అంతర్జాలంలో ‘పంచాయతీ’

20 May, 2016 03:39 IST|Sakshi
అంతర్జాలంలో ‘పంచాయతీ’

జిల్లాలో కార్యదర్శులు, ఈవోపీఆర్డీలకు శిక్షణ పూర్తి
అన్ని వివరాలు ఈ నెల 21లోగా ఆన్‌లైన్‌కు ఆదేశాలు
కంప్యూటర్లతో కార్యదర్శులు, ఆపరేటర్ల కుస్తీ   

 
 
సత్తెనపల్లి :- గ్రామ పంచాయతీల వివరాలన్నింటినీ ఇకపై అంతర్జాలంలో పొందుపరిచేందుకు వీలుగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఈ నెల 17వ తేదీ డివిజన్ల వారీగా పంచాయతీ కార్యదర్శులు, ఈవోపీఆర్డీలకు గుంటూరులో శిక్షణ తరగతులు నిర్వహించారు. గ్రామ పంచాయతీల్లో వనరులు, ఇంటి పన్నులు, జనన, మరణాలు, నిధులు, విధులు తదితర అంశాలను దస్త్రాల నుంచి అంతర్జాలంలో పొందుపరిచే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ నెల 10న పంచాయతీరాజ్ అదనపు కమిషనర్ వీడియో కాన్ఫరెన్‌‌స నిర్వహించి ఈ నెల 21 నాటికి పంచాయతీల వారీగా పూర్తి వివరాలను అంతర్జాలంలో నమోదుకు ఆదేశించారు.  


 మండల కేంద్రాల్లో నమోదు ఇలా..
 జిల్లాలోని 57 మండల కేంద్రాల్లో ఈవోపీఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు, కంప్యూటర్ ఆపరేటర్లు గ్రామ పంచాయతీలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. ప్రతి పంచాయతీకి చెందిన 2013-14 నుంచి 2015-16 వరకు సాధారణ నిధులు, 13, 14వ ఆర్థిక సంఘం నిధులు, ఎస్‌ఎఫ్‌సీ నిధులకు చెందిన నగదు జాబితాలు, అన్ని పంచాయతీలకు చెందిన ఇంటి పన్నులు, పన్నేతర, రెమిటెన్స్ వివరాలను పంచాయతీ కార్యదర్శులు నమోదు చేయాల్సి ఉంది. అన్ని పంచాయతీల 2016-17 అభివృద్ధి ప్రణాళికలు, సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, ఎంపీటీసీ సభ్యుల వివరాలను మండలాల ఈవోపీఆర్డీలు నమోదు చేయాలి.


 21లోగా నమోదుకు కసరత్తు..  
 పంచాయతీల సమాచారం ఆన్‌లైన్ చేసే ప్రక్రియ ఈ నెల 21 నాటికి పూర్తి చేయాలని ఉన్నతాధికారుల ఆదేశాలతో ఎంపీడీవో కార్యాలయాల్లో కంప్యూటర్ల ముందు పంచాయతీ కార్యదర్శులు, కంప్యూటర్ ఆపరేటర్లు కసరత్తు ముమ్మరం చేశారు. ప్రతి పంచాయతీ సమగ్ర సమాచారం నమోదు చేయాల్సి ఉండటంతో ఈ నెల 21 నాటికి పూర్తి కావడం సాధ్యమయ్యేలా లేదు. అంతర్జాల నమోదులో ఎలాంటి అనుమానాలు ఉన్నా నివృత్తి చేసేందుకు ప్రత్యేక అధికారులను నియమించారు. వారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నమోదు ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు