సీఎం ప్రకటనపై సర్వత్రా హర్షం | Sakshi
Sakshi News home page

సీఎం ప్రకటనపై సర్వత్రా హర్షం

Published Tue, Jun 17 2014 3:04 AM

సీఎం ప్రకటనపై సర్వత్రా హర్షం - Sakshi

 రీయింబర్స్‌మెంట్‌పై విద్యార్థుల ఆనందం
 
 నిజామాబాద్ అర్బన్ : తెలంగాణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను చెల్లిస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సోమవారం చేసిన ప్రకటనపై విద్యార్థుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అటు కళాశాలల యజమాన్యాలు కూడా హర్షం వ్యక్తం చేస్తోంది. జిల్లాలో 2013-14 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు పూర్తిగా విడుదల చేయకపోవడంతో కొంతకాలంగా విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. విద్యాసంవత్సరం ముగుస్తున్న విద్యార్థులను కళాశాల యజమాన్యాలు ఫీజుల పేరిట వేధిస్తున్నాయి. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ వస్తుందో లేదోనని కంగారుపడుతున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ రాష్ట్ర విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తామంటూ ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
 
 ఇదీ పరిస్థితి..
జిల్లాలో వివిధ కోర్సులు అభ్యసిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేసకున్నారు. ఇందులో సాంఘిక సంక్షేమశాఖ పరిధిలో ఫ్రెష్ విద్యార్థులు 7,634 మంది, రెన్యువల్ విద్యార్థులు 6,693 మంది ఉన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం రూ. 5 కోట్ల 24 లక్షలు, ఉపకార వేతనాల కోసం రూ. 6 కోట్ల 77 లక్షలు ఇప్పటి వరకు మంజూరయ్యాయి. ఇంకా ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో రూ. 47 లక్షలు, ఉపకార వేతనాలకు రూ. కోటి 29 లక్షలు విడుదల కాశాల్సి ఉంది. బీసీ సంక్షేమ శాఖ విషయానికి వస్తే రెన్యువల్ విద్యార్థులు 27,347, ఫ్రెష్ విద్యార్థులు 23,787 మంది ఉన్నారు. ఇందులో ఉపకార వేతనాల కోసం రూ. 32 కోట్ల 3 లక్షలు, రీయింబర్స్‌మెంట్ కోసం రూ. 18 కోట్ల 7 లక్షలు మంజురయ్యాయి.
 
అయితే 23,787 మంది ఫ్రెష్ విద్యార్థులకు ఉపకార వేతనాలు నేటికి ఒక్క రూపాయి కూడా రాలేదు. రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి రూ. 5 కోట్ల 50 లక్షలు, ఉపకార వేతనాలకు సంబంధించి రూ. 15 కోట్ల 24 లక్షల నిధులు ఇంకా మంజూరు కావాల్సి ఉంది. ఈబీసీ విద్యార్థులు 3,457 మందికిగాను ఉపకార వేతనాలు రూ. 3 కోట్ల 25 లక్షలు రావాల్సి ఉంది. గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించిన రెన్యువల్ విద్యార్థులు 3,619 మంది ఉండగా, ఫ్రెష్ విద్యార్థులు 3,949 మంది ఉన్నారు. రీయింబర్స్‌మెంట్‌ను సంబంధించి రూ. కోటి 72 లక్షలు, ఉపకార వేతనాలు సంబంధించి రూ. 2 కోట్ల 59 లక్షల మంజూరయ్యాయి.
 
ఇంకా ఉపకార వేతనాల కోసం రూ. 3 కోట్లు రావాల్సి ఉంది. ఈ విద్యా సంవత్సరానికి 3,949 మంది ఫ్రెష్ విద్యార్థులకు ఒక్కరికి ఒక్క రూపాయి కూడా అందలేదు. ఇలా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలకు సంబంధించి రీయింబర్స్‌మెంట్ కోసం మొత్తం రూ. 6 కోట్లు, ఉపకార వేతనాల కోసం రూ. 22 కోట్ల 79 లక్షలు రావాల్సి ఉంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి ప్రకటనతో నిధులు విడుదలైతే విద్యార్థులకు, కళాశాలల యజమాన్యాలకు ఇబ్బందులు తప్పినట్లే.

Advertisement
Advertisement