ఉపాధి చిక్కుల్లో రాజధాని చిన్నరైతు!

1 Oct, 2018 08:55 IST|Sakshi
పనుల కోసం వెతుక్కుంటున్న చిన్న, సన్నకారు రైతులు

ప్రభుత్వ మాటలకు, చేతలకు పొంతన లేదు

ఉపాధి లేక ఉసూరుమంటున్న అన్నదాతలు

ఇతర రాష్ట్రాల నుంచి చౌకగా కూలీల దిగుమతి

పనులు దొరక్క పస్తులుంటున్న రైతులు

ఏ మూలకూ చాలని సర్కారు కౌలు

మేం ఏం చేయాలని ప్రశ్నిస్తున్న స్థానికులు

పిల్లలకు చదువు చెప్పిస్తామన్న హామీ గాలికి

ఇప్పటివరకు సరైన ప్రభుత్వ వైద్యశాలా లేదు

సాక్షి, తాడేపల్లి రూరల్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాలకు చెందిన దాదాపు 50 వేల మంది చిన్న, సన్నకారు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం చెప్పిన దానికి, జరుగుతున్న దానికి ఎక్కడా పొంతన ఉండడంలేదు. రాజధాని నిర్మాణం పేరుతో ఇక్కడ 33వేల ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సమీకరించింది. భూములిచ్చిన వారిలో అధిక భాగం రైతులు ఎకరం, అర ఎకరం ఉన్నవారే. దీంతో తమ భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో ఇల్లు గడవక దిక్కుతోచడంలేదని బాధిత రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం వీరికి ఏటా కౌలు చెల్లిస్తున్నప్పటికీ అవి ఏ మూలకూ చాలడంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అలాగే, రైతుల పిల్లలకు ఉచితంగా కార్పొరేట్‌ స్కూళ్లలో చదువు చెప్పిస్తామని హామీ ఇచ్చినా, అది ఎక్కడా అమలుకావడంలేదు. అప్పులు చేసి చదివించాల్సి వస్తోందంటున్నారు. అంతేకాక, రాజధాని మూడు మండలాల్లో సరైన ప్రభుత్వ వైద్యశాల లేక ప్రైవేటు వైద్యశాలలను ఆశ్రయించాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

కూలి పనీ దొరకడం లేదు
గతంలో ఉన్న ఎకరం, అరెకరంలో ఏదో ఒక పంట వేసుకుని, అప్పోసొప్పో చేసుకుని తినేవారమని, పంట చేతికి రాగానే అప్పులు తీర్చేవారమని రైతులు చెబుతున్నారు. రాజధాని పుణ్యమా అంటూ వడ్డీ వ్యాపారస్తులు రైతువారీ వడ్డీకి స్వస్తి చెప్పి అధిక వడ్డీలకు తిప్పుతున్నారని, ఆ అప్పు చేసి ఎలా తీర్చాలో అర్ధంకావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. పొలాల్లో పనిలేక నిర్మాణ పనులకు వెళ్తే అక్కడా అన్యాయమే జరుగుతోందని వాపోతున్నారు. భవన యజమానులు, కాంట్రాక్టర్లు ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను అతితక్కువ కూలీకి తీసుకువచ్చి వారితో పనులు చేయించుకుంటున్నారని.. తమను తొలగిస్తున్నారని వాపోయారు. దీంతో ఇప్పుడు ప్రతిరోజూ పొట్ట చేతబట్టుకుని ఎక్కడ పని దొరుకుతుందా అని వెతుక్కుంటున్నామంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ గోడు పట్టించుకుని భూములిచ్చిన చిన్న, సన్నకారు రైతులకు పనులు కల్పించాలని వారు కోరుతున్నారు.

పని కోసం వెతుక్కోవాల్సి వస్తోంది
ఉన్న ఎకరాన్ని పూలింగ్‌కు ఇచ్చా. వచ్చిన కౌలు చాలకపోవడంతో రోజు కూలీ చేసుకుంటున్నాం. కురగల్లులో నిర్మిస్తున్న వర్సిటీలో రూ.10వేల జీతానికి చేరాను. మహారాష్ట్ర నుంచి వచ్చిన వారు రూ.7 వేలకే చేయడంతో మమ్మల్ని తొలగించారు. ఇప్పుడు పనికోసం వెతుక్కోవాలి.    
– దావులూరి వెంకటేశ్వరరావు

పనిలేక ఇబ్బంది పడుతున్నాం
ఉన్న 75 సెంట్లు పూలింగ్‌కు ఇచ్చాం. గతంలో అక్కడ కూరగాయలు పండించి అమ్ముకొని జీవించే వాళ్లం. ఇప్పుడు పనిపోయింది. కొత్త పని కోసం వెతుక్కుంటున్నాం. నాలాగా చాలామంది రైతుల పరిస్థితి ఇదే. ప్రభుత్వం దారి చూపకపోతే ఇచ్చిన ప్లాట్లు అమ్ముకుని వలస వెళ్లాల్సిందే.     
– నాగేశ్వరరావు, ఐనవోలు

కూలీలకు పని దొరకడంలేదు
గతంలో పొలాల్లో పనిచేసుకుని సాయంత్రానికి ఆరేడు వందలతో ఇంటికి తీసుకెళ్లేవాళ్లం. ఇప్పుడు సిమెంటు పనిచేసినా రూ.500 ఇవ్వడంలేదు. ఎవరిని అడిగినా పనిలేదు పొమ్మంటున్నారు. ఇలా అయితే మేం ఎక్కడకు వలస వెళ్లాలో అర్ధంకావడంలేదు.
– బాణావతు దినేష్‌నాయక్, నవులూరు

మరిన్ని వార్తలు