కార్లు, ఆటోను ఢీకొన్న లారీ

19 Sep, 2013 03:07 IST|Sakshi
 మోరంపూడి (రాజమండ్రి రూరల్), న్యూస్‌లైన్ : మోరంపూడి వద్ద జాతీయ రహదారిపై బుధవారం రాత్రి ఓ లారీ ఆటో, మూడు కార్లను ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. స్థానికుల కథనం ప్రకారం.. లాలాచెరువు వైపు నుంచి వేమగిరి వైపు వెళ్తున్న లోడు లారీ మోరంపూడి కూడలి వద్ద సిగ్నల్  పడడంతో డ్రైవర్ బ్రేకు వేశాడు. అయితే  లారీకి బ్రేకు పడకపోవడంతో ఆటోను ఢీకొంది. వేగంతో ఢీకొనడంతో ఆటో పక్కకు పోగా.. ముందున్న కారును లారీ బలంగా ఢీకొంది. ఆ కారు ఎదురు ఉన్న మరో కారును.. ఆ కారు మరో కారును ఢీకొన్నాయి. దీంతో లారీ ఢీకొన్న తొలి కారు వెనుకభాగం నుజ్జునుజ్జయింది. కారు వెనుక భాగంలో ఎవరూ లేకపోవడం.. ముందు కూర్చున్న వారిని అక్కడ ఉన్న కానిస్టేబుల్ రఘు జాగ్రత్తగా బయటకు తీయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మిగతా రెండు కార్లలో ఉన్నవారికి ఎటువంటి గాయాలు కాలేదు. ప్రమాద ఘటనను చూసిన వారు ఆందోళనకు గురయ్యారు. బొమ్మూరు ఇన్‌స్పెక్టర్ బి.సాయిరమేష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి కారణమైన లారీని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ప్రమాదంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాదాలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.
 
మరిన్ని వార్తలు