‘వారితో ఒక్క టెస్టు కూడా ఆడలేకపోయా’

17 Dec, 2019 11:31 IST|Sakshi

కరాచీ: తన టెస్టు కెరీర్‌లో ఇప్పటివరకూ 37 టెస్టులు ఆడి 207 వికెట్లు సాధించినప్పటికీ టీమిండియాతో ఒక్క టెస్టు మ్యాచ్‌ కూడా ఆడే అవకాశం రాలేదని పాకిస్తాన్‌ లెగ్‌ స్పిన్నర్‌ యాసిర్‌ షా ఆవేదన వ్యక్తం చేశాడు. పటిష్టమైన  భారత్‌తో కనీసం ఒక్క టెస్టు మ్యాచ్‌ కూడా ఆడే అవకాశం రాకపోవడం దురదృష్టంగా యాసిర్‌ అభివర్ణించాడు. పాకిస్తాన్‌  తరఫున 2011లో యాసిర్‌ అరంగేట్రం చేయగా, 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడుల తర్వాత  పాకిస్తాన్‌తో వారి దేశంలో భారత్‌ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడలేదు. దాంతో భారత్‌తో రెడ్‌ బాల్‌ క్రికెట్‌ను ఆడే అవకాశం యాసిర్‌కు రాలేదు.

దీనిపై  మాట్లాడిన యాసిర్‌.. ‘ టీమిండియాతో టెస్టు మ్యాచ్‌ కూడా ఆడకపోవడం నా కెరీర్‌లో ఒక దురదృష్టకరమైన ఘటనే. టెస్టుల్లో కోహ్లికి బౌలింగ్‌ చేయాలని ఎంతో ఆసక్తిగా ఉంది. కానీ వారితో టెస్టు ఆడే అవకాశం ఇప్పటివరకూ రాలేదు. భారత్‌తో ఆడాలనే ఉత్సాహం నాలో చాలా ఉంది. ఆ జట్టులో చాలా మంది టాప్‌ ఆటగాళ్లు ఉన్నారు. ఒక లెగ్‌ స్పిన్నర్‌గా నేను కోరుకునేది ఇదే. కోహ్లి స్థాయి వంటి ఆటగాడికి బౌలింగ్‌ చేయడం  కంటే ఆనందం ఏముంటుంది. త్వరలోనే భారత్‌తో ఆడే అవకాశం పాకిస్తాన్‌కు వస్తుందని ఆశిస్తున్నా’ అని యాసిర్‌ పేర్కొన్నాడు. 2012లో  భారత పర్యటనకు పాకిస్తాన్‌ వచ్చినప‍్పటికీ అది పరిమిత ఓవర్ల సిరీస్‌. కాకపోతే 2008 నుంచి ఇరు జట్లు ఎక్కడా కూడా కనీసం ఒక్క టెస్టు సిరీస్‌ను కూడా ఆడలేదు.

>
మరిన్ని వార్తలు