రోడ్డు ప్రమాదంలో వ్యాపారి మృతి...

23 Aug, 2013 04:17 IST|Sakshi
 టేకులపల్లి, న్యూస్‌లైన్: ఆర్టీసీబస్సు, ద్వి చక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, అతని భార్య తీవ్రంగా గాయపడింది. మండలంలోని తొమ్మిదోమైలు తండా సమీపంలో గురువారం చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసుల సమాచారం వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రంలోని బోడురోడ్డు రేగులతండాకు చెందిన చిక్కాశ్రీకాంత్(35) కిరాణ వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాడు. గురువా రం ఆయన తన భార్య సీతమ్మతో కలిసి ద్విచక్ర వాహనంపై ఇల్లెందు బయలుదేరాడు. తొమ్మిదోమైలు తండా దాటిన తర్వాత సాయినపల్లి రోడ్డుకు సమీపంలో ఆ ద్విచక్ర వాహనం, ఎదురుగా ఇల్లెందు నుంచి వస్తున్న కొత్తగూడెం డిపో బస్సు అదుపు తప్పి ఢీకొన్నాయి.
 
 ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీకాంత్  అక్కడికక్కడే మృతి చెందగా భార్య సీత మ్మ తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు పక్కనే ఉన్న చెట్లలోకి దూసుకెళ్లింది. మృతుడికి ఇద్దరు పిల్లలు వశిష్ట్, వర్ణిక ఉన్నారు. వీరిద్దరు కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సతీష్ తెలిపారు. మృతదేహానికి ఇల్లెందులో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. 
 
మరిన్ని వార్తలు