రాఘవేంద్రా.. ఇదేమిటి?

23 Aug, 2019 07:37 IST|Sakshi
పీఠాధిపతిపై కేసు నమోదు చేయాలంటూ ఫిర్యాదు చేస్తున్న భక్తుడు వి.నారాయణ   

శ్రీమఠంలో గాడితప్పుతున్న అధికారులు

పీఠాధిపతిపై కేసు నమోదుకు భక్తుని డిమాండ్‌ 

గతంలోనూ ముగ్గురు అధికారులపై అవినీతి ఆరోపణలు

వరుస ఘటనలతో భక్తులు ఆందోళన

సాక్షి, మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి సశరీరంగా బృందావనస్తులైన పవిత్ర పుణ్యక్షేత్రం మంత్రాలయం. రాఘవేంద్రులు కొలువై మహిమలతో వివిధ ఖండాల్లోనూ భక్తుల మదిని దోచారు. అంతటి ప్రశస్థి కలిగిన క్షేత్రంలో గతమెన్నడూ లేని విధంగా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. భక్తుల సొమ్మును దిగమింగుతున్నారన్న ఆరోపణలు మొదలు.. పీఠాధిపతి తీరుపై సైతం విమర్శలు వచ్చాయి. గతంలో టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్న పాలకుర్తి తిక్కారెడ్డి లెటర్‌ ప్యాడ్‌పై పీఠాధిపతిగా సుబుదేంద్రతీర్థులు అనర్హుడంటూ సీఎం చంద్రబాబుకు లేఖ ఇచ్చారు. అదే సమయంలో మఠంలో ఇంజినీరింగ్‌ సెక్షన్‌లో పనిచేస్తున్న ఈఈ సురేష్‌ కోనాపూర్, మరో ఇంజినీర్‌ బద్రి, అసిస్టెంట్‌ మేనేజర్‌ నరసింహమూర్తి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని స్థానిక భక్తుడు వి.నారాయణ ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుల నేపథ్యంలో దేవదాయశాఖ కమిషనర్‌ భ్రమరాంబ విచారణ చేపట్టారు. ఫిర్యాదు దారులను పిలిపించి స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. ప్రస్తుతం విచారణ రిపోర్టు శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వద్దే ఉండిపోయింది.  

పీఠాధిపతిపై కేసు నమోదుకు ఫిర్యాదు.. 
అసలే ఉద్యోగులు ఆదాయానికి మించి ఆస్తుల కూడబెట్టారని ఆరోపణలు శ్రీమఠానికి కొంత మచ్చ తెచ్చాయి. ఈ గాయం నుంచి తేరుకోక ముందే  శ్రీమఠంపై మరో పిడుగుపడింది. ఈసారి ఏకంగా శ్రీమఠం పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులపై కేసు నమోదు చేయాలంటూ ఫిర్యాదు రావడం విశేషం. ఈనెల 19న రాఘవేంద్రస్వామి 348వ ఆరాధనోత్సవాల్లో భాగంగా మహారథోత్సవం నిర్వహించారు. రథయాత్ర ప్రారంభానికి ముందు రథంపై నుంచి పీఠాధిపతి రూ.100 కరెన్సీ నోట్లు విసిరారు. ఆ సమయంలో భక్తులు ఒక్కసారి నోట్ల కోసం ఎగబడ్డారు. ఈ సందర్భంలో ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి కుంటుంబ సభ్యులతోపాటు, కొందరు భక్తులు తూలిపడిపోయారు. తొక్కిసలాట చోటుచేసుకుంది. విచక్షణ మరిచి నోట్లు విసిరిన పీఠాధిపతిపై చట్ట పరంగా కేసు నమోదు చేయాలని గురువారం మంత్రాలయానికి చెందిన భక్తుడు వి.నారాయణ స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు.  

అంతటా చర్చ.. 
యాదృచ్ఛికమో.. లేక మెప్పులో భాగమో తెలీదుగానీ పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు కరెన్సీ విసరడం చర్చనీయాంశమైంది. తొక్కిసలాట ఇరు రాష్ట్రాల్లోనూ పెద్ద దుమారమే రేపింది. పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి దుర్ఘటన చోటుచేసుకోవడం బాధాకరమని భక్తులు పేర్కొంటున్నారు. శ్రీమఠం చరిత్రలో ఎన్నడూ ఎరుగని రీతిలో పీఠాధిపతిపైనే కేసు నమోదు చేయాలని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో దావానలంలా పాకింది.

మరిన్ని వార్తలు