ఎంతపని చేశావురా..!

5 Aug, 2019 09:12 IST|Sakshi
హర్షవర్ధన్‌ మృతదేహాన్ని పట్టుకుని విలపిస్తున్న తండ్రి జయరాం

సాక్షి, కడప :  హర్షా.. లేవరా..ఎంతపనిచేశావురా..నీవు చదువుకోకపోయినా బతికేవాడివి కదరా..అంటూ కుమారుడి మృతదేహం వద్ద తండ్రి కన్నీరు మున్నీరుగా విలపించారు. చదువు కోసం కార్పొరేట్‌ కళాశాలలో చేర్పిస్తే, అక్కడ ఒత్తిడిని తట్టుకోలేక కుమారుడు మృతి చెందిన సందర్భంలో విద్యార్థి తండ్రి ఆవేదన ఇది. చదువే సర్వస్వంగా కార్పొరేట్‌ కళాశాలలు పిల్లలను ఇబ్బందులకు గురిచేస్తూ ప్రాణాలు హరిస్తున్నాయి. కడప ఎన్జీవో కాలనీలోని నారాయణ కళాశాల మరో విద్యార్థి జీవితాన్ని బలి తీసుకుంది. తల్లిదండ్రులకు యాజమాన్యం వేధింపులు చెప్పుకోలేక చిన్నం హర్షవర్ధన్‌(16) అనే విద్యార్థి రైలు క్రిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కడప నగరంలోని చిన్నచౌక్‌లో నివసిస్తున్న చిన్నం జయరాం, సుబ్బమ్మలకు ఇరువురు కుమారులు ఉన్నారు. వీరిలో పెద్దకుమారుడు సురేష్‌కుమార్‌ ట్రావెల్స్‌ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. రెండో కుమారుడు హర్షవర్ధన్‌ (16)ను ఈ ఏడాది నగరంలోని ఎన్జీఓ కాలనీలో ఉన్న నారాయణ ఒలింపియాడ్‌ జూనియర్‌ కళాశాలలో ఎంపీసీ గ్రూప్‌లో చేర్పించారు. ప్రారంభం నుంచి కాలేజీకి వెళ్లడం హర్షవర్ధన్‌కు ఇష్టంలేదు. గత నెలలో ఓ రోజు కళాశాలకు వెళ్లలేదు. ఈ విషయంపై అధ్యాపకులు విద్యార్థి తండ్రి జయరాం తాను ఒప్పుదలగా లెటర్‌ను రాయించి ప్రతి రోజు తన కుమారుడు కళాశాలకు వెళ్లేలాగా చేశారు. తరువాత గత వారంలో ఓ రోజున హర్ష వర్ధన్‌కు జ్వరం రావడంతో కళాశాలకు వెళ్లలేదు.

మరుసటి రోజున కూడా తనను అధ్యాపకులుగాని, ఏజీఎం చెన్నకృష్ణారెడ్డిగాని వేధింపులకు గురి చేస్తారని తన మనసులోనే కుమిలిపోయాడు. గత శుక్రవారం హర్షవర్ధన్‌ను తండ్రి జయరాం కళాశాలకు తీసుకెళ్లరు. అధ్యాపకులతో మాట్లాడారు. తన కుమారుడికి జ్వరం వచ్చిందని,అందువల్లే రాలేదని, ఇకమీదట రెగ్యులర్‌గా వస్తాడని చెప్పి వచ్చారు. అయినా హర్షవర్ధన్‌ పట్ల ఏజీఎం చెన్నకృష్ణారెడ్డి దుర్భాషలాడటంతో పాటు, టీసీ ఇచ్చి పంపిస్తాననీ బెదిరించారు. దీంతో కళాశాల నుంచి ఇంటికి వెళ్లకుండా హర్షవర్ధన్‌ బలవన్మరణానికి పాల్పడ్డాడు. కళాశాల వదలగానే ఇంటికి వెళ్లలేదు. కడప–కనుమలోల్లపల్లె రైలు మార్గంలో స్పిరిట్‌ కళాశాల వెనుక భాగాన రైల్వే ట్రాక్‌ వద్ద రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనలో రైల్వే పోలీసులు మొదట గుర్తుతెలియని యువకుడి మృతదేహంగా కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని రిమ్స్‌ మార్చురీలో ఉంచారు. అప్పటికే కళాశాల నుంచి ఇంటికి రాలేదని హర్షవర్ధన్‌ తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ బంధువులు, స్నేహితులతో కలిసి అతని కోసం వెతికారు. ఈనెల 3వతేదీ రాత్రి రైలు కిందదపడి విద్యార్థి మృతి చెందాడని ‘వాట్సాప్‌’ద్వారా తెలుసుకున్నారు. వెంటనే రైల్వే పోలీసులను ఆశ్రయించారు. మృతదేహాన్ని గుర్తించిన తండ్రి జయరాం, బంధువులతో కలిసి రిమ్స్‌ మార్చురీకి చేరుకున్నారు. విగతజీవుడైన కుమారుడి చూసి భోరున విలపించారు. 

నారాయణ కళాశాల యాజమాన్యం వల్లే.. జయరాం
తన కుమారుడి బలవన్మరణానికి కడప నారాయణ జూనియర్‌ కళాశాలఅధ్యాపకులు, ఏజీఎంల వేధింపులే కారణమని తండ్రి జయరాం ఆరోపించారు. పదో తరగతి పూర్తయిన తరువాత తన ఇష్ట్రపకారమే నారాయణ కళాశాలలో చేర్పించానన్నారు. తన కుమారుడి తప్పులేకపోయినా జ్వరం తగ్గిన తరువాత శుక్రవారం కళాశాలకు వస్తే ఏజీఎం టీసీ ఇచ్చి పంపిస్తానని బెదిరించడం వల్లనే మనోవేదనకు గురై ఇంటిలో తల్లిదండ్రులకు చెప్పుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని విలపించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరుగకుండా కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలనీ డిమాండ్‌ చేశారు.
 
ఒత్తిడిని తట్టుకోలేక విద్యార్థి బలవన్మరణం
నారాయణ విద్యాసంస్థల్లో ఒత్తిడి కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. విద్యార్థుల పట్ల పరుషపదజాలంతో అధ్యాపకులు వ్యవహరించడంతో పాటు, వారిపై కట్టెలతో కూడా దాడి చేస్తున్నారు.ఇలా చేయడం సరికాదు. వారి ప్రవర్తన తీరుకు వ్యతిరేకంగా ఈనెల 5న కడపలోని నారాయణ కళాశాలను మూయిస్తాం, ఆందోళన చేపడతాం. - ఖాజా రహమతుల్లా, వైఎస్‌ఆర్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ నాయకులు, కడప 

తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు 
నారాయణ కళాశాల విద్యార్థి హర్షవర్ధన్‌ ఆత్మహత్యకు పాల్పడటం పట్ల తండ్రి జయరాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. సమగ్రంగా విచారించి బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.     రైల్వే ఎస్‌ఐ రారాజు, కడప కడప నారాయణ జూనియర్‌ కళాశాలల్లో  వరుస సంఘటనలు నారాయణ విద్యాసంస్థల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు ఒత్తిడి, వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుత్ను సంఘటనలు నెలకొంటున్నాయి. కడప- పులివెందుల రహదారిలో కృష్ణాపురం సమీపంలో ఉన్న జూనియర్‌ కళాశాల క్యాంపస్‌లో మనీషా, నందినీరెడ్డి జంటగా హాస్టల్‌ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆ సంఘటనపై ఇప్పటికీ పోలీసులు నిగ్గుతేల్చలేదు..పావని అనే విద్యార్థిని అదే క్యాంపస్‌లో బలవన్మరణానికి పాల్పడి తల్లిదండ్రులకు విషాదాన్ని మిగిల్చింది. తాజాగా హర్షవర్ధన్‌ అధ్యాపకుల, ఏజీఎం వేధింపుల వల్ల రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడటం జిల్లాలో సంచలనం కల్గించింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కళాశాల యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని వార్తలు