ఎన్నికల ఏర్పాట్లలో విఫలం

1 Aug, 2013 05:32 IST|Sakshi

భద్రాచలం, న్యూస్‌లైన్: భద్రాచలంలో పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపించాయి. పోలింగ్ కేంద్రాల్లో సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో ఓటర్లతో పాటు సిబ్బంది కూడా తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. దీంతో భద్రాచలం పట్టణంలో విధులు నిర్వహించిన సిబ్బంది రిటర్నింగ్ అధికారితో వాగ్వాదానికి దిగారు. భద్రాచలం పంచాయతీ పరిధిలో మొత్తం 20 వార్డులు ఉండగా తొమ్మిది చోట్ల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ ఈ పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి సామగ్రిని అందుబాటులో ఉంచలేదు. ఏ ఒక్క కేంద్రంలో కూడా కనీసం తాగునీటికి కూడా ఏర్పాటు చేయలేదు. ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో సిబ్బందే తమ దుప్పట్లను అడ్డుగా అమర్చారు.
 
 మరికొన్ని చోట్ల బీరువాలు, బల్లలు అడ్డుపెట్టారు. దీంతో రాజుపేట, నన్నపనేని, ఎంపీడీవో కార్యాలయాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఓటు ఎవరికి వేస్తున్నారనే విషయం అందరికీ కనిపించిందని పోలింగ్ ఏజంట్లు తెలిపారు. అదే విధంగా పోలింగ్ అనంతరం బాక్స్‌లకు సీల్ వేసేందుకు కూడా తగిన సామగ్రి లేకపోవడంతో వాటిని ప్యాకింగ్ చేయకుండానే కౌంటింగ్ కేంద్రానికి తరలించారు. పోలింగ్‌కు సంబంధించిన వివరాలను భద్ర పరిచి తీసుకొచ్చేందుకు 6 పెద్ద కవర్‌లు, ఎన్నికలు గుర్తులు రాసేందుకు చార్టులు, ఇవ్వాల్సి ఉన్నప్పటికీ అవేమీ అందజేయలేదని సిబ్బంది తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలపై ఆరా తీసేందుకు ఏ ఒక్క అధికారి కూడా రాలేదని సిబ్బంది తెలిపారు. ఇదిలాఉండగా పోలింగ్ కేంద్రాల వద్ద కూడా తగిన రీతిలో పోలీస్ సిబ్బందిని నియమించలేదు. ఈ కారణంగా రాజుపేట, నన్నపనేని, ఆర్‌అండ్‌బీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు గుర్తులను పట్టుకొని ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే ఆర్‌అండ్‌బీ కార్యాలయంలోని పోలింగ్ కేంద్రంలోకి తరచూ వెళ్లి వస్తున్న పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నక్కా ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 
 భోజనాలు కూడా పెట్టరా..? : ఎన్నికల విధుల కోసంవచ్చిన తమకు కనీసం భోజనాలు కూడా పెట్టకపోతే ఎలా అని నన్నపనేని, జూనియర్ కళాశాల కేంద్రాల్లో విధుల నిర్వహంచిన పలువురు సిబ్బంది రిటర్నింగ్ అధికారితో వాగ్వాదానికి దిగారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన తాము ఆకలితో అలమటిస్తూ ఎన్నికల విధులు నిర్వహించాల్సి వచ్చిందని రాజారావు అనే ఉపాధ్యాయులు రిటర్నింగ్ అధికారితో వాగ్వాదానికి దిగారు. కొంత మంది మహిళా ఉద్యోగులు సైతం ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌంటింగ్ కేంద్రానికి తీసుకువచ్చిన పోలింగ్ బాక్సులను ఎక్కడ పెట్టాలో కూడా చెప్పేవారు లేకపోవడంతో సిబ్బంది వాటిని పట్టుకుని పడిగాపులు కాశారు.
 
 భద్రాచలంలో ఆలస్యంగా కౌంటింగ్ : భద్రాచలం పంచాయతీకి సంబంధించి సకాలంలో కౌంటింగ్ ప్రారంభం కాలేదు. సిబ్బంది పోలింగ్ బాక్స్‌లను సకాలంలోనే తీసుకొచ్చినప్పటికీ వారికి కౌంటింగ్ విధులను సకాలంలో కేటాయించకపోవడంతో సాయంత్రం 4 గంటల వరకు ప్రారంభం కాలేదు. దీంతో అర్ధరాత్రి వరకు సర్పంచ్ ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ నిర్వహించాల్సి వచ్చిందని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
 

మరిన్ని వార్తలు