అసువులు బాస్తున్న శిశువులు

15 Sep, 2018 07:18 IST|Sakshi

సంరక్షణలో ప్రభుత్వం ఘోర వైఫల్యం

50 శాతం ప్రసవాలు ప్రభుత్వాసుపత్రులలోనే

అయినా తగ్గుముఖం పట్టని మరణాలు

పశ్చిమగోదావరి, ఏలూరు (టూటౌన్‌): జిల్లాలో ఏటా వందల సంఖ్యలో ఉంటున్న శిశు మరణాల సంఖ్య వైద్యశాఖ నిర్లక్ష్యాన్ని చెప్పకనే చెబుతోంది. ప్రభుత్వ డొల్లతనాన్ని కూడా వెల్లడిస్తోంది. శిశుమరణాల నియంత్రణకు మెరుగైన చర్యలు తీసుకుంటున్నామనిరాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్రస్థాయిలో ఎక్కడా అమలు కావడం లేదు. శిశు మరణాలను అరికట్టడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందుతోంది. 0 నుండి 5 సంవత్సరాల వయస్సు కలిగిన చిన్నారులు పలు రకాల కారణాలతో ఇంకా వందల సంఖ్యలో ఏటా మృత్యువాత పడుతూనే ఉన్నారు. ఇటీవల ఉమ్మడి హైకోర్టు శిశు మరణాలపై స్పందిస్తూ శిశు మరణాలు తగ్గించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలపాలంటూ కేంద్ర ప్రభుత్వంతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను ప్రశ్నించింది.

మరణాల పెరుగుదలకు కారణాలు
శిశు మరణాల పెరుగుదలకు అనేక కారణాలను వైద్యులు చెబుతున్నారు. ప్రధానంగా చిన్న వయస్సులోనే వివాహాలు చేయడం, రక్త హీనత,  సరైన పోషకాహారం అందకపోవడం, వంశపారంపర్యంగా వచ్చే లోపాలు వల్ల ఈ మరణాలు అధికంగా ఉంటున్నట్లు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. గిరిజన ప్రాంతాల్లోని పిల్లలు, తల్లులకు పూర్తిస్థాయిలో పోషకాహారం అందకపోవడం మరో కారణంగా చెబుతున్నారు.

బాల్యవివాహాలు కూడా
జిల్లాలో బాల్య వివాహాలను అరికడుతున్నామని జిల్లా యంత్రాంగం చెబుతున్నా ఇంకా ఇవి జరుగుతూనే ఉన్నాయి. బాల్య వివాహాలు జరుగుతున్న సమాచారం అందిన వెంటనే అంగన్‌వాడీ సూపర్‌ వైజర్, అంగన్‌వాడీ టీచర్, ఏఎన్‌ఎం, స్థానిక పంచాయతీ కార్యదర్శి, వీఆర్‌ఓలు వెళ్లి వాటిని ఆపినా అవి తాత్కాలికమే. ఒక ప్రాంతంలో జరిగే దాన్ని ఆపితే కొద్ది రోజులు పోయిన తర్వాత వేరే ప్రాంతానికి వెళ్లి పెళ్లి తంతు కానిచ్చేస్తున్నారు. అంటే బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు సరైన అవగాహన కల్పించడంలో సంబంధిత శాఖ వైఫల్యం పూర్తిగా కన్పిస్తుంది.

జిల్లాలోని ఆస్పత్రుల వివరాలు
జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో 635 ఆరోగ్య ఉపకేంద్రాలు, 91 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 17 ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు, 2 పట్టణ ఆరోగ్యకేంద్రాలు (కొవ్వూరు, నిడదవోలు) ఉన్నాయి. వైద్య విధాన పరిషత్‌ పరిధిలో జిల్లా కేంద్రం ఏలూరులో ఒకటితో పాటు తాడేపల్లిగూడెం, తణుకు, జంగారెడ్డిగూడెం పట్టణాల్లో ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లు 14 పనిచేస్తున్నాయి. వీటితోపాటు జిల్లాలో 522 ప్రైవేటు ఆస్పత్రులు, ఆరు కార్పొరేట్‌ ఆస్పత్రులు, 327 ల్యాబ్‌లు ఉన్నాయి. 33 చోట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 24 గంటలు ప్రసూతి వైద్య సేవలు అందించే సదుపాయం ఉంది. జిల్లాలో 49 శాతం ప్రసవాలు ప్రభుత్వాసుపత్రుల్లోనే జరుగుతున్నాయి. అయినా శిశు మరణాల సంఖ్య తగ్గకపోవడంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.

పౌష్టికాహార లోపమే ప్రధానం
జిల్లాలో శిశు మరణాలకు వివిధ రకాల వైద్య కారణాలు ఒక వంతైతే దాని తర్వాత లోపం పోషకాహారమే. ఎక్కువ మంది పేద ప్రజలు సరైన పోషకాహారం అందకపోవడంతో మృత్యువాత పడుతున్నారు. గర్భిణులు, బాలింతలకు జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పోషకాహారం పూర్తిస్థాయిలో పోషకాలను అందించలేక పోతున్నదనే వాదనలు ఉన్నాయి. రోజుకు 125 గ్రాముల బియ్యం, 30 గ్రాముల పప్పు, 16 గ్రాముల ఆయిల్‌ను అందిస్తున్నారు. వీటితో పాటు గుడ్డు, పాలు కూడా ఇస్తున్నారు. లావు బియ్యం ఇస్తుండటంతో వాటిని తీసుకునేందుకు చాలా వరకూ ఇష్టపడటం లేదు. అలాగే ఆయా అంగన్‌వాడీ కేంద్రాలకు ఒకటికి నాలుగు సార్లు తిరగాల్సి రావడం వల్ల కూడా వాటిని తీసుకునేందుకు లబ్ధిదారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఉడికీ ఉడకని పప్పు, మింగుడు పడని బియ్యం తినలేకపోతున్నామని వారు చెబుతున్నారు. ఎన్ని పథకాలు ఉన్నా జిల్లాలోని శిశువులు, గర్భిణులు, బాలింతలకు పూర్తి స్థాయిలో పోషకాహారాన్ని అందించడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెరుగైన వైద్య సౌకర్యాలతో పాటు సరైన పోషకాహారం అందితేనే జిల్లాలో మాతా, శిశు మరణాలను పూర్తి స్థాయిలో అరికట్ట కలుగుతామనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

మరిన్ని వార్తలు