అడవిలో వృద్ధురాలు బందీ 

26 Aug, 2019 08:16 IST|Sakshi

సాక్షి, పరిగి(అనంతపురం) : మండలంలోని శాసనకోట పంచాయతీ కొడిగెనహళ్లి సమీపంలో ఉన్న ఓ అటవీ ప్రాంతంలో ఆదివారం మ ధ్యాహ్నం ఓ వృద్ధురాలిని ఆమె చీరతోనే చెట్టుకు కట్టేసిన వైనం వెలుగు చూసింది. అటుగా వెళ్లిన గొర్రెల కాపరుల నుంచి విషయం తెలుసుకున్న గ్రామస్తుల సమాచారం మేరకు విలేజ్‌ కానిస్టేబుల్‌ వీరేష్‌ అక్కడకు చేరుకుని పరిశీలించారు. అప్పటికే వర్షంలో 85 ఏళ్ల పండు ముదుసలి తడిసి ముద్దైపోయింది. చలికి వణుకుతూ అచేతనంగా పడి ఉంది. అప్పటికే ఆమె శరీరంపై గండుచీమలు గాయపరిచిన గాయాలు ఉన్నాయి. రోడ్డుకు దాదాపు ఒకటిన్నర కిలోమీటరు దూరంలో అటవీ ప్రాంతంలో కట్టిపడేసిన వృద్ధురాలని కానిస్టేబుల్‌ తన చేతులపై మోసుకొచ్చి, అనంతరం ద్విచక్ర వాహనంపై కొడిగెనహళ్లికి తరలించారు. ఉర్దూలో మాట్లాడుతుండడంతో ఆమె ముస్లిం సామాజిక వర్గానికి చెందినవారై ఉంటారని భావిస్తున్నారు. అయితే తన వివరాలు సక్రమంగా తెలపలేకపోతుండడంతో  సేవామందిరంలోని ప్రశాంతి వృద్ధాశ్రమంలో చేర్పించారు. కానిస్టేబుల్‌ వీరేష్‌ను ఈ సందర్భంగా హిందూపురం రూరల్‌ సీఐ ధరణీకిషోర్, ఎస్‌ఐ శ్రీనివాసులు అభినందించారు.   

మరిన్ని వార్తలు