ఎంత పనిచేశావు తల్లీ

13 Aug, 2017 08:44 IST|Sakshi
ఎంత పనిచేశావు తల్లీ

వారిది అన్యోన్యమైన దాంపత్యం. ఇద్దరు బిడ్డలు. వారిని అపురూపంగా చూసుకుంటున్నారు. వ్యవసాయంలో వచ్చే అరకొర సంపాదనతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈ క్రమంలో బిడ్డలకు కొత్త దుస్తులు కొనివ్వాలన్న విషయంలో నెలకొన్న చిన్న వివాదం ఆ ఇంటిని చిన్నాభిన్నం చేసింది. క్షణికావేశంలో ఆ ఇల్లాలు తీసుకున్న నిర్ణయం ఇద్దరు చిన్నారులను బలి తీసుకుంది. ఆమె కూడా కొన ఊపిరితో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోంది. హృదయ విదారకమైన ఈ సంఘటన సదుం మండలంలో శనివారం చోటుచేసుకుంది.

- అత్తా, కోడలు మధ్య వివాదం
- క్షణికావేశానికి గురైన కోడలు


సదుం: కొత్త బట్టలు కొనుగోలు విషయం లో ఏర్పడిన వివాదంతో బిడ్డలకు విషమిచ్చిన తల్లి తానూ తినింది. ఎస్‌ఐ నాగరాజు కథనం మేరకు... స దుం మండలం కురవపల్లెకు చెందిన రైతు నాగేంద్రకు ఈశ్వరమ్మతో (22) వివాహం జరిగింది. వైష్ణవి (5), వర్షిణి (1) కుమార్తెలు ఉన్నారు. వైష్ణవి ఒకటో తరగతి చదువుతోంది. వర్షిణి అంగన్‌వాడీ పాఠశాలకు వెళుతోంది. వీరికి కొత్త దుస్తులు తీసివ్వాలని ఈశ్వరమ్మ అత్త వీరమ్మను శుక్రవారం కోరింది.  చిన్నమ్మాయి వర్షిణికి దుస్తులు కొనిచ్చింది.

మరోసారి  వైష్ణవికి కొనిస్తానని  వీరమ్మ పేర్కొంది. దీంతో వారి మధ్య వాగ్వా దం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈశ్వరమ్మ మనస్తాపం చెందింది. కుటుంబ సభ్యులు శనివారం పనులు చేసేందుకు వ్యవసాయ పొలానికి వెళ్లిన తర్వాత ఇద్దరు బిడ్డలకు విషపు గులికలు తినిపించిన ఈశ్వరమ్మ తానూ తీసుకుంది. ఉదయం 10 గంటల ప్రాంతంలో వీరమ్మ పొలం నుంచి ఇంటికి వచ్చింది. ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్న కోడలు, మనువరాళ్లను గమనించింది. స్థానికుల సాయంతో సదుం ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువచ్చింది. మార్గమధ్యంలోనే వర్షిణి మృతి చెందగా, వైద్యశాలలో వైష్ణవి మృతి చెందింది.

మరిన్ని వార్తలు