ఆ ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది..

21 Aug, 2019 14:44 IST|Sakshi

మాది రైతు పక్షపాత ప్రభుత్వం

వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు

సాక్షి, విజయవాడ: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వరదలను సైతం రాజకీయం చేయాలని చూస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మండిపడ్డారు. గత ప్రభుత్వం కౌలు రైతులను గాలికొదిలేసిందని విమర్శించారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పెద పులిపాకలో ముంపునకు గురైన పంటపొలాల రైతులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కౌలు రైతులకు హక్కు చట్టం తెచ్చిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. రైతు కష్టాన్నిఎవరూ కొలవలేరని..  గొడ్డొచ్చిన వేళ.. బిడ్డొచ్చిన వేళ అంటారు..  రాష్ట ప్రజలను బిడ్డలా చూసుకునే వైఎస్‌ జగన్‌ సీఎంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో పరిస్థితి ఒక కంట కన్నీరు.. మరో కంట పన్నీరు అన్న చందంగా ఉందని వ్యాఖ్యానించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జలాశయాలు నిండి కళకళలాడుతున్నాయన్నారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం.. రైతు పక్షపాత ప్రభుత్వమని వైఎస్‌ జగన్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం రోజునే చెప్పారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన నెలరోజుల లోపే రైతులకు పెద్దపీట వేసేలా నిర్ణయాలు తీసుకున్నామన్నారు. మాది మానవతా దృక్ఫథంతో పనిచేసే ప్రభుత్వం అని పేర్కొన్నారు. జిల్లాలో 25వేల ఎకరాలలో పంట నష్టం వాటిల్లిందన్నారు. పంట నష్టపోయిన రైతులకు పంటలు వేసుకునేందుకు ఉచితంగా విత్తనాలు ఇస్తామన్నారు. అన్ని విత్తనాలు నూరు శాతం సబ్సిడీపై అందించే విధంగా ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారని  వెల్లడించారు. రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దాని కన్నా ఎక్కువ ఇచ్చేలా చేస్తామన్నారు. అన్ని పంటలు ఇన్సూరెన్స్‌ పరిధిలోకి తెచ్చేలా నిర్ణయం తీసుకుంటామన్నారు. జిల్లాలో బ్యాంకర్లతో మాట్లాడి రుణాలు రీ షెడ్యూల్‌ చేసేవిధంగా సూచిస్తామన్నారు.

రైతులకు పూర్తి న్యాయం చేస్తాం: మంత్రి కొడాలి నాని
జిల్లాలో 10వేల హెక్టార్ల పంట దెబ్బతిందని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. ముంపు ప్రాంతాల్లో పర్యటించి రైతులకు భరోసా ఇచ్చామని తెలిపారు. ప్రతి ఎకరాకు నష్టపరిహారం అందేలా చేసి..రైతులకు పూర్తి న్యాయం చేస్తామని చెప్పారు.

జిల్లాలో ఉద్యాన, వాణిజ్య పంటలకు తీవ్ర నష్టం:అగ్రికల్చర్‌ కమిషనర్‌
వరదలు కారణంగా కృష్ణ, గుంటూరు జిల్లాల్లో ఉద్యాన, వాణిజ్య పంటలకు ఎక్కువ నష్టం వాటిల్లిందని అగ్రికల్చర్‌ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌ తెలిపారు. పసుపు, కంద రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు  పంట నష్ట నివేదికను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. కౌలు రైతులకు సైతం నష్ట పరిహారం ఇవ్వాలని సీఎం ఆదేశించారని తెలిపారు. భూమి
లేని కౌలు రైతులకు సైతం రైతు భరోసా అందిస్తామన్నారు. రైతులు నష్టపోకుండా ఇన్సూరెన్స్ కోసం రూ.1100 కోట్లు ప్రభుత్వం కేటాయించిందన్నారు. కేవలం రూపాయి నామమాత్రపు ప్రీమియం తో రైతులు పంట ఇన్సూరెన్స్ చేయిస్తే ప్రభుత్వమే రైతులు కట్టాల్సిన ప్రీమియం మొత్తం చెల్లిస్తుందన్నారు. 22 రకాల పంటలకు ఇన్సూరెన్స్ సదుపాయం ఉందని వెల్లడించారు.

ప్రతి రైతును ఆదుకుంటాం:పార్థసారధి
నియోజకవర్గ స్థాయిలో వాణిజ్య పంటలు ఎక్కువగా నష్టపోయారని..ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు.

ప్రతి ఎకరాకు నష్టపరిహారం అందిస్తాం: రక్షణ నిధి
ప్రతి రైతుకు నష్టపరిహారం అందించేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే రక్షణ నిధి అన్నారు. 8 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి ప్రకాశం బ్యారేజి 70 గేట్ల తెరిస్తే కనబడని ప్రతిపక్ష నేత.. 69 గేట్లు మూసివేసిన తర్వాత జిల్లాలో పర్యటనకు వచ్చారని చంద్రబాబును విమర్శించారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా