ఆపరేషన్ ‘గొల్లూరు’

28 Nov, 2014 01:51 IST|Sakshi

పాడేరు: ఒడిశా కోరాపుట్టు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల సరిహద్దు గొల్లూరు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు స్థావరం ఏర్పాటు చేసుకున్నారనే సమాచారంతో పోలీసు బలగాలు అప్రమత్తమయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచి పోలీసు యంత్రాంగానికి ఏమాత్రం అనుమానం రాకుండా దళసభ్యులు గొల్లూరు అటవీ ప్రాంతంలో మకాం వేయడం పోలీసు యంత్రాంగాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటి వరకు పోలీసు రికార్డుల్లోకి ఎక్కని ఏఓబీలోని ఈ ప్రాంతంలో మావోయిస్టులు సురక్షితంగా తమ కార్యకలాపాలను సాగించడాన్ని తీవ్రంగానే పరిగణిస్తుంది. అరకులోయ మండల కేంద్రానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొల్లూరులోని లోయ ప్రాంతాన్ని ఇంత వరకు ఒడిశా, విశాఖ, విజయనగరం జిల్లాల పోలీసు యంత్రాంగం సందర్శించిన దాఖలాలు లేవు.

పోలీసుల రికార్డుల్లో కూడా ఎక్కని ఈ లోయ ప్రాంతంపై కేంద్ర, రాష్ట్ర పోలీసు యంత్రాంగం దృష్టి సారించింది. మావోయిస్టుల స్థావరాన్ని చేధించి వారి ఏరివేతే లక్ష్యంగా విస్తృతంగా కూంబింగ్‌కు ఒడిశా, ఆంధ్ర పోలీసు బలగాలు కదులుతున్నాయి. కోరాపుట్టు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన రూరల్ ఎస్పీలంతా ఇప్పటికే ఈ ప్రాంతంపై సమగ్ర వివరాలను సేకరించి కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచి అధికారులకు సమాచారం చేరవేసినట్టు భోగట్టా.

తొలిసారిగా గొల్లూరు ప్రాంతంలో కూంబింగ్‌తో పోలీసు యంత్రాంగం కూడా పలు జాగ్రత్తలను తీసుకుంటోంది. ముందుగా హెలికాప్టర్‌తో ఏరియల్ సర్వేకు యోచిస్తున్నారు. ‘ఆపరేషన్ గొల్లూరు’  పేరిట ఒడిశా, ఆంధ్ర పోలీసు బలగాలు ముందుకు కదలనున్నాయి. మూడు జిల్లాల పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు మావోయిస్టుల సంచారంపై వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే వీరు సమావేశమై మావోయిస్టుల కార్యకలాపాలకు సంబంధించిన కీలక సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు