‘హోదా’పై కేబినెట్‌ నిర్ణయాన్ని అమలుచేయాలి

19 Jul, 2019 04:18 IST|Sakshi

హోదాకు ఆర్థిక సంఘం అభ్యంతరం పెట్టలేదు

ఆర్థిక బిల్లుపై చర్చలో వైఎస్సార్‌సీపీ లోక్‌సభా పక్షనేత పీవీ మిథున్‌రెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వర్తింపజేస్తూ 2014 మార్చిలో కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని అమలుచేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభా పక్షనేత పీవీ మిథున్‌రెడ్డి కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. ఆర్థిక బిల్లుపై గురువారం లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కొత్త డిమాండ్‌ ఏమీ కాదు. 2014 మార్చిలో అప్పటి కేంద్ర కేబినెట్‌ ఏపీకి ప్రత్యేక హోదా వర్తింపజేయాలని నిర్ణయించింది. దానిని తక్షణం అమలుచేయాలని ప్రణాళిక సంఘానికి పంపింది. కానీ, గడిచిన ఐదేళ్లలో దీనిని అమలుచేయలేదు. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదాను ఆక్షేపించిందని సభలో పలుమార్లు చెప్పారు. కానీ, ఇది వాస్తవం కాదు. కేంద్రం ఒక్క సంతకంతో దానిని అమలుచేయవచ్చు.

ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న పరిస్థితుల దృష్ట్యా ప్రత్యేక హోదా అవసరం. రాష్ట్రంలో అప్పులు పేరుకుపోయాయి. కేంద్రం స్పందించేందుకు ఇది సరైన సమయం. రెవెన్యూ లోటు రూ.63 వేల కోట్ల మేర ఉంది. రాజధాని లేకుండా, మౌలిక వసతలు లేకుండా ఉన్న రాష్ట్రం ఇంత మొత్తం రెవెన్యూ ఎలా భర్తీ చేసుకోగలదు? అనేక పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఒకటి రెండే ప్రకటించారు. గడిచిన ఐదేళ్లలో ఏపీలో రూ.5 వేల కోట్లకు మించి పెట్టుబడులు రాలేదు. ఉద్యోగాల కోసం లక్షలాది మంది యువత ఎదురుచూస్తున్నారు. అందువల్ల ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి’.. అని మిథున్‌రెడ్డి వివరించారు.

చట్టంలో హామీలు నెరవేర్చండి
‘ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో అనేక హామీలు పొందుపరిచారు. కడప స్టీలు ప్లాంటు గురించి బడ్జెట్‌లో ప్రస్తావనలేదు. వెనకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వాల్సి ఉండగా.. గడిచిన రెండేళ్లుగా ఇవ్వలేదు. బుందేల్‌ఖండ్‌ ప్రాంతానికి ఇచ్చిన ప్యాకేజీ తరహాలో ఆంధ్రప్రదేశ్‌కు ఇస్తామన్నారు. గడిచిన ఐదేళ్లలో మీరు పారిశ్రామిక రాయితీలు ఏమిచ్చారో తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగే, దుగరాజపట్నం పోర్టు ప్రస్తావనలేదు.. వైజాగ్‌–చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌ లేదు.. మెట్రో రైలు పనులు ప్రారంభం కాలేదు.. ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరముంది’.. అని మిథున్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. కేంద్ర పన్నుల నుంచి రాష్ట్రాలకు వాటా లెక్కించే విషయంలో 15వ ఆర్థిక సంఘం 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటోందని, ఇది సరికాదని ఆయనన్నారు.   

మరిన్ని వార్తలు