కడుపు కొడుతున్నారు!

30 Jun, 2018 11:54 IST|Sakshi
కలెక్టరేట్‌ వద్ద పోలీసులు, కార్మికుల మధ్య తోపులాట

ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మధ్యాహ్న భోజన పథకం వర్కర్ల ధర్నా

కలెక్టరేట్‌ ముట్టడికి యత్నం

పోలీసులకు, వర్కర్ల మధ్య తోపులాట

వర్కర్ల అరెస్టు పోలీస్‌ వాహనం అడ్డగింత

చిలకలపూడి(మచిలీపట్నం): పాఠశాల విద్యార్థులకు తల్లిలా ఆహారం అందిస్తున్న తమ పొట్టను కొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమంలో భాగంగా ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ ముట్టడికి కార్మికులు ప్రయత్నించగా పోలీసులు అడ్డగించారు. ఈ సందర్భంగా పోలీసులు, కార్మికులకు మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. అనంతరం అడ్డు వచ్చిన కార్మికులను పోలీసులు ఈడ్చుకుని వెళ్లి వ్యాన్‌లో ఎక్కించారు. దీంతో కార్మికులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. కార్మికులను తరలిస్తున్న పోలీస్‌ వాహనాన్ని కార్మికులు సుమారు గంటపాటు అడ్డుకుని నినాదాలు చేశారు. పోలీసులు రోప్‌ పార్టీ ద్వారా కార్మికులను చెదరగొట్టేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. కార్మికులు ఒక్క తాటిపై పోలీస్‌ వాహనాన్ని ఎటువైపు వెళ్లకుండా నిర్బంధించారు. అనంతరం కార్మికులను తోసుకుంటూ పోలీస్‌వాహనాన్ని చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

వడ్డించడానికి ఉపయోగిస్తారా
మధ్యాహ్న భోజన పథకంలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న కార్మికులను ఒక్కసారిగా తొలగించి ప్రైవేటు సంస్థలకు అప్పగించి కేవలం వడ్డించేందుకు మాత్రమే కార్మికులను ఉపయోగిస్తామనమని పాలకులు చెప్పడం విడ్డూరంగా ఉందని సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.స్వరూపరాణి అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు, డీఈవోలు ఇప్పటికే ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేశారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 71 క్లస్టర్లను ఏర్పాటు చేసి క్లస్టర్ల వారీగా అక్షయపాత్ర తదితర సంస్థలకు అప్పగిస్తున్నారన్నారు. దీనిపై విద్యాశాఖ మంత్రి నివాసం వద్ద తాము ధర్నా చేసినప్పటికీ పట్టించుకోలేదన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఇస్తున్న కనీస వేతనాలను కూడా మన రాష్ట్రంలో అమలు చేసేందుకు పాలకులకు చేతులు రావడం లేదని ఆమె విమర్శించారు. 2007 నుంచి వేతనం పెంచకుండా ఈ వేతనాలతోనే జీవిస్తున్నామన్నారు. మెనూచార్జీలు కూడా పెంచకుండా పిల్లలకు అన్నం పెట్టాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తోందన్నారు.

ఇన్ని ఇబ్బందులు పెట్టి పాలకులు తమను పట్టించుకోకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 80వేల మంది కార్మికులు చంద్రబాబునాయుడుకు గుణపాఠం చెబుతారన్నారు. సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును జూలై 2న కలవనున్నామన్నారు. తమ సమస్యలపై ఆయన సానుకూలంగా స్పందించకపోతే చలో అమరావతి కార్యక్రమాన్ని కూడా నిర్వహించేందుకు కార్మికులు సిద్ధంగా ఉండాలన్నారు. సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నరసింహారావు, మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షురాలు పి. పార్వతి, ప్రధాన కార్యదర్శి ఎన్‌సీహెచ్‌ సుప్రజ, వి. జ్యోతి, వి.వెంకటేశ్వరమ్మ, గంగాభవాని, కేవీపీఎస్‌ నాయకులు సాల్మన్‌రాజు, కార్మికులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు