ఉల్లితో లాభాల మూట..

14 Dec, 2019 09:12 IST|Sakshi

హోసూరు రైతులకు కాసుల పంట

 దాదాపు రూ.5 కోట్ల ఆదాయం 

సాక్షి, పత్తికొండ: కష్టానికి తోడు అదృష్టం ఉండాలే కాని కరువు నేలలో కూడా సిరులు పండించవచ్చునని చాటి చెప్పారు హోసూరు రైతులు. ఇప్పటికే బోరు బావుల కింద ఆకు కూరుల సాగు చేస్తూ గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన రైతులు.. ఈ ఏడాది ఉల్లిలో కూడా వారికి కలిసివచ్చింది. సాధారణంగా మెట్టభూముల్లో  వర్షాధారంపై శనగ, జొన్న, వాము, పత్తి తదితర సంప్రదాయక పంటలు మాత్రమే సాగు చేస్తారు. అయితే హోసూరు గ్రామానికి చెందిన పలువురు రైతులు ఈ ఏడాది వినూత్నంగా ఆలోచించారు. వర్షాధారం కింద మెట్టభూముల్లో ఉల్లి పంటను సాగుచేసి లాభాలు మూట గట్టుకున్నారు. పత్తికొండ వ్యవసాయ సబ్‌ డివిజన్‌లోని పత్తికొండ, తుగ్గలి, మద్దికెర, దేవనకొండ మండలాల్లో ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో బోరుబావుల కింద రైతులు 9,040 ఎకరాల్లో ఉల్లిని సాగుచేశారు.

ఇదే సమయంలో పత్తికొండ మండలం హోసూరు గ్రామానికి చెందిన దాదాపు 120మంది రైతులు 500 ఎకరాల్లో మెట్ట భూముల్లో ఉల్లి వేశారు. సకాలంలో వర్షాలు కురవడంతో వారి పంట పండింది. కొందరు రైతలు సమీప కాల్వల్లో, వంకల్లో నీటిని సద్వినియోగం చేసుకున్నారు. ఎకరాకు 100 నుంచి 200 ప్యాకెట్ల వరకు దిగుబడి సాధించారు. ఇదే సమయంలో ఈ సారి ధర ఉల్లి రైతును సంతోషంలో ముంచెత్తింది. దీంతో క్వింటాల్‌కు కనిష్టంగా రూ.5వేలు నుంచి గరిష్టంగా రూ.12వేల వరకు ధర లభించింది. హోసూరు గ్రామంలో ఉల్లి సాగుచేసిన రైతులకు ఈ ఏడాది కనీసం రూ.5 కోట్లు వచ్చాయి. ఏటా పెట్టుబడి కూడా చేతికందని పంట ఈ సారి కాసులు కురిపించింది. ఎన్నడూ చూడని లాభాలు చూశారు. మార్కెట్లో ఉల్లికి ఉన్న డిమాండ్‌ను చూసి ఇపుడు రబీ సీజన్‌లోనూ పెద్ద ఎత్తున రైతులు ఇదే పంటను సాగు చేస్తున్నారు.  

గట్టెక్కించింది..  
పట్టువదలని విక్రమార్కుల్లా సాగు చేసిన ఉల్లి రైతుల పంట పండింది. సాధారణంగా ఎకరాకు పెట్టుబడి కనీసం రూ.30 వేలు నుంచి రూ.60 వేలు అవుతోంది. మార్కెట్లో మంచి ధర లభిస్తేనే రైతులకు గిట్టుబాటు అవుతోంది. లేకపోతే అప్పులపాలే. గత ఏడాది క్వింటాల్‌ ఉల్లి రూ. 200 నుంచి రూ. 300 దాటలేదు. ఎంతో మంది తీవ్రంగా నష్టపోయారు. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది ఉల్లికి డిమాండ్‌ రాడంతో మార్కెట్లో ధర ఎన్నడూ లేని విధంగా రికార్డులు బ్రేక్‌ అయ్యాయి. క్వింటాల్‌ ఉల్లి ధర రూ.3 వేల నుంచి పెరుగుతూ ఒక దశలో రూ.15 వేలు దాటింది. ప్రస్తుతం రూ. 8వేలు నుంచి రూ. 10వేలుకు పైగా పలుకుతోంది. ఇప్పుడు వచ్చిన లాభాలతో గతంలో చేసిన అప్పుల నుంచి గట్టెక్కే పరిస్థితి ఏర్పడింది. ఉల్లి.. వారికి సిరుల తల్లిగా మారింది.

రూ. 8 లక్షలు మిగిలాయి
నాలుగు ఎకరాల్లో ఉల్లిపంట వేశా. క్వింటంరూ.6800 ధర వచ్చింది. రూ. 10 లక్షలు వచ్చాయి. పెట్టుబడి పోను రూ. 8 లక్షలు మిగిలాయి. గత నాలుగేళ్లుగా చేసిన అప్పులు తీర్చేస్తాను. భూమి కరుణిస్తే వ్యవసాయాన్ని మించినది ఏదీ లేదు. ఏటా ఇలాగే పంటలు పండితే అందరూ సేద్యం చేస్తారు. – భైరపు పరశురాముడు 

ఈ ఏడాది బాగుంది 
నేను 6 ఎకరాలను రూ. 50 వేలకు గుత్తకు తీసుకుని ఉల్లిపంట వేశా. గడ్డ సైజు బాగానే ఉంది. ఇంకో వారం రోజుల్లో పంట కోస్తాం. కనీసం 400 ప్యాకెట్లు దిగుబడి వస్తుందని అనుకుంటున్నాం. మార్కెట్లో మంచి ధర ఉండటంతో పెట్టుబడి ఖర్చులు పోయినా గిట్టుబాటు అవుతుందనే ఆశతో ఉన్నాం. – కొత్తకాపు రంగారెడ్డి

మరిన్ని వార్తలు