ఒక్క బోరే

22 Feb, 2014 04:15 IST|Sakshi
ఒక్క బోరే

 బూర్జ,  :
 మండలంలోని లచ్చయ్యపేట కాలనీ వాసులు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీలో సుమారు 90 కుటుంబాలు నివాసం ఉండగా, వారి తాగునీటి అవసరాల కోసం అధికారులు ఒక్కబోరు ఏర్పాటు చేశారు. లచ్చయ్యపేట పాత ఊరు వాసులు సైతం ఈ బోరు నుండే నీరు తీసుకు వెళుతున్నారు. ఈ బోరుపై ఎక్కువ ఒత్తిడి పడడంతో ఎప్పుడు మూలకు చేరుతుందోనని కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు.
 తెల్లవారుజాము నుంచే క్యూ
 కాలనీలో నివాసం ఉంటున్న వారంతా నిరుపేదలే కావడంతో ఉదయాన్నే కూలి పనులకు వెళ్లాలి. దీంతో అందరూ ఒకేసారి నీటి కోసం బోరు వద్ద గుముకూడుతున్నారు. తెల్లవారు జాము మూడు గంటల నుంచే బోరు వద్ద క్యూ కడుతున్నారు. మహిళలు బోరు వద్ద నిత్యం గొడవలు పడుతుంటారు. వేసవి వస్తే పరిస్థితి చెప్పనక్కర లేదు. బోరు నుంచి తక్కువ నీరు రావడంతో ఒక్కో ఇంటికి బిందెడు నీరు దొరకడం కూడా కష్టమే.
 సింగన్నపాలెం గ్రామంలో ఉన్న రక్షిత మంచినీటి పథకం ద్వారా ఈ గ్రామానికి పైపులైన్ వేసి తాగునీరు సరఫరా చేయాలనే ఉద్దేశంతో కుళాయిలు వేశారు. కుళాయి నీరు కూడా కాలనీకి రావడం లేదు.  దీంతో కాలనీ వాసులు మంచినీటి కోసం పడుతున్న అవస్థలు వర్ణనీతీతం. మరోబోరు ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు పలుమార్లు అధికారులకు విన్నవించినా.. పట్టించుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.   
 
 

మరిన్ని వార్తలు