కాసుల కోసం కిరాతకం | Sakshi
Sakshi News home page

కాసుల కోసం కిరాతకం

Published Sat, Nov 24 2018 1:27 PM

Husband Killed Wife In PSR Nellore - Sakshi

 నెల్లూరు, సూళ్లూరుపేట: అత్తింటి ఆరళ్లకు అబల బలైంది. పొలం విక్రయించి నగదు తీసుకురాలేదని భార్యను ఆమె భర్త తన తల్లితో కలిసి హత్యచేసి ఆత్యహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు. సూళ్లూరుపేట మండలంలోని కుదిరి పంచాయతీ కుదిరి తిప్పకండ్రిగ గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తడ మండలం పెరియవెట్టి పంచాయతీ కావలిమిట్ట గ్రామానికి చెందిన బత్తిన లత (25)కు కుదిరి తిప్పకండ్రిగ గ్రామానికి చెందిన బత్తిన సురేంద్రకు పది సంవత్సరాల క్రితం వివాహమైంది. సురేంద్ర వ్యవసాయం చేస్తుంటాడు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. పెళ్లయిన నాటి నుంచి భర్త వేధిస్తున్నా లత తట్టుకుని కాపురం చేస్తూ వచ్చింది.

2016లో వేధింపులు తీవ్రం కావడంతో కేసు పెట్టి కొంతకాలం దూరంగా ఉంది. తర్వాత పెద్ద మనుషులు రాజీ చేశారు. కోర్టులో కేసును కూడా రాజీ చేసి భార్యాభర్తలను కలిపి కాపురానికి పంపారు. మళ్లీ వేధింపులు మొదలు కావడంతో ఇద్దరి మధ్య తరచూ వివాదాలు జరిగేవి. ఎప్పటికప్పుడు సర్దుబాటు చేసుకుంటూ వచ్చారు. కాగా లతకు కావలిమిట్టలో పుట్టింటి వారు కొంత ఇంటి స్థలాన్ని ఇచ్చారు. దానిని విక్రయించి నగదు తీసుకురావాలని భర్త చెప్పడంతో రెండు మూడురోజులుగా వివాదం జరుగుతూ వచ్చింది. గురువారం రాత్రి వివాదం తీవ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున భర్త సురేంద్ర తన తల్లి పార్వతమ్మతో కలిసి లతపై దాడిచేసి గొంతు నులిమి చంపివేశారని సీఐ కిషోర్‌బాబు తెలియజేశారు.

అనంతరం ఇద్దరూ కలిసి ఇంటి ఆవరణలో ఉన్న వేపచెట్టుకు మృతదేహాన్ని చీరతో ఉరిచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. లత ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లి నాగవేణికి సమాచారం అందించారు. ఆమె వెంటనే ఘటనా స్థలాన్ని చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ కిషోర్‌బాబు, ఎస్సై కె.ఇంద్రసేనారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి శరీరంపై ఉన్న గాయాలు, తలకు వెనుకభాగాన ఉన్న బలమైన గాయాలను బట్టి హత్య చేసి ఉరివేసి ఉంటారని గుర్తించారు. ఈ ఘటన జరిగిన అనంతరం లత అత్త, భర్త పరారీలో ఉండటంతో వారే హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సీఐ కిషోర్‌బాబు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement