అంగన్‌వాడీలకు కొత్త షెడ్యూల్

24 Jan, 2014 01:14 IST|Sakshi
రాయవరం, న్యూస్‌లైన్ : పాఠశాలల మాదిరిగానే అంగన్‌వాడీ కేంద్రాలు కూడా పక్కాగా నిర్వహించేందుకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం నుంచి శనివారం వరకు అంగన్‌వాడీ కేంద్రాలు ఎలా నిర్వహించాలో రూపొందించిన టైమ్‌టేబుల్ అంగన్‌వాడీ ప్రాజెక్టు కార్యాలయాలకు చేరుకుంది. అందులో చిన్నారుల మానసిక వికాసానికి ఆటపాటలకు అధిక ప్రాధాన్యమిచ్చారు. ఉదయం 9 నుంచి 9.20 గంటల వరకు అంగన్‌వాడీ టీచర్, చిన్నారులు, చిన్నారుల మధ్య పరస్పర సంభాషణలు.
 
  9.20గంటల నుంచి 9.40 వరకు ప్రార్థన అనంతరం స్నాక్స్ అందజేత.
  10 నుంచి 10.30 వరకు మూడేళ్లు నిండిన చిన్నారులకు ఆటలు, నాలుగేళ్లు పైబడిన చిన్నారులకు పాఠశాల కార్యక్రమాలకు సంసిద్దులను చేయడం.
  10.30 నుంచి 10.50 వరకు కేంద్రం లోపల, బయట ఆటపాటలు.
  10.50 నుంచి 11 గంటల వరకు చిన్నారులు ఆటలు ఆడాక చేతులు ఎలా శుభ్రపర్చుకోవాలో
 
 తెలియపర్చడం.
  ఉదయం 11 నుంచి 11.20 వరకు ఆటవస్తువులు, చార్టులు, పరికరాల ద్వారా చిన్నారులకు కథలు చెప్పడం. చిన్నారులు తమకు తాముగా సంఘటనలు చెప్పుకునేలా అలవాటు చేయడం.
  ఉదయం 11.20 నుంచి 11.30 వరకు ఇష్టమైన ఆటలు ఆడుకునేందుకు స్వేచ్ఛ ఇవ్వడం.
  ఉదయం 11.30 నుంచి 12 గంటల వరకు పుస్తకాలతో కూడిన కార్యకలాపాల నిర్వహణ.
  మధ్యాహ్నం 12 నుంచి 12.15 గంటల వరకు ఇష్టమైన ఆటలు ఆడుకునేందుకు అవకాశం, 
 మధ్యాహ్న భోజనానికి సిద్ధం చేయడం.
  12.15 నుంచి ఒంటి గంట వరకు మధ్యాహ్న భోజనం.
  ఒంటి గంట నుంచి 2.30 గంటల వరకు చిన్నారులను నిద్రపుచ్చడం.
  మధ్యాహ్నం 2.30 నుంచి 2.50 వరకు ఆటలతో కూడిన పాటలు నేర్పడం. 2.50 నుంచి 3 గంటల వరకు విద్యార్థులకు అల్పాహారం అందజేయడం.
 3 నుంచి 3.30 వరకు చిన్నారులకు పాఠశాలకు అలవాటయ్యేలా బోధనా కార్యక్రమాలు నిర్వహించడం.
  3.30 నుంచి 4 గంటల వరకు చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రం ఆవరణలో ఆటలు ఆడించిన అనంతరం ఇళ్లకు పంపడం.
 
 ఐసీడీఎస్ ప్రాజెక్టులు
 జిల్లాలో 25 ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. ఆరు గిరిజన ప్రాంతాలైన  అడ్డతీగల, రంపచోడవరం, మారేడుమిల్లి, గంగవరం, అడ్డతీగల, రాజవొమ్మంగిలలో ఉన్నాయి. 
 మిగిలినవి కాకినాడ, రాజమండ్రి, సామర్లకోట, తుని, రూరల్ ప్రాంతాల్లో ఉన్నాయి.
 జిల్లాలో 4,830 అంగన్‌వాడీ కేంద్రాలు, 270 మినీ అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి.
 ఈ కేంద్రాల్లో 2.57 లక్షల మంది చిన్నారులు నమోదు కాగా, 2.39 లక్షల మంది వస్తున్నట్టు రికార్డులు చెబుతున్నాయి.  
 
 
 సక్రమంగా అమలయ్యేలా చూస్తా
 కొత్తగా వచ్చిన టైంటేబుల్ అమలు చేస్తే చిన్నారులకు ఎంతో మంచిది. దీన్ని సక్రమంగా, సమర్ధవంతంగా కార్యకర్తలు అమలు చేసేలా చర్యలు తీసుకుంటాను. టైంటేబుల్ నిర్వహణపై త్వరలో డివిజన్, ప్రాజెక్టు స్థాయిలో వర్క్‌షాపులుంటాయి. 
 - వై.సుశీలాకుమారి, 
 పీవో, ఐసీడీఎస్, రాయవరం. 
 
మరిన్ని వార్తలు