బాలిక హత్యను తీవ్రంగా పరిగణిస్తున్నాం...

17 Jun, 2014 03:03 IST|Sakshi
బాలిక హత్యను తీవ్రంగా పరిగణిస్తున్నాం...

వినుకొండ : ముక్కుపచ్చలారని బాలికపై అతి కిరాతంగా లైంగికదాడి జరిపి, హత్య చేసిన సంఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని సీబీసీఐడీ అడిషనల్ డీజీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. వినుకొండ పట్టణ శివారు రాజీవ్ రజక కాలనీకి చెందిన మైనర్ బాలిక లక్ష్మీతిరుపతమ్మ ఇంటి వద్ద ఆడుకుంటుండగా  అపహరణకు గురైన బాలిక  14వ తేదీన శావల్యాపురం మండలం కనుమర్లపూడి గ్రామ సమీపంలోని నక్కలగండివాగు వద్ద  మృతదేహమై కనిపించిన ఘటన తీవ్ర కలకలం సృష్టించిన విషయం విధితమే.

ఈ ఘటనపై స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి తక్షణమే విచారణ చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించారు. దీంతో సీబీసీఐడి అడిషన్ డీజీ తిరుమలరావు సిబ్బందితో కలిసి శావల్యాపురం మండలం కనుమర్లపూడి సంఘటన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం పట్టణంలోని రాజీవ్ రజక కాలనీలోని బాలిక పెంపుడు తల్లి లింగమ్మను విచారించారు. సంఘటనకు ముందుగా జరిగిన విషయాలను అడిగి తెల్సుకున్నారు.

పోలీసులు అదుపులోకి తీసుకున్న వెంకటేశ్వర్లును పట్టణ పోలీసు స్టేషన్‌లో ఆయన విచారించారు. అదేవిధంగా బాలిక శవాన్ని పోస్టు మార్టం నిర్వహించిన డాక్టర్ లక్ష్మణరావును వివరాలు అడిగి తెల్సుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విచారణకు సంబంధించి జిల్లా రూరల్ ఎస్పీకి పలు సూచనలు చేశామని, ఆ దిశగా విచారణ చేయాలని సూచించినట్లు చెప్పారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్‌తో మాట్లాడామని పేర్కొన్నారు. ఆయనతో పాటు ఎస్పీ సత్యనారాయణ, ఐజీ రామకృష్ణ, సీఐడీ డిఎస్పీ రఘు, నర్సరావుపేట డిఎస్పీ డి ప్రసాదు, సీఐడీ సీఐ శివప్రసాదు, లీగల్ అడ్వైజర్ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు