సంగ్రామంలో రగిలిన చిచ్చు

2 Aug, 2013 05:06 IST|Sakshi

 వేంపల్లె, న్యూస్‌లైన్ : స్థానిక సం‘గ్రామం’లో చిచ్చు రగిలింది. రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. పోలీస్ పికెట్ ఉన్నా రాళ్ల వర్షం కురిసింది. ఈ ఉదంతంలో ముగ్గురు తీవ్రంగా గాయపడారు. దీంతో ఎప్పుడేం జరుగుతుందోనన్న అభద్రతాభావం గ్రామస్తులను వణికిస్తోంది.
 
 ఏం జరిగిందంటే...
 వేంపల్లె మండలం రామిరెడ్డిపల్లెలో గురువా రం తెల్లవారు జామున వైఎస్‌ఆర్ కాంగ్రెస్, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. రెం డు వర్గాలు పరస్పరం గంటన్నర పాటు రుళ్లు రువ్వుకున్నారు. ఘటనలో వైఎస్‌ఆర్ సీపీకి చెందిన చంద్ర ఓబుళరెడ్డి, శ్యామలమ్మ, ఓబుళరెడ్డి అనే వ్యక్తులు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం పులివెందులకు తరలించారు. బుధవారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మాటామాటా పెరగడంతో వైఎస్‌ఆర్ సీపీకి చెందిన రామ నరసింహారెడ్డి, టీడీపీకి చెందిన జగన్నాథరెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ చెలరేగింది.
 
 రంగంలోకి దిగిన పోలీసులు
 సమాచారం అందుకున్న వెంటనే పులివెందుల సీఐ శంకరయ్య, ఎస్‌ఐలు హాసం, రమేష్‌బాబు, ఖాదర్‌వల్లి రామిరెడ్డిపల్లెకు హుటాహుటిన చేరుకున్నారు. ఘటనకు దారి తీసిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. పరిస్థితి సమీక్షించారు.
 
 పోలీసు పికెట్ ఉండగానే..
 రామిరెడ్డిపల్లెలో రెండ్రోజుల నుంచి పోలీసు పికెట్ కొనసాగుతోంది. ఇద్దరు కర్ణాటక పోలీసులు పికెట్‌లో ఉండగా.. రెండు వర్గాల వారు రాళ్లు రువ్వుకున్నారు. పోలీసుల అప్రమత్తమై ఉంటే.. ఈ సంఘటన జరిగి ఉండేది కాదని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు. బుధవారం రాత్రి ఘర్షణ వాతావరణం నెలకొనడంతో అప్పటికే అక్కడ పోలీసు పికెట్‌ను ఏర్పాటు చేశారు. అయినా  ఘర్షణను నిలవరించలేకపోయారు.
 

మరిన్ని వార్తలు