మాకు..అమ్మ కావాలి.!

21 Dec, 2018 11:59 IST|Sakshi
అమ్మ కావాలంటున్న చిన్నారులు ఇబ్రహీం ఖలీలుల్లా, హబీబా

ముగ్గురు పిల్లలను వదిలేసి వెళ్లిన తల్లి

అమ్మ,అత్త బతిమాలినా కరుణించని వైనం

న్యాయం చేయాలని వేడుకోలు

కడప రూరల్‌ : జన్మనిచ్చిన తల్లి తన బిడ్డలను కంటికి రెప్పలా చూసుకుంటుంది. ఇది అమ్మ నైజం. ఎంత కష్ట మొచ్చినా..నష్టమొచ్చినా కన్న పిల్లలను మాత్రం వదిలి ఉండదు. ఈ మాతృమూర్తి మాత్రం ఐదు నెలల క్రితం కన్న బిడ్డలను వదిలి మరొక చోట ఉంటోంది. పాపం అన్నెం పున్నెం తెలియని ఆ అమాయక పిల్లలు అమ్మపై బెంగపెట్టుకొని ఉన్నారు. స్థానిక యర్రముక్కపల్లె విశ్వనాథపురానికి చెందిన షేక్‌ మౌలాలీ, షేక్‌ కపీఫా భార్యాభర్తలు. వీరికి 12 సంవత్సరాల వయసు గల ఇబ్రహీం ఖలీలుల్లా, 9 సంవత్సరాల అబుబకర్‌సిద్దిక్, ఎనిమిదేళ్ల హబీబా అనే  చిన్నారులు ఉన్నారు. కాగా భార్యా, బిడ్డలను పోషించుకోవడానికి, ఉపాధి కోసం మౌలాలీ ఐదు నెలల క్రితం కువైట్‌కు వెళ్లాడు. అతను వెళ్లిన 10 రోజులకు కడప కార్పొరేషన్‌లో పని చేస్తున్న ఒక బిల్‌ కలెక్టర్‌ మౌలాలీ ఇంటి వద్దకు వచ్చాడు.

కపీఫాకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి వెంట తీసుకెళ్లాడు. అంతే అప్పటి నుంచి ఇప్పటి వరకు కపీఫా తిరిగి ఇంటికి రాలేదు. ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకెళ్లిన వ్యక్తి వద్దే ఉండిపోయింది. దీంతో పిల్లలు ఐదు నెలలుగా అమ్మ రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఎవరైనా అమ్మ గురించి అడిగితే ఏమి చెప్పాలో తెలియక పాపం ఆ పసి పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పిల్లలకు న్యాయం చేయాలని కపీఫా అమ్మ ప్యారీజాన్, అత్త ప్యారీ గురువారం స్థానిక జిల్లా అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం కార్యాలయాన్ని సంప్రదించారు. తమ పిల్లలకు న్యాయం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్‌ దస్తగిరికి వినతి పత్రం సమర్పించారు. అనంతరం కపీఫా అమ్మ, అత్తలు మాట్లాడుతూ కడప కార్పొరేషన్‌లో పని చేసే ఒక బిల్‌ కలెక్టర్‌ తమ బిడ్డకు మాయ మాటలు చెప్పి తీసుకెళ్లడమే గాక తమనే బెదిరిస్తున్నాడని ఆరోపించారు. తాము కపీఫా దగ్గరకు వెళ్లి బతిమలాడినా రానంటోందని తెలిపారు. పిల్లలు అమ్మ..అమ్మ అంటున్నారని, ఈ పసి బిడ్డలకు ఏమి చెప్పాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు దస్తగిరి మాట్లాడుతూ ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. అధికారులు చిన్నారుల మొరను ఆలకించి న్యాయం చేయాలని కోరారు.

మరిన్ని వార్తలు