వెంకట్రామన్నగూడెంలోనే ‘నిట్’

17 Sep, 2014 03:45 IST|Sakshi
వెంకట్రామన్నగూడెంలోనే ‘నిట్’

 తాడేపల్లిగూడెం : నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) సంస్థను వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ వెనుక వైపున ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉంగుటూరు మండలం నాచుగుంట రెవె న్యూ పరిధిలో కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు చెందిన భూముల్లో దీనిని ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. గతంలో దీనికోసం తాడేపల్లిగూడెం మండ లం కొండ్రుప్రోలు, తాడేపల్లిగూడెం, కడకట్ల రెవెన్యూ పరిధిలో ఉన్న 244 ఎకరాల భూమిని అందుబాటులో ఉన్నట్టుగా చూపించారు. అలాగే నాచుగుంట రెవెన్యూ పరిధిలోని వెంకట్రామన్నగూడెం ఉద్యాన వర్సిటీ వెనుక ఉన్న అటవీశాఖ భూముల వివరాలను సర్వే నంబర్లతో సహా పంపారు.
 
 నిట్ ఏర్పాటు కావాలంటే కచ్చితంగా 300 ఎకరాల భూమి అందుబాటులో ఉండాలనే నిబంధన ఉంది. ఇదే సమయంలో కేంద్ర విద్యాసంస్థల ఏర్పాటుకు భూసేకరణలో భాగంగా మునిసిపల్ శాఖ మంత్రి పి.నారాయణ నేతృత్వంలో బృందం వివిధ జిల్లాల్లో పర్యటించే క్రమంలో తాడేపల్లిగూడెం, ఉంగుటూరు మండల పరిధిలోని భూము లను పరిశీలించింది. ఉద్యాన వర్సిటీ ప్రాంతంలో ఉన్న భూములు, నిట్ ఏర్పాటుకు అనువుగా ఉంటాయా, లేదా నిట్ సంస్థకు ఈ భూములు దఖలు పడాలంటే తీసుకోవాల్సిన చర్యలేమిటనే దానిపై వర్సిటీ ఉన్నతాధికారులతో మంత్రులు పి.నారాయణ, పైడికొండల మాణిక్యాలరావు చర్చించారు. తరువాత రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు.
 
 అనంతర పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీలో సీఎం చంద్రబాబు జిల్లాకు నిట్‌ను కేటాయిస్తున్నట్టు ప్రకటించగా, దీనిని గూడెం ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నట్టు ఇటీవల మంత్రి మాణిక్యాలరావు వెల్లడించారు. ఇక్కడ అటవీభూముల్లో ఉద్యాన వర్సిటీకి ఎంతవరకు భూములను కేటాయించారో, అక్కడి నుంచి మూడు వందల ఎకరాలకు పైగా భూమిని నిట్ కోసం కేటాయించనున్నారని సమాచారం. అన్ని సంస్థలు ఒకేచోట కేంద్రీకృతం చేశారనే విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉండటం, నాచుగుంట అటవీ భూముల లో నిట్ ఏర్పాటు చేస్తే ఇది ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోకి వస్తుం డటంతో సమన్యాయం పాటించినట్టవుతుందని భావిస్తున్నట్టు తెలిసింది. దీంతో ఈ ప్రాంతంలో నిట్ ఏర్పాటయ్యే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. కేంద్ర మానవవనరుల శాఖాధికారులు స్థల పరిశీలన అనంతరం తుది రూపం ఇవ్వనున్నారు.
 

మరిన్ని వార్తలు