భవానీని అప్పగించడంలో ట్విస్ట్‌..

8 Dec, 2019 13:04 IST|Sakshi

సాక్షి, విజయవాడ : నాలుగేళ్ల వయసులో తప్పిపోయిన భవానీని తల్లిదండ్రులకు అప్పగించడంలో కొత్త ట్విస్ట్‌ చోటుచేసుకుంది. భవానీని తల్లిదండ్రుల వద్దకు పంపించేందుకు పెంచిన తల్లిదండ్రులు జయమ్మ-జీవరత్నం అభ్యంతరం తెలిపారు. వచ్చినవారు అసలైన తల్లిదండ్రులని నిర్ధారణ కావాలని.. అప్పుడే తనను వారి వద్దకు పంపుతామని జయమ్మ చెప్పారు. అందుకోసం డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. భవానీ అభీష్టంతోనే తల్లిదండ్రుల వద్దకు పంపిస్తామని వెల్లడించారు. 

భవానీని అప్పగించే విషయంపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామని అన్నారు. పోలీసుల సూచనల మేరకు నడుచుకుంటామని చెప్పారు. వచ్చినవారే నిజమైన తల్లిదండ్రులని నిర్ధారణ అయ్యాకే అప్పగిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు భవానీ మాత్రం తన తల్లిదండ్రుల వద్దకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఇందుకోసం ఏ పరీక్షలకైనా సిద్ధమేనని వెల్లడించారు. అప్పుడప్పుడు జయమ్మ వద్దకు కూడా వస్తానని చెప్పారు. కాగా, వంశీ, కృష్ణకుమారి దంపతుల ఇంట్లో భవానీని పనిలో పెట్టాలనే ఉద్దేశంలో జయమ్మ ఆమెను వారివద్దకు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ఇంటి యజమాని వంశీ.. భవానీ వివరాలను ఆరా తీశారు. తాను చిన్నతనంలోనే తప్పిపోయానని తెలిపిన భవానీ తల్లిదండ్రుల పేర్లు, అన్నల పేర్లను, గుర్తున్న చిన్ననాటి సంగతులను చెప్పారు. ఆ వివరాలను, భవానీ ఫొటోను వంశీ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. శనివారం ఆ పోస్ట్‌ను చూసిన భవానీ అన్న.. వంశీని సంప్రదించాడు. 13 ఏళ్ల తరువాత తమ బిడ్డ  ఆచూకీ తెలిసి భవానీ తల్లిదండ్రులు ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారు. 

పడమట పోలీస్‌ స్టేషన్‌కు చేరిన భవానీ వివాదం..
భవానీని అప్పగించడానికి పెంచిన తల్లిదండ్రులు జయమ్మ-జీవరత్నం అభ్యంతరం తెలుపడంతో ఈ వివాదం పటమట పోలీస్‌ స్టేషన్‌కు చేరింది. దీంతో పోలీసులు ఓ వైపు కన్న తల్లిదండ్రులు, మరోవైపు పెంచిన తల్లిదండ్రుల సమక్షంలో వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే తాము డీఎన్‌ఏ పరీక్షలకు సిద్ధంగా ఉన్నట్టు భవానీ సోదరుడు గోపి తెలిపారు.

చదవండి : కన్నవారిని కలిపిన ఫేస్‌బుక్‌

మరిన్ని వార్తలు