ఆన్‌లైన్‌లో భవన నిర్మాణ దరఖాస్తులు

29 Sep, 2013 01:23 IST|Sakshi
ఆన్‌లైన్‌లో భవన నిర్మాణ దరఖాస్తులు

 సాక్షి, హైదరాబాద్: భవన నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తులందజేసేందుకు గ్రేటర్ ప్రజలు ఇకపై జీహెచ్‌ఎంసీ కార్యాలయాల దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంటి నుంచో, కార్యాలయం నుంచో నెట్ సదుపాయం ఉన్న కంప్యూటర్ నుంచే (ఆన్‌లైన్) సంబంధిత అధికారులకు దరఖాస్తులను పంపించవచ్చు. జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్ www.ghmc.gov.in (జీహెచ్‌ఎంసీ.జీవోవీ.ఇన్) లోని సంబంధిత నమూనా దరఖాస్తు ఫారంలోకి వెళ్లి .. అందులో సూచించిన విధంగా వివరాలు నమోదు చేసి పంపితే సరిపోతుంది. అనుమతి కోసం దరఖాస్తుతో పాటు చెల్లించాల్సిన ఫీజును కూడా ఆన్‌లైన్ చెల్లింపు విధానాల్లో (ఎన్‌ఈఎఫ్‌టీ, ఆర్‌టీజీఎస్) చెల్లించవచ్చు. ఆ మేరకు అక్‌నాలెడ్జిమెంటు అందుతుంది. ఈ విధానంతో భవన నిర్మాణ అనుమతులకు దరఖాస్తు చేసుకునేవారికి ఎంతో సమయం కలిసి వస్తుందని అధికారులు చెబుతున్నారు. కార్యాలయాలదాకా వెళ్లాల్సిన అవసరం లేకపోవడంతో పాటు, దరఖాస్తు సమర్పించేందుకు క్యూలో వేచి ఉండే పనిలేదంటున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల్ని స్వీకరించే ఈ విధానాన్ని సుమారు పది రోజుల్లో అందుబాటులోకి తేనున్నట్లు అదనపు కమిషనర్ (ప్లానింగ్) రొనాల్డ్ రాస్ ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉందని చెప్పారు. ఈ విధానంతో పాటు సిటిజన్ సర్వీస్ సెంటర్ల (సీఎస్‌సీలు) ద్వారా దరఖాస్తులందజేసే పద్ధతీ అందుబాటులో ఉంటుందన్నారు.
 
 ఇదిలావుండగా ఫైళ్ల క్లియరెన్స్‌లో ఎవరైనా అధికారులు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తే చర్యలు తీసుకుంటున్నట్లు రాస్ చెప్పారు. టౌన్‌ప్లానింగ్ విభాగంలో ఇటీవల ప్రారంభించిన ఫైల్ మేనేజ్‌మెంట్ సిస్టం(ఎఫ్‌ఎంఎస్)ల ద్వారా ఫైళ్లు ఎక్కువ రోజులు ఎక్కడ ఆగిపోతున్నాయో తెలుసుకునేందుకు వీలవుతోందని ఆయన తెలిపారు. ఇలా జాప్యానికి కారకులైన ముగ్గురు అధికారులకు షోకాజ్‌లు జారీ చేశామన్నారు. బీపీఎస్ ఫైళ్ల వివరాలను కూడా ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నామని చెప్పారు.

మరిన్ని వార్తలు