‘బదౌన్’ సోదరీమణులది ఆత్మహత్యే: సీబీఐ

28 Nov, 2014 01:53 IST|Sakshi

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌కు చెందిన ఇద్దరు బాలికలు ఆత్మహత్యకు పాల్పడ్డారనీ వారిపై సామూహిక అత్యాచారం, హత్య జరగలేదని సీబీఐ గురువారం తేల్చి చెప్పింది. దీనిపై సీబీఐ ప్రతినిధి కాంచన్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ ఘటనపై శాస్త్రీయ పద్ధతుల్లో 40 రకాల పరీక్షలు చేయించామన్నారు. మెడికల్ బోర్డు బాలికలపై లైంగిక దాడి జరిగిందన్న అనుమానాలు వ్యక్తం చేయడంతో దీన్ని నిర్ధారించేందుకు  హైదరాబాద్‌లోని డీఎన్‌ఏ నిపుణుల సాయం తీసుకున్నామన్నారు. వారు పరీక్షలు జరిపి అత్యాచారం, హత్య జరిగిందనడానికి ఎలాంటి అధారాలు లేవని తేల్చినట్లు పేర్కొన్నారు.

ఈ నివేదికను శుక్రవారం బాదావున్ కోర్టుకు సమర్పించనున్నారు. ఇందులో నిందితులుగా భావి స్తున్న ఐదుగురిని గతంలోనే యూపీ పోలీసులు అరెస్టు చేశారు. వారిపై  చార్జిషీటును కూడా దాఖలు చేయరాదని సీబీఐ భావిస్తోంది.  దగ్గర బంధువులైన ఈ బాలికలు గత మే నెలలో  తమ గ్రామానికి సమీపంలోనే ఉన్న ఓ చెట్టుకు ఉరివేసుకొని అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. కాగా, మృతిచెందిన బాలికల కుటుంబీకులు సీబీపై దర్యాప్తును తప్పుపట్టారు. తమ పిల్లలు ఆత్మహత్యచేసుకోలేదని, దీనిపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.
 

మరిన్ని వార్తలు