కేరళ కోటలో లెఫ్ట్ పాగా | Sakshi
Sakshi News home page

కేరళ కోటలో లెఫ్ట్ పాగా

Published Fri, May 20 2016 3:34 AM

కేరళ కోటలో లెఫ్ట్ పాగా

91 స్థానాలతో ఎల్డీఎఫ్ జయకేతనం
* 47 స్థానాలతో సరిపెట్టుకున్న యూడీఎఫ్
* సాకారమైన బీజేపీ కల, ఒక స్థానంలో గెలుపు
* సీఎం పోటీలో అచ్యుతానందన్, విజయన్

తిరువనంతపురం: కేరళలో మరోసారి అధికార మార్పిడి కొనసాగింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కోటను బద్దలుగొట్టి కమ్యూనిస్టులు పాగా వేశారు. సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి 140 సీట్లకు గాను 91 స్థానాలు గెలుచుకుని అధికారాన్ని కైవసం చేసుకుంది. అధికార యూడీఎఫ్ కూటమి 47 సీట్లకే పరిమితమైంది.

ఎల్డీఎఫ్ 86 స్థానాల్ని చేజిక్కించుకోగా... ఆ కూటమి బలపరిచిన ఐదుగురు స్వతంత్రులు కూడా గెలుపొందారు. బీజేపీ ఒక స్థానంలో గెలుపొంది తొలిసారి కేరళ అసెంబ్లీలో అడుగుపెట్టబోతోంది. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత ఒ.రాజగోపాల్ నెమమ్ నుంచి విజయం సాధించారు. ఇతరులు ఒక స్థానంలో గెలుపొందారు. ఎల్డీఎఫ్ నుంచి గెలిచిన ప్రముఖుల్లో సీఎం పదవి ఆశావహులైన వి.ఎస్.అచ్యుతానందన్, పినరయి విజయన్‌లతో పాటు థామస్ ఐజాక్, ఈపీ జయరాజన్, నటుడు ముకేష్‌లు ఉన్నారు. త్రిస్సూర్, కన్నూర్, కొజికోడ్, కొల్లాం, అలపుజా, తిరువనంతపురం జిల్లాలో ఎల్డీఎఫ్ అత్యధిక స్థానాలతో సత్తా చాటింది.

లెఫ్ట్ కూటమి ప్రభంజనాన్ని తట్టుకున్న వారిలో ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ, బార్ లెసైన్స్‌ల ఆరోపణలతో రాజీనామా చేసిన మంత్రి కె.ఎం.మణిలు ఉన్నారు. కేబినెట్ మంత్రులైన కె.బాబు, బేబీ జాన్(ఆర్‌ఎస్పీ), కె.పి.మోహనన్(జేడీయూ), పీకె జయలక్ష్మి(కాంగ్రెస్)లు ఎల్డీఎఫ్ ధాటికి ఓటమి చెందారు. స్పీకర్ ఎన్.శక్తన్, డిప్యూటీ స్పీకర్ పాలోడ్ రవి, కాంగ్రెస్ నేతలు కె.సుధాకరన్, పండలం సుధాకర న్, పద్మజా వేణుగోపాల్, శనిమోల్ ఉస్మాన్‌లు పరాజయం పాలయ్యారు.  
 
రాజగోపాల్‌తో నెరవేరిన బీజేపీ కల
సీనియర్ నేత ఒ.రాజగోపాల్ విజయంతో కేరళలో బీజేపీ కల ఎట్టకేలకు సాకారమైంది. 86 ఏళ్ల రాజకీయ కురువృద్ధుడైన రాజగోపాల్ 8,671 ఓట్ల మెజార్టీతో సీపీఎం సిట్టింగ్ ఎమ్మెల్యే వి.శివన్‌కుట్టిపై గెలుపొందారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మనమ్ రాజశేఖరన్, మాజీ అధ్యక్షుడు వి.మురళీధరన్‌లు ఓటమి పాలయ్యారు. బీజేపీ నుంచే పోటీచేసిన క్రికెటర్ శ్రీశాంత్ పరాజయం చెందాడు. బీజేపీ ఆరు నియోజకవర్గాల్లో రెండో స్థానంలో నిలిచింది. 10.5 శాతం ఓట్లతో సీపీఎం, కాంగ్రెస్‌ల తర్వాతి స్థానంలో నిలిచింది.
 
కాంగ్రెస్ కొంపముంచిన అవినీతి
వరుస అవినీతి ఆరోపణలు ఊమెన్ చాందీ నేతృత్వంలో యూడీఎఫ్‌ను చావుదెబ్బకొట్టాయి. బార్ అనుమతుల కేసు నుంచి సోలార్ కుంభకోణం వరకూ ముఖ్యమంత్రిగా ఉన్న చాందీనే వ్యక్తిగతంగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయినా విస్తృతంగా ప్రజాల్లోకి చొచ్చుకెళ్లే పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే గట్టెక్కిస్తాయంటూ ముందడుగు వేసినా ప్రజలు మాత్రం తిరస్కరించారు. అ భ్యర్థుల ఎంపికలో ఢిల్లీ ఆదేశా ల్ని పక్కనపెట్టి అవినీతి మం త్రులకు సీట్లివ్వడం కాంగ్రెస్ ఓటమికి కారణమైంది.
 
నేడు సీఎం పదవికి చాందీ రాజీనామా
తిరువనంతపురం: యూడీఎఫ్ కూటమి ఓటమితో కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ నేడు తన పదవికి రాజీనామా చేయనున్నారు. రాజీనామా పత్రాన్ని శుక్రవారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర గవర్నర్ పి.సదాశివంకు అందచేస్తారని చాందీ మీడియా కార్యదర్శి పీటీ చాకో తెలిపారు. కాగా, కన్నూరు జిల్లా ధర్మాదం నియోజకవర్గంలో పినరయి విజయన్ గెలుపు సంబరాల్లో సీపీఎం, బీజేపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణలో ఒక వ్యక్తి మరణించగా, ఎనిమిదిమంది గాయపడ్డారు. పలు ప్రాంతాల్లో సీపీఎం, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చెలరేగడంతో పలువురు గాయపడ్డారు.
 
ఆ ఇద్దరిలో ఒకరు
ఎల్డీఎఫ్ గెలుపు సంబరాలు జోరుగా సాగుతున్నా సీఎం ఎవరన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థిగా ఎవరినీ ప్రకటించని ఎల్డీఎఫ్ ఫలితాలు తర్వాతే నిర్ణయిస్తామని వెల్లడించింది. మాజీ సీఎం, సీపీఎం కురువృద్ధుడు వి.ఎస్.అచ్యుతానందన్, పొలిట్‌బ్యూరో సభ్యుడు పినరయి విజయన్‌ల మధ్యే పోటీ ఉంది. ఇద్దరూ ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందారు.

ఒకట్రెండు రోజుల్లో పార్టీ నాయకత్వం సమావేశమై సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తుందని సీపీఎం వర్గాలు తెలిపాయి. అభ్యర్థి ఎంపిక సందర్భంగా ఎల్డీఎఫ్ పార్టీలైన సీపీఐ, ఎన్సీపీ, జేడీఎస్‌తో కూడా చర్చిస్తామని ఆ వర్గాలు వెల్లడించాయి. కూటమిలో పెద్ద పార్టీ సీపీఎంనే సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రాజేంద్రన్ ప్రకటించారు.

Advertisement
Advertisement