ఉగ్ర నాగావళి

17 Jul, 2017 04:45 IST|Sakshi

తోటపల్లికి వరద పోటు
చరిత్రలో మొదటిసారి లక్ష క్యూసెక్కుల నీటి విడుదల
అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం నాగావళిలో భారీగా పెరిగిన నీటి ప్రవాహం


నాగావళి ఉగ్రరూపం దాల్చింది. ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలకు నదిలో వరద నీరు పోటెత్తుతోంది. ఇరవై ఏళ్ల తర్వాత తోటపల్లి ప్రాజెక్టులోకి అంత భారీ ఎత్తున వరద నీరు చేరుతోంది. ఇప్పటికే ప్రాజెక్టు వద్ద ప్రమాదకర స్థాయిలో వరద నీరు ప్రవహిస్తుండగా.. నదీ తీర ప్రాంత వాసులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

వీరఘట్టం:
అల్పపీడనం కారణంగా ఒడిశాలో కురుస్తున్న వర్షాలకు తోటపల్లి ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తింది. ఫలితంగా ఆదివారం నాగావళి నదిలో నీటి ప్రవాహం ఉద్ధృతంగా పెరిగింది. ఆదివారం ఉదయం ప్రాజెక్టు వద్ద 103.80 మీటర్ల లెవెల్‌ ఉన్న నీటి ప్రవాహం మధ్యాహ్నం 2 గంటలకు 104.1 మీటర్లకు చేరుకుంది. సాయంత్రం 4 గంటలకు గరిష్ట స్థాయి 105 మీటర్లకు చేరింది. దీంతో మధ్యాహ్నం రెండు గంటలకు నాలుగు గేట్లు ఎత్తి 8వేల క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. ఆ తర్వాత గంటగంటకూ నీటి ఉద్ధృతి పెరుగుతుండడంతో అప్రమత్తమైన అధికారులు ఎనిమిది గేట్లు ఎత్తివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టు వద్ద నీటి పరిస్థితిని ప్రాజెక్టు డీఈపాండు  పర్యవేక్షిస్తున్నారు. ప్రాజెక్టు గరిష్ట నీటి సామర్థ్యం 2.5 టీఎంసీలకు వరదనీరు చేరుకోవడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరద నీరు ఇంకా పోటెత్తే అవకాశం ఉన్నందున సిబ్బందిని అప్రమత్తం చేశామని ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు.



20 ఏళ్ల తర్వాత
తోటపల్లి ప్రాజెక్టు వద్ద ఇంత ప్రమాద స్థాయిలో వరదనీరు ఎప్పుడూ చేరలేదని అధికారులు అంటున్నారు. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత ఆ స్థాయిలో వరద వస్తోందని రిటైర్డ్‌ నీటి పారుదల శాఖ అధికారులంటున్నారు. కడకెల్ల, కిమ్మి, పనసనందివాడ గ్రామాల వద్ద నాగావళి పరవళ్లు తొక్కుతుండడంతో సమీప గ్రామ ప్రజలు ప్రవా హాన్ని చూసేందుకు బారులు తీరుతున్నారు. ప్రాజెక్టు చరిత్రలో మొదటిసారి లక్ష క్యూసెక్కుల నీటిని కిందికి విడిచిపెట్టారు.

యంత్రాంగం అప్రమత్తం
నాగావళి నదిలో నీటి ప్రవాహం పెరుగుతుందని తెలియడంతో వీరఘట్టం రెవెన్యూ సిబ్బంది డిప్యూటీ తహసీ ల్దార్‌ బి.సుందరరావు, ఆర్‌ఐ రమేష్‌కుమార్, సన్యాసిరా వు, సీనియర్‌ అసిస్టెంట్‌ షణ్ముఖరావు, పాలకొండ సీఐ సీహెచ్‌ సూరినాయుడులు నాగావళి నదీ తీర ప్రాంతాలైన కడకెల్ల, కిమ్మి, పనసనందివాడ గ్రామాల వద్ద నీటి ప్రవా హాన్ని పరిశీలించారు. ప్రజలను అప్రమత్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నదిలోకి వెళ్లవద్దని సూచించారు. నాటు పడవలను నదిలో నడపవద్దని జాలర్లను హెచ్చరించారు.

తీరప్రాంతమైన బిటివాడలో వీఆర్‌ఓ అందుబాటులో లేకపోవడంతో ఆ గ్రామస్తులు ఆర్డీఓ గున్నయ్యకు ఫిర్యాదు చేశారు. ఆయన గ్రామాన్ని సందర్శించారు. వంగర మండలం శివ్వాం నుంచి 25 మంది నాటు పడ వపై వీరఘట్టం మండలం పాలమెట్టకు బయల్దేరారు. నీటి ప్రవాహ ఉద్ధృతిని గమనించిన స్థానికులు వారిని వారించడంతో అంతా మళ్లీ వెనక్కి వచ్చి ప్రాణాలు దక్కించుకున్నారు.



వంశధారలోకి వరద నీరు
హిరమండలం: వంశధార నదిలో నీటిప్రవాహం పెరిగిం ది. క్యాచ్‌మెంట్‌ ఏరియాలో వర్షాలు కురుస్తుండడంతో గొట్టా బ్యారేజీ వద్ద 37.70 మీటర్ల నీటి నిల్వ ఉంది. 2500వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో పాటు మహేంద్రతనయ నుంచి నీరు వచ్చి చేరుతోంది. ఆదివారం సాయంత్రం నాటికి 17 గేట్లు పైకెత్తి 5863 క్యూసెక్కుల నీరు దిగువకు విడిచి పెట్టారు. కుడిఎడమ కాలువలకు 146 క్యూసెక్కులు, 357క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నట్లు డీఈ ప్రభాకర్‌ తెలిపారు. అర్ధరాత్రికి  మరో 15 వేలు క్యూసెక్కుల నీరు పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

వరదలపై మంత్రి కళా ఆరా
శ్రీకాకుళం పాతబస్టాండ్‌: నాగావళి నది వరద ప్రవాహంపై రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి కళా వెంకటరావు ఆరా తీశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ కె. ధనుంజయ రెడ్డికి ఆయన అమరావతి నుంచి ఫోన్‌ చేసి మాట్లాడారు. వీరఘట్టం నుంచి శ్రీకాకుళం వరకు సుమారు 10 మండలాల్లో 110 గ్రామాల వరకు ఈ వరద ప్రమాదం ఉంటుందని మంత్రి కలెక్టర్‌కు చెప్పారు. ఈ ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.  


నాగావళికి వరద ముప్పు
శ్రీకాకుళం పాతబస్టాండ్, పీఎన్‌ కాలనీ: జిల్లాలోని ప్రధాన నదులు నాగావళి, వంశధార నదులకు వరద ముప్పు రానుంది. ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎన్నడూ లేనంత భారీగా నదుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే నాగావళి నది విజయనగరం జిల్లా తోటపల్లి వద్ద ఉగ్రరూపం దాల్చింది. సోమవారం నాటికి నారాయణపురం, తర్వాత శ్రీకాకుళంను వరద నీరు తాకే అవకాశం ఉంది. జిల్లాలో కూడా వానలు కురవడంతో వరద ముప్పు తప్పదని అధికారులంటున్నారు.

పెరిగిన నీటి మట్టం
నాగావళి నదిలో ఆదివారం సాయంత్రం నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. ఒడిశాలో వర్షాలు తగ్గకపోవడంతో ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉంది. వరద ప్రవాహం సుమారుగా రాత్రి 8 గంటలకు వీరఘట్టంకి చేరే అవకాశాలు ఉన్నాయి. నారాయణపురానికి సుమారుగా 10 గంటలకు చేరే అవకాశం ఉందని నీటి పారుదల శాఖాధికారులు చెబుతున్నారు. శ్రీకాకుళం పట్టణానికి ఈ వరద రాత్రి ఒంటి గంటకు చేరనుంది. దీంతో నదీ తీరంలో ఉన్న వీరఘట్టం, పాలకొండ, రేగిడి, సంతకవిటి, పొందూరు, ఎచ్చెర్ల, వంగర, బూర్జ, ఆమదాలవలస, శ్రీకాకుళం మండలాల అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక మడ్డువలస నుంచి 50వేల క్యూసెక్కుల నీటిని విడిచి పెడుతున్నారు.



వంశధారకు తప్పని ముప్పు
వంశధారకు కూడా వరద ప్రభావం ఉంది. ఈ నది క్యాచ్‌మెంట్‌ ఏరియాలు కూడా ఒడిశాలోనే ఉండడంతో వరద ముప్పు తప్పదని అధికారులంటున్నారు. గొట్టా బ్యారేజీ వద్ద ఆదివారం సాయంత్రానికి 15 వేలు క్యూసెక్కుల ప్రవాహం ఉంది. నదికి వరదలు వచ్చే అవకాశం ఉన్నందున, ఈ నదీ తీర ప్రాంతాల్లో ఉన్న 15 మండలాల అధికారులు అప్రమత్తమయ్యారు.

అధికారులు అప్రమత్తం
నాగావళి, వంశధార వరద ముప్పు ఉండడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్‌ కె.ధనుంజయరెడ్డి ఇప్పటికే తీర ప్రాంత తహసీల్దార్లకు స్థానికంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని గుర్తించి తగు సూచనలు చేయాలని చెప్పారు. రెవెన్యూతో పాటుగా విపత్తులు, పోలీస్, పంచయితీరాజ్, వైద్య ఆరోగ్య శాఖ, నీటి పారుదల శాఖ ఇంజనీరింగ్‌ అధికారులను అప్రమత్తం చేశారు. వరద ముప్పు ఉన్న గ్రామాల్లో దండోరా వేయించి, వారిని అప్రమత్తం చేయాలని ఆదేశించారు.

మూడో ప్రమాద హెచ్చరిక జారీ
రాజాం / రేగిడి : సంతకవిటి మండలంలోని రంగారాయపురం గ్రామం వద్ద నారాయణపురం ఆనకట్టకు గతంలోలేని విధంగా వరద తాకిడి ఏర్పడింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నాగావళిలో వరద చేరుతుంది. దీనికితోడు తోటపల్లి ప్రాజెక్టు వద్ద 80,400 క్యూసెక్కుల నీటిని ఆదివారం రాత్రి నదిలోకి విడిచిపెట్టారు. దీంతో ఒక్కసారిగా నాగావళి నదిలో వరద పెరిగి ఆనకట్టకు చేరుకుంది. ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు 1200 క్యూసెక్కులు ఉన్న నీరు రాత్రి పది గంటల సమయంలో 40వేల క్యూసెక్కులకు చేరుకుంది. తోటపల్లి ప్రాజెక్టునీరు, మడ్డువలస నీరు రావడంతో 98 వేల క్యూసెక్కుల నీరు ఆనకట్టకు వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో అప్రమత్తమై అధికారులు మూడో హెచ్చరిక జారీ చేశారు. దీంతో తహసీల్దార్‌ కార్యాలయం వద్ద కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 90 వేల క్యూసెక్కులపైబడి నీరు వస్తుండడంతో రేగిడి మండలంలో తునివాడ, సంకిలి, బొడ్డవలస, ఖండ్యాం, పుర్లి, కొమెర తదిర గ్రామాలతోపాటు సంకతవిటి మండలంలో కొత్తూరు రామచంద్రాపురం, పోతులజగ్గుపేట, మేడమర్తి, తమరాం, పోడలి, చిత్తారిపురం తదితర నదీతీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తమయ్యారు.  

వరదలపై పోలీస్‌ యంత్రాంగం అప్రమత్తం
శ్రీకాకుళం సిటీ: నాగావళి వరదల నేపథ్యంలో జిల్లాలో పోలీస్‌ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని ఎస్పీ త్రివిక్రమ వర్మ పేర్కొన్నారు.  ఆయన ఆదివారం రాత్రి సాక్షితో మాట్లాడారు. కలెక్టర్‌తో పరిస్థితులపై చర్చించామని చెప్పారు. 90 వేల క్యూసెక్కులు ప్రమాదకరంగా ఉన్న నేపథ్యంలో నదీ తీర ప్రాంతాల పరిధిలో ఉన్న వీరఘట్టం, ఆమదాలవలస, మందస, సంతబొమ్మాళి, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, బూర్జ తదితీర పోలీస్‌ యంత్రాంగాన్ని ఇప్పటికే అప్రమత్తం చేశామన్నారు.  

అప్రమత్తంగా ఉండండి
హిరమండలం: వంశధార నదికి గొట్టా బ్యారేజీ వద్ద నీటి ప్రవాహం పెరుగుతుందని, తీర ప్రాంత వాసులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్‌ ఎం.కాళీప్రసాద్‌ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గొట్టా బ్యారేజీ వద్ద ఆదివారం సాయంత్రానికి 5వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉందని, అర్ధరాత్రి సమయానికి మరో 15 వేల క్యూసెక్కులు  పెరిగే అవకాశం ఉందనిచ నదీతీర గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు వీఆర్‌ఏ, వీఆర్వోలకు సమాచారం అందించాలని కోరారు.