ బండారు సిద్ధార్థ (27), పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సమీపంలోని నలజర్ల గ్రామానికి చెందిన డాక్టర్‌ పులివర్తి  సూర్యకిరణ్‌ (31) ఖమ్మంలోని మమత మెడికల్‌ కళాశాలలో పీజీ విద్యను అభ్యసిస్తున్నారు. సూర్యకిరణ్‌ కార్డియాలజీలో ఎండీ డీఎం చదువుతుండగా, సిద్ధార్థ« అనస్తీషియా విభాగంలో పీజీ చేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం కళాశాలకు సెలవు దినం కావడంతో సరదాగా గడిపేందుకు వైరా వైపు కారులో వెళ్లి తిరిగి ఖమ్మం వస్తుండగా వైరా వైపు నుంచి వస్తున్న కంటైనర్‌ లారీ ఢీకొట్టింది. 

ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసం అయ్యింది. దీంతో డాక్టర్‌ సిద్ధార్థ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సూర్యకిరణ్‌కు తీవ్ర గాయాలు కావడంతో మమత వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సూర్యకిరణ్‌కు గత ఏడాదే వివాహం జరిగింది. మృతుడి భార్య కూడా పీజీ వైద్య విద్యార్థిని. సిద్ధార్థ అవివాహితుడు. కారులో చిక్కుకున్న డాక్టర్‌ సిద్ధార్థ మృతదేహాన్ని అతి కష్టంగా జేసీబీ సాయంతో బయటకు తీయించారు. సీఐ మల్లయ్యస్వామి పర్యవేక్షణలో ఎస్‌ఐ సురేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు