చార్మినార్.. బిర్లామందిర్‌లనూ పాస్‌వర్డ్‌గా పెట్టుకోవచ్చు!

21 Feb, 2014 05:12 IST|Sakshi
చార్మినార్.. బిర్లామందిర్‌లనూ పాస్‌వర్డ్‌గా పెట్టుకోవచ్చు!

చార్మినార్.. బిర్లామందిర్.. హుస్సేన్‌సాగర్ .. మీకు బాగా నచ్చిన ప్రసిద్ధ కట్టడాలు, ప్రదేశాలను కూడా ఇక పాస్‌వర్డ్‌లుగా పెట్టుకోవచ్చు. తలపండిన హ్యాకర్లు సైతం పసిగట్టలేని పాస్‌వర్డ్‌లను పెట్టుకునేందుకు వీలుగా రస్ అల్‌ఖైమాలోని జెడ్‌ఎస్‌ఎస్- రీసెర్చ్‌కు చెందిన శాస్త్రవేత్తలు వినూత్న భౌగోళిక పాస్‌వర్డ్‌ల వ్యవస్థను అభివృద్ధిపరుస్తున్నారు మరి. అందరికీ తెలిసిన ప్రదేశాల పేర్లను పాస్‌వర్డ్‌లుగా పెట్టుకుంటే ఇంకేమైనా ఉందా? అనుకుంటున్నారు కదూ!
 
 ఈ ప్రదేశాలు అందరికీ తెలిసినా.. ఆ పాస్‌వర్డ్‌కు వివిధ అంశాలను సెట్ చేసేది మీరే కాబట్టి.. మీరు తప్ప ఇంకెవరూ ఆ పాస్‌వర్డ్‌ను గుర్తుపట్టే అవకాశమే ఉండదని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఉదాహరణకు.. మీరు హుస్సేన్‌సాగర్‌ను పాస్‌వర్డ్‌గా పెట్టుకున్నారనుకోండి. అక్కడ బుద్ధ విగ్రహం చుట్టూ మనకు నచ్చినట్లు ఓ పటాన్ని ఆరు భుజాలతో బహుభుజి రూపం లో గీసుకోవచ్చు. అది కచ్చితమైన కొలతలతో రికార్డు అయిపోతుంది. తర్వాత బుద్ధవిగ్రహం మీదుగా వంద కొంగలు ఎగురుతున్నట్లు.. లక్ష పూలు కురుస్తున్నట్లు.. మీరు నీటిపై నడుస్తున్నట్టు.. ఇలా మీకు నచ్చిన సమాచారాన్ని కూడా జోడించుకోవచ్చు. ఇంకేం.. ఈ పాస్‌వర్డ్ మీకు సులభంగా గుర్తుండిపోతుంది. చాలా మంది హుస్సేన్‌సాగర్‌నే పాస్‌వర్డ్‌గా ఎంచుకున్నా కూడా ఏ ఇద్దరి సమాచారం ఒకేలా ఉండే అవకాశం లేదు కాబట్టి.. మన పాస్‌వర్డ్ భద్రంగా ఉంటుందన్నమాట.

>
మరిన్ని వార్తలు