నో స్టాక్

12 Sep, 2013 02:14 IST|Sakshi

మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి :  జిల్లాలో ఓ వైపు పంటలకు అనుకూలంగా వర్షాలు కురుస్తుండటం.. మరో యూరియా తీవ్రంగా వేధిస్తుండటంతో రైతన్నకు ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. ఎక్కడ యూరియాను పంపిణీ చేస్తున్నారంటే అన్నదాతలు అక్కడికి పరుగులు తీస్తున్నారు.
 
 తీరా అక్కడ నో స్టాక్..అనే మాట వినిపించడంతో బిక్కమోహం వేసుకుని కొద్దిసేపు వేచిచూసి ఇంటిబాట పడుతున్నారు. ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురియడంతో జిల్లా వ్యాప్తంగా రైతులు పంటలు సాగుచేశారు. ప్రస్తుతం వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో ఎరువులకు ముఖ్యంగా యూరియాకు బాగా డిమాండ్ పెరిగింది. అవసరానికి సరిపడా దొరక్కపోవడంతో రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
 
 జిల్లాలో యూరియా కొరత లేదని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నా  క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడా దొరకడం లేదు. రైతులు ఆందోళనలకు దిగిన చోట మరో మూడు నాలుగు రోజుల్లో యూరియా పంపిణీ చేస్తామని రైతులను మభ్యపెట్టేందుకు అధికారులు ముందస్తుగా టోకెన్లు ఇస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే గోపాల్‌పేట మండలంలో మంగళవారం రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడంతో 200 మందికి అడ్వాన్స్‌గా టోకన్లు ఇచ్చి పంపారు. యూరియా ఎప్పుడు వచ్చే ది మాత్రం రైతులకు సమాచారం ఇవ్వలేదు. గోపాల్‌పేటలో క్యూలైన్‌లో నిల్చునేందుకు ఇబ్బందులు పడుతూ ఆఖరుకు తమ పాసుపుస్తకాలను క్యూలైన్‌లో పెట్టి అతికష్టం మీద టోకెన్లు సంపాదించుకున్నా యూరియా మా త్రం దొరకలేదు. మరికల్ మండలంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పాఠశాలలకు వెళ్లాల్సిన చిన్నారులు సైతం తమ తల్లిదండ్రులకు బదులుగా ఎరువుల కోసం క్యూలో నిల్చున్నారంటే యూరియా కొరత ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. అలాగే బుధవారం తెల్లవారకముందే వందలాది మంది రైతులు దేవరకద్రలో క్యూలో నిల్చున్నా యూరియా దొరకలేదు. ఇక్కడి సొసైటీలో అరకొరగా ఉన్న స్టాకును పంపిణీచేసి అధికారులు చేతులెత్తేశారు.
 
 కేటాయింపులు ఇలా..
 జిల్లాకు కేటాయించిన ఎరువుల్లో 50 శాతం మార్క్‌ఫెడ్, మరో 50 శాతం ప్రైవేట్ డీలర్లకు కేటాయిస్తున్నారు. మార్క్‌ఫెడ్‌కు వచ్చిన ఎరువులను సొసైటీలకు పంపుతున్నా చాలా సొసైటీల్లో అక్కడకు చేరేలోపే మాయమవుతున్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో రైతులు తప్పని పరిస్థితుల్లో బయట ఎరువుల దుకాణాల్లో కొనుగోలు చేస్తున్నారు. ఇదే అదనుగా భావించి బస్తా యూరియాపై రూ.200 వరకు అదనంగా వసూలు చేస్తూ రైతులను పిండేస్తున్నా.. వ్యవసాయశాఖ విజిలెన్స్‌అధికారులు కన్నెత్తిచూడటం లేదు.
 
 ప్రతి ఎరువుల దుకాణంలో ధరల పట్టికను విధిగా ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. జిల్లాకేంద్రంలోని కొన్ని దుకాణాల్లోనే అది కనిపిస్తుంది. ఆగస్టులో 31,426 టన్నుల యూరియా అవసరం ఉండగా, వ్యవసాయశాఖ అధికారులు 20,050 టన్నుల యూరియా కోసం ప్రణాళికలు సిద్ధంచేసి ఆ మేరకు స్టాక్ పంపించాలని ఉన్నతాధికారులకు నివేదికలు పంపారు. నెలరోజులు గడిచినా అందులో ఇప్పటివరకు సగం స్టాక్ కూడా రాలేదు. వచ్చిన స్టాక్ ఎక్కడా కనిపించడం లేదు. గతేడాది కంటే ఈ సారి ఎక్కువ యూరియా వచ్చిందని మాత్రమే అధికారులు చెబుతున్నారే తప్ప అవసరమైన మేరకు తెప్పించడంలో విఫలమవుతున్నారు.  
 

మరిన్ని వార్తలు