నిరూపిస్తే రాజీనామా చేస్తా: పెద్దిరెడ్డి

17 Dec, 2019 11:24 IST|Sakshi

సాక్షి, అమరావతి: కేంద్రం నుంచి 1845 కోట్ల రూపాయల ఉపాధి నిధులు వచ్చాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. మంగళవారం ఆయన శాసనసభలో మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనుల్లో భాగంగా వేల కిలోమీటర్లు రోడ్లు వేశామని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కూలి వేతనాలను చెల్లించామన్నారు.  ఉపాధి హామీకి బిల్లులు చెల్లించాలని కేంద్రాని మూడు సార్లు అడిగినా ఇవ్వలేదన్నారు.  నీరు-చెట్లు నిధులను టీడీపీ దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు. ‘నేను ముడుపులు తీసుకున్నానని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపిస్తున్నారు. నిరూపిస్తే రాజీనామా చేస్తా‘నని తెలిపారు. మేం నిధులను డైవర్ట్‌ చేశామని కేంద్రానికి టీడీపీ లేఖలు రాసిందన్నారు. రాష్ట్రానికి నిధులు  రాకూడదని టీడీపీ ఉద్దేశమా అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో 2,114 ఫిల్టర్‌ బెడ్లు ఉన్నాయని..వీటిలో 1350 ఫిల్టర్‌ బెడ్లు పనిచేస్తున్నాయన్నారు. గోదావరిలో కాలుష్యం వల్ల నీరు వడపోత కావడం లేదన్నారు. రూ.52.34 కోట్లతో ప్రతిపాదనలు పంపించామని వెల్లడించారు. ఇంకా  ఆ నిధులు మంజూరు కావాల్సి ఉందన్నారు. శ్రీకాకుళం ఉద్ధానం సహా అనేక ప్రాంతాల్లో రూ.46వేల కోట్లతో వాటర్‌ గ్రిడ్‌ ప్రతిపాదన ఉందన్నారు.

మరిన్ని వార్తలు