వైద్యం గాలికొదిలేశారు

9 Sep, 2015 03:59 IST|Sakshi
వైద్యం గాలికొదిలేశారు

- వైద్యులు, సిబ్బంది కొరత, మందులు లేవు
- అడిగినా పలికే వారు లేరు
- డెంగీ వచ్చినా పట్టించుకోలేదు
- జెడ్పీ సమావేశంలో నిలదీసిన ప్రతిపక్ష సభ్యులు
సాక్షి, చిత్తూరు :
‘జిల్లాలో మలేరియా, డెంగీలాం టి ప్రమాదకర వ్యాధులు ప్రబలాయి. వేలాది మంది వ్యాధుల బారిన పడ్డారు. వంద మంది వరకు మృత్యువాతపడ్డారు. చెన్నై, బెంగళూరు ప్రాంతాలకు వైద్యం కోసం వెళ్లి వందల కుటుంబాలు అప్పులపాలయ్యాయి. ప్రభుత్వం పట్టిం చుకుని ఏ ఒక్కరికీ వైద్యం అందించడం లేదు. డాక్టర్లు, సిబ్బంది లేరు. మందులు లేదు ... అడిగితే సమాధానమిచ్చే వారు లేరు.. చనిపోయిన వారికి పరిహారమైనా ఇవ్వండి’ ... అంటూ మంగళవారం జెడ్పీ సర్వసభ్యసమావేశంలో జిల్లాపరిషత్ చైర్‌పర్సన్ గీర్వాణి, కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్‌ను ప్రతిపక్ష సభ్యులు (వైఎస్సార్‌సీపీ) నిలదీశారు.

సంక్షేమం, వైద్యఆరోగ్యం తదితర అంశాల అజెండాగా జరిగిన సమావేశంలో జిల్లా పరిషత్ నిధులు, చేపట్టిన పనులపై మొదట చర్చించాలని  ఫ్లోర్‌లీడర్ వెంకటరెడ్డి యాదవ్ కోరగా, చైర్‌పర్సన్ అంగీకరించలేదు. అనంతరం జిల్లా వైద్యఆరోగ్యంపై చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి మాట్లాడుతూ జిల్లాలో వేలాది మంది డెంగీ బారిన పడ్డారన్నారు. ప్రభుత్వఆరోగ్య కేంద్రాలకు వెళితే వైద్యులు, సిబ్బంది కూడా అందుబాటులో ఉండడం లేదన్నారు. బెంగళూరు, చెన్నైకు వెళ్లి చూపించే ఆర్థిక స్థోమత లేక  ఇప్పటికే వంద మంది వరకు మరణించారని తెలిపారు. చనిపోయిన వారికి పరిహారమివ్వాలని డిమాండ్‌చేశారు. పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి మాట్లాడుతూ పలమనేరులో డెంగీ వ్యాధి ఎక్కువగా ఉందన్నారు.

ఇటీవల జడ్జి కుమారుడికి సైతం డెంగీ సోకిందన్నారు. వైద్యులు వైద్యం చేయక ప్రైవేటు ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారని విమర్శించారు. తక్షణం వ్యాధిగ్రస్తులందరికీ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. నగరి ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ జిల్లాలో  ఏ ఒక్క ఆస్పత్రుల్లో వైద్యులు సక్రమంగా లేరన్నారు. ప్రైవేటు ఆస్పత్రులకెళ్లి వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత లేకనే పేదలు మృత్యువాతపడుతున్నారన్నారు. ఆస్పత్రుల కమిటీలో ప్రజాప్రతినిధులు సభ్యులుగా ఉండాల్సి ఉన్నా ఇది సక్రమంగా అమలు చేయడంలేదన్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో స్విమ్స్‌లో ప్రత్యేక ఫీవర్ ఆస్పత్రి ఏర్పాటు చేయాలన్నారు.  

వచ్చే జెడ్పీ సమావేశంలో రెవెన్యూపై చర్చ జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు మట్టినమూనా ఫలితాలను ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మదనపల్లె ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యసేవలతో పాటు పారిశుద్ధ్యం సైతం అధ్వానంగా ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పేదలకు  వైద్యం అందించాలన్నారు. విద్యాశాఖను పట్టించుకోలేదని డీఈవోపై ధ్వజమెత్తారు.  పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్ మాట్లాడుతూ ఆస్పత్రి కమిటీలో సభ్యులుగా ఉన్న ప్రజాప్రతినిధులకు ఏమాత్రం విలువ లేకుండా పోయిందన్నారు. ప్రజాప్రతినిధుల సూచనలు, సలహాల మేరకు కమిటీలు పనిచేయాలన్నారు. ఎమ్మెల్సీ శ్రీనివాసులు మాట్లాడుతూ చిత్తూరు ఆస్పత్రిని అపోలోకు అప్పగించడం దారుణమన్నారు. జిల్లాలో ప్రజలకు మంచినీరు అందకనే రోగాలు ప్రబలుతున్నాయన్నారు.

ప్రతిపక్ష సభ్యులు సభలో ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రతిసారి అధికార పార్టీ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. సంక్షేమంతో పాటు పలు శాఖలపై చర్చ జరిగింది.  ఈ సమావేశంలో ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, ఎమ్మెల్యే తలారి ఆదిత్య, జెడ్పీ సీఈవో వేణుగోపాల్‌రెడ్డి, జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ కోటీశ్వరి, బీసీ సంక్షేమ శాఖ డీడీ రామచంద్రరాజు, జిల్లాపరిషత్ సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు