ఇప్పటికీ నగదు కష్టాలే!

24 Nov, 2018 13:29 IST|Sakshi
నెల్లూరు: మూసి ఉన్న ఏటీఎం

పెద్ద నోట్లు రద్దు చేసి రెండేళ్లు

గడిచినా మారని పరిస్థితి  

మూసి ఉంటున్న ఏటీఎంలు  

కేంద్ర ప్రభుత్వం ఏ ముహూర్తాన పెద్ద నోట్లను రద్దుచేసిందో తెలియదు కాని, అప్పటి నుంచి జిల్లా వాసులను నగదు కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ నెల 8వ తేదీకి పెద్ద నోట్లు రద్దు చేసి రెండేళ్లు ముగిసినా ఇప్పటికీ నగదు కష్టాలు తీరడం లేదు. జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 80 శాతం ఏటీఎం కేంద్రాలు మూసి ఉండడంతో పాటు, సీడీఎంలలో కూడా నగదు వేయలేని పరిస్థితి నెలకొంది.

నెల్లూరు(సెంట్రల్‌): జిల్లాలో ప్రధానంగా మధ్య, పేద తరగతి వారిపై నగదు కష్టాలు తీవ్ర ప్రభాన్ని చూపుతున్నాయి. నగదు రహిత లావాదేవీలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం చెప్పినా అందుకు తగ్గట్లుగా స్వైపింగ్‌ యంత్రాలను కూడా అందుబాటులోకి తీసుకుని రాలేని దుస్థితి. పెద్ద నోట్లను 2016 నవంబరు 8వ తేదీన రద్దుచేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి రెండు రోజుల తరువాత ఆ నోట్లను బ్యాంకుల్లో మార్చుకునే విధానాన్ని ప్రవేశ పెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నోట్ల కష్టాలు మాత్రం తీరడం లేదు.

జిల్లాలో 623 బ్యాంక్‌ శాఖలు
జిల్లాలో 41 బ్యాంక్‌లు ఉండగా, వాటికి అనుబంధంగా 623 శాఖలు ఉన్నాయి. వీటిలో రోజూ లావాదేవీలు జరగాలంటే కనీసం రూ.100 కోట్ల అవసరం ఉంటుందని అధికారులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తు తం ఆర్‌బీఐ నుంచి అరకొర నగదు వస్తుండడంతో ఉన్న దాంట్లోనే సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో బ్యాంక్‌ అధికారులు కూడా ఏమి చేయలేకపోతున్నారనే ఆరోపణలున్నాయి.

80 శాతం ఏటీఎంల మూత
జిల్లాలో నెల్లూరు, నెల్లూరు రూరల్, కావలి, కోవూరు, ఉదయగిరి, ఆత్మకూరు, గూడూరు, సర్వేపల్లి, వెంకటగిరి, సూళ్లూరుపేట నియోజకవర్గాలలో మొత్తం 482 ఏటీఎం కుఏంద్రాలు ఉన్నాయి. వీటిలో దాదాపుగా 80 శాతం పనిచేయడం లేదు. పేరుకు తీసి ఉన్నా వాటిలో నగదు లేదని మెసేజ్‌ వస్తుండడం గమనార్హం. ఆర్‌బీఐ నుంచి నగదు రాక పోవడంతోనే ఏటీఎంలలో నగదు పెట్టలేకపోతున్నట్లు బ్యాంక్‌ అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా పండగ రోజులు, సెలవుల దినాల్లో అయినే నగదు ఉండే ఏటీఎంల కోసం వెతుకులాడాల్సిన పరిస్థితి వస్తోంది. దీనికి తోడు క్యాష్‌ డిపాజిట్‌ మిషన్, (సీడీఎం)లను అందుబాటులో ఉంచినా వాటిలో చాలా వరకు నగదు తీసుకోవడం లేదు. కొంత నగదు తీసుకున్నా వెనక్కు వస్తుంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  

స్వైపింగ్‌ మిషన్ల కొరత
పెద్ద నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దుచేసిన తరువాత మొత్తం నగదు రహిత లావాదేవీలు నడపాలని చెప్పింది. అందుకు తగ్గట్లుగా స్వైపింగ్‌ మిషన్లను మాత్రం అందుబాటులోకి తీసుకుని రాలేదు. దాదాపుగా జిల్లాలో 50 వేల మంది వ్యాపారులు ఉన్నారు. వీరిలో కేవలం ఐదు వేల లోపు వ్యాపార కేంద్రాల్లో స్వైపింగ్‌ పద్ధతి ఉంది. మరో రెండు వేల మంది స్వైపింగ్‌ మిషిన్ల కోసం దరఖాస్తు చేసుకున్నా మిషన్లను వారికి అందించలేదు. ఈ విధంగా స్వైపింగ్‌మిషన్లను సరఫరా చేయకుండా నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని చెప్పడం ఎంతవరకు సమంజసమని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు.  

మరిన్ని వార్తలు