శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ

10 Jun, 2019 03:26 IST|Sakshi
రేణిగుంట విమానాశ్రయంలో ప్రధానికి స్వాగతం పలుకుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. చిత్రంలో గవర్నర్‌ నరసింహన్‌

ఆయన వెంట గవర్నర్‌ నరసింహన్, సీఎం వైఎస్‌ జగన్‌

సంప్రదాయ దుస్తుల్లో మోదీ, నరసింహన్, వైఎస్‌ జగన్‌

ఆలయ మహాద్వారం వద్ద వేదమంత్రోచ్ఛారణల మధ్య స్వాగతం

అనంతరం ముగ్గురికీ వేద పండితుల ఆశీర్వచనం

తిరుమల : ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆయన వెంట గవర్నర్‌ నరసింహన్, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఉన్నారు. శ్రీలంక రాజధాని కొలంబొ నుంచి శ్రీవారి దర్శనార్ధం మోదీ ప్రత్యేక విమానంలో ఆదివారం సాయంత్రం చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తిరుమలలోని పద్మావతి అతిథి గృహం వద్దకు చేరుకున్నారు. అక్కడ గవర్నర్‌ నరసింహన్, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, టీటీడీ ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ప్రధానికి ఘనస్వాగతం పలికారు. అనంతరం ముగ్గురూ అతిథిగృహంలో కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత మోదీ, నరసింహన్, వైఎస్‌ జగన్‌ నేరుగా శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు చేరుకోగా ఆలయ అర్చకులు, ఆధికారులు స్వాగతం పలికారు. మొదటగా ధ్వజస్తంభానికి మొక్కుకుని బంగారు వాకిలి నుంచి ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారిని దర్శించుకున్నారు.

శ్రీవారి వైభవం, ప్రాశస్త్యాన్ని ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు మోదీకి వివరించారు. ఆలయ జీయర్లు శేషవస్త్రంతో సత్కరించారు. దర్శనానంతరం ప్రధాని, గవర్నర్, ఏపీ సీఎం వకుళామాతను, విమాన వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. హూండీలో కానుకలు సమర్పించిన ప్రధాని.. వెండివాకిలి నుంచి వెలుపలకి వచ్చారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు ముగ్గురికీ వేద ఆశీర్వచనం చేశారు. ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం మోదీ, వైఎస్‌ జగన్‌ ఆలయం వెలుపలకు రాగానే భక్తులు పెద్దఎత్తున హర్షధ్వానాలు చేశారు. ప్రధాని, సీఎం వారికి అభివాదం చేస్తూ పద్మావతి అతిథిగృహానికి పయనమయ్యారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరారు. వీరితో పాటు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, ఆదిమూలం, బియ్యపు మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎయిర్‌పోర్టులో సీఎంకు ఘనస్వాగతం
ఇదిలా ఉంటే.. ప్రధాని మోదీ రాక సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు రేణిగుంట విమానాశ్రయానికి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆదివారం అక్కడ ఘనస్వాగతం లభించింది. సా.3.55గంటలకు విమానంలో ఆయన ఎంపీ విజయసాయిరెడ్డితో కలిసి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్, ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, దుర్గాప్రసాద్, రెడ్డెప్ప, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, జంగాలపల్లి శ్రీనివాసులు, నవాబ్‌ బాష, ద్వారకానాథరెడ్డి, ఆదిమూలం, ఎంఎస్‌ బాబు, మేడా మల్లికార్జునరెడ్డి, పలువురు అధికారులు ఘన స్వాగతం పలికారు.

మరిన్ని వార్తలు