డ్యూటీ వేయాలా.. రూ. వెయ్యి కొట్టు

28 Feb, 2018 13:21 IST|Sakshi
ఏలూరులో ట్రాఫిక్‌ విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డు

ఇదీ హోంగార్డుల దీన స్థితి

చాలీచాలని జీతాలతో వెతలు

ఏడాది క్రితం సీఎం చంద్రబాబుబందోబస్తుకు వెళ్ళిన హోంగార్డుకు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి.ఆ హోంగార్డుకు ఆసుపత్రి ఖర్చు ఏకంగా రూ.2 లక్షల వరకు అయ్యింది.అటు ప్రభుత్వం గానీ.. ఇటు సంక్షేమసంఘం కానీ రూపాయి ఇవ్వలేదు.. అరకొరజీతాలతో బాధలు పడే ఆ కుటుంబంఅష్టకష్టాలు పడింది.విధులు నిర్వర్తిస్తూ ఒక హోంగార్డుమరణించాడు. అంత్యక్రియల ఖర్చులకు రూ.వెయ్యి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మూడు నెలలకు అన్ని విచారణలు చేసి రూ.15 వేలు ప్రభుత్వం నుంచి అందించారు. కుటుంబ యజమాని మరణంతో ఆ కుటుంబం ఆర్థికంగా నష్టపోయింది..

పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్‌ : రోజంతా రోడ్డుపై నిలబడి విధులు నిర్వర్తించాలి. పోలీస్‌ శాఖలోని సిబ్బందితో సమానంగా విధులు నిర్వహిస్తున్నా హోంగార్డుల కుటుంబాలకు వెతల బతుకులే. శాంతిభద్రతల పరిరక్షణలోనూ, ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ కార్యక్రమాలు ఇలా ఏది జరి గినా అందరికంటే ముందు విధుల్లో ఉండేది హోంగార్డులే. ఎండావానా.. దుమ్మూధూళిని లెక్కచేయకుండా పోలీస్‌ సిబ్బందితో సమానంగా ఉద్యోగ విధులు నిర్వర్తిస్తున్నా అరకొర జీతాలే. పనిచేస్తేనే రోజువారీ వేతనం చెల్లించే పరిస్థితి ఉంది. రోడ్డు ప్రమాదం జరిగినా.. మరణించినా ప్రభుత్వం నుంచి ఆదుకునే అవకాశం లేదు. ఇక జిల్లా కార్యాలయం అంతా అవినీతిలో కూరుకుపోయింది. ప్రతిపనికీ రేటు నిర్ణయించి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మహిళా సిబ్బంది బాధలు వర్ణణాతీతంగా మారాయని ఆవేదన చెందుతున్నారు. అధికారులతోపాటు కార్యాలయంలోని హోంగార్డులు సైతం మహిళలను అన్ని రకాలుగా వేధింపులకు గురిచేస్తున్నారని, ఉన్నతాధికారులకు చెప్పుకున్నా న్యాయం జరిగే పరిస్థితి లేదని వాపోతున్నారు.

సొమ్ము చెల్లించుకుంటేనే
హోంగార్డులు వివిధ శాఖల్లో డ్యూటీలు వేయాలంటే సొమ్ములు చెల్లించుకోవాల్సిందేనంట. రూ.వెయ్యి కొడితే తప్ప డ్యూటీలు వేయని దుస్థితి నెలకొంది. హోంగార్డులకు సంబంధించిన జిల్లా కార్యాలయంలో ఏ పని చేయాలన్నా సొమ్ము ముట్టనిదే పని ముందుకు వెళ్ళదనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 873 మంది హోంగార్డులు పనిచేస్తున్నారు. వీరంతా ఆర్‌టీసీ, రవాణాశాఖ, ఎఫ్‌సీఐ, సబ్‌జైలు, పవర్‌ప్లాంట్‌ ఇలా ఇతర శాఖలు, ప్రైవేటు సంస్థల్లోనూ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆర్‌టీఓ కార్యాలయంలో డ్యూటీకి డిమాండ్‌ ఉంది. ఇక్కడ విధుల్లో వేయాలంటే రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకూ ఇచ్చుకోవాల్సిందే. ఆర్‌టీసీ, ఎఫ్‌సీఐ, ద్వారకాతిరుమల ఆలయం ఇలా కొన్ని శాఖల్లో రూ.500 నుంచి రూ.1000 సమర్పించుకోవాలి. ఇక రవాణా శాఖలో పనిచేస్తున్న హోంగార్డులకు గత నాలుగు నెలలుగా వేతనాలే ఇవ్వలేదు.

ప్రమాదంలో మరణిస్తే
హోంగార్డులు ఏదైనా ప్రమాదంలో మరణిస్తే మట్టి ఖర్చులకు రూ.5 వేలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయి. కానీ జిల్లాలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మరణిస్తే కేవలం రూ.1000 ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. మిగిలిన సొమ్ము లెక్కలు చెప్పే పరిస్థితి లేకపోగా, అడిగే అవకాశం హోంగార్డులకు లేకుండా పోయింది. ఆ శాఖలోని అధికారులే సొమ్ములు మింగేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బీమా సొమ్ముకు సైతం హోంగార్డుల వేతనాల్లోంచే కోతలు వేసి మరీ చెల్లించే దుస్థితి ఉంది. మూడు నెలల అనంతరం విచారణలు చేసి మరో రూ.15 వేలు కుటుంబానికి అందజేస్తారు.

టీడీపీ ప్రభుత్వం చెప్పిందొకటి.. చేస్తున్నదొకటి
టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో హోంగార్డులను రెగ్యులర్‌ చేస్తామంటూ ప్రకటించింది. కానీ రెగ్యులర్‌ కాదు కదా..రోజువారీ వేతనం సైతం పెంచేందుకు చర్యలు తీసుకోలేదని హోంగార్డులు ఆవేదన చెందుతున్నారు. పక్క రాష్ట్రం తెలంగాణలో హోంగార్డుల రోజువారీ వేతనాన్ని రూ.400 నుంచి రూ.675 కు పెంచారు. బందోబస్తుకు వెళితే అదనంగా రూ.200 చెల్లిస్తున్నారు. హోంగార్డులకు ఆరోగ్య కార్డులు, మెటర్నరీ లీవులు, ప్యాటర్నిటీ సెలవులు, ఇతర సౌకర్యాలు కల్పించారు. ఏపీలో మాత్రం హోంగార్డులకు అదనపు విధులకు వారి సొంత ఖర్చులతోనే వెళ్ళాల్సి వస్తోంది. గతంలో ఏఆర్‌ అధికారులు వాహనాల్లో తీసుకువెళ్ళగా ప్రస్తుతం ప్రయాణ ఖర్చులు వారే భరించాల్సి వస్తోంది.

మరిన్ని వార్తలు