ఆర్టీసీ చూపు.. కార్గో వైపు !

2 Jul, 2020 09:19 IST|Sakshi
కార్గో లారీగా మార్పు చేసిన ఆర్టీసీ బస్సు

ఇకపై ప్రతి డిపో నుంచి కార్గో సర్వీసులు

ఇప్పటికే 39 బస్సుల మార్పు  

త్వరలో మరిన్ని సర్వీసులు పెంపు 

 కొత్తగా రవాణా కోసం లారీల కొనుగోలు యోచన

పబ్లిక్, ప్రైవేటు సంస్థలతో ఒప్పందాల విస్తృతికి ప్రయత్నాలు 

లాక్‌డౌన్‌ నష్టం పూడ్చుకునేందుకు విజయవాడ జోన్‌ సన్నాహాలు

సాక్షి, అమరావతి బ్యూరో: లాక్‌డౌన్‌ తెచ్చిన నష్టాన్ని పూడ్చుకోవడానికి ఆర్టీసీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం కార్గో సర్వీసుల పెంపుపై దృష్టి సారిస్తోంది. గతంలో అంటే.. లాక్‌డౌన్‌ ముందు వరకు కొరియర్, పార్శిల్‌ సేవల ద్వారా ఆర్టీసీ అదనపు ఆదాయాన్ని ఆర్జించేది. లాక్‌డౌన్‌ వల్ల రెండు నెలల పాటు ఆర్టీసీ సరీ్వసులను నిలిపివేసింది. ఫలితంగా ఈ జోన్‌ రోజుకు దాదాపు రూ.4 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. మే 21 నుంచి బస్సులను పాక్షికంగా తిప్పేందుకు ప్రభుత్వం అనుమతించింది. దీంతో కొన్ని బస్సులను నడుపుతున్నా గిట్టుబాటు కావడం లేదు. ఈ నేపథ్యంలో కార్గో సరీ్వసులను మరింతగా విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. ఆర్టీసీ విజయవాడ జోన్‌ పరిధిలో కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలున్నాయి.

ఈ జోన్‌లో 40 డీజీటీ (డిపో గూడ్స్‌ ట్రాన్స్‌పోర్ట్‌) బస్సులున్నాయి. ఇవికాకుండా 39 బస్సులను కార్గో సరీ్వసులుగా మార్పు చేశారు. వీటిలో కొన్నింటిని ఓపెన్‌ లారీలుగా మార్చారు. కార్గో రవాణాకు డిమాండ్‌ ఉండడంతో అధికారులు మరిన్ని సరీ్వసులను పెంచనున్నారు. ఇందుకోసం ఇకపై ప్రతి డిపో నుంచి ఒక కార్గో బస్సు నడపాలని, కొత్తగా లారీలను కొనుగోలు చేయాలని కూడా యోచిస్తున్నారు. ప్రస్తుతం రోజుకు ఈ జోన్‌లో కార్గో రవాణా ద్వారా రూ.3.50 లక్షల ఆదాయం సమకూరుతోంది. దీనిని రూ.7 లక్షలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కృష్ణా రీజియన్‌లో రోజుకు కార్గో రవాణా ద్వారా రూ.లక్షా 50 వేలు సమకూరుతోందని ఆర్‌ఎం నాగేంద్రప్రసాద్‌ ‘సాక్షి’తో చెప్పారు. ఏప్రిల్, మే, జూన్‌ నెలల్లో రూ.62 లక్షలు ఆర్జించామన్నారు. ఈ రీజియన్‌లోని 15 డిపోల్లో కార్గో బుకింగ్‌ పాయింట్లను ఏర్పాటు చేశామని, మరో ఎనిమిది చోట్ల ఏజెంట్ల బుకింగ్‌ సెంటర్లు, ఆరు చోట్ల బిజినెస్‌ ఫెసిలిటేటర్లను నియమించినట్టు తెలిపారు.  

మరిన్ని ఒప్పందాలపై దృష్టి.. 
ఆర్టీసీ కార్గోకు వస్తున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని మరిన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఏపీ సీడ్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్, మార్క్‌ఫెడ్, విద్యాశాఖలతో సరకు రవాణా ఒప్పందాలు జరిగాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అవసరమైన తొలివిడత పాఠ్య, నోట్‌ పుస్తకాలను ఆర్టీసీ కార్గో ద్వారానే రవాణా చేశారని ఆర్టీసీ డిప్యూటీ చీఫ్‌ మేనేజర్‌ (కమర్షియల్‌) కుప్పిలి శ్రీనివాసరావు  చెప్పారు. రైతులు, వ్యాపారులు మామిడి, జీడిమామిడి ఎగుమతులకు కార్గో బస్సులను వినియోగించారని, ఇంకా బల్క్‌ ఆర్డర్లను తీసుకుంటున్నామని తెలిపారు. తాజాగా ఎరువులు, సిమెంట్, పౌరసరఫరాల శాఖ సరకుల రవాణా ఆర్డరు పొందడానికి సంబంధిత సంస్థలు, కంపెనీలు, అధికారులను సంప్రదించాలని ఆర్టీసీ అధికారులు యోచిస్తున్నారు.  

ఆర్టీసీ ద్వారా కార్గో రవాణాకుసంప్రదించాల్సిన నంబర్లు..
 ఏటీఎం కమర్షియల్, కృష్ణా : 7331147264 
ఏటీఎం కమర్షియల్, గుంటూరు : 7331147265 
 ఏటీఎం కమర్షియల్, పశి్చమ గోదావరి : 7331147263 

మరిన్ని వార్తలు