విభజన తట్టుకోలేక ఆగిన గుండె

20 Feb, 2014 02:36 IST|Sakshi

 భీమవరం క్రైం, న్యూస్‌లైన్ : రేపు కొడుకు పెళ్లి.. ఇంతలోనే ఆ తండ్రి గుండె ఆగిపోయింది. ఒకవైపు పెళ్లి ఏర్పాట్లు చూసుకుంటూనే రాష్ట్రం ఏమైపోతుందోనని ఆ తండ్రి తల్లడిల్లుతూనే ఉన్నాడు. లోక్‌సభలో రాష్ర్ట విభజన జరిగిపోయింది. కనీసం రాజ్యసభలోనైనా బిల్లు ఆగకపోతుందా అన్న ఆత్రుత చివరకు కన్న కొడుకు పెళ్లి కూడా చూడకుండానే ఆ తండ్రి గుండె ఆగేలా చేసింది. హృదయ విదారకమైన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక సుంకర పద్దయ్య వీధిలో నివాసముంటున్న ఆరిశ కొండలరావు (53) ఎం అండ్ ఎం వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. రెక్కాడితేనే గానీ డొక్కాడని కుటుంబం అతనిది. అద్దె ఇంట్లో నివసిస్తూ జీవనం సాగిస్తున్నారు. గురువారం కొండలరావు కుమారుడు వెంకట సుధీర్ వివాహం తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం తిమ్మాపురంలో జరగాల్సి ఉంది. ఉదయమే కొండలరావు కుటుంబ సభ్యులు, బంధువులు తిమ్మాపురం వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నారు.
 
 బుధవారం సాయంత్రం పెళ్లి పనులు చేసుకుని రాజ్యసభలో బిల్లు ఏమవుతుందోననే ఆత్రుతతో టీవీ పెట్టాడు. అక్కడ కూడా విభజన బిల్లు ఆగే పరిస్థితి కనిపించకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన కొండలరావు గుండెపోటుకు గురయ్యాడు. కూర్చున్న కుర్చీలోనే కుప్పకూలాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తీసుకెళదామనుకునే లోగానే కన్నుమూశాడు. పెళ్లి జరగాల్సిన ఇంట విషాదఛాయలు అలముకున్నాయి. కొండలరావు మృతితో అతని భార్య, కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు చూపరులను కలచివేసింది.
 

మరిన్ని వార్తలు