పె(టె)న్షన్..!

9 Feb, 2014 03:29 IST|Sakshi

సాక్షి, నల్లగొండ: సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలతో పెన్షన్‌దారుల్లో అయోమయం నెలకొంది. ఇచ్చే రూ.500, రూ.200 కోసం పూటకో నిబంధన పెట్టి ముప్పు తిప్పలు పెడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బయోమెట్రిక్, రేషన్ కార్డు, ఆధార్‌కార్డు (ఈఐడీ/యూఐడీ) ఇలా.. అన్నీ కావాలని అడుగుతుండడంతో బేజారు పడుతున్నారు. ఆధార్ ఉంటేనే పెన్షన్ ఇస్తామని.. నిబంధన లేకున్నా ఆధార్ నంబర్ మాత్రం తీసుకోవాలని ప్రభుత్వం నుంచి అధికారులకు ఆదేశాలు అందాయి.

దీంతో ఆధార్ లేకుంటే పెన్షన్ రాదేమోనన్న భయం పెన్షన్‌దారులకు పట్టింది. వారు తమ రేషన్‌కార్డు నంబర్ తప్పక అప్పగించాలని తేల్చిచెప్పింది. అయితే కొంతమందికి రేషన్‌కార్డు లేకపోగా.. ఉన్నవారికి నంబర్లు తప్పుగా నమోదు కావడం, పేర్లలో అక్షర దోషాలు ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటువంటి వారు జిల్లాలో వేలమంది ఉన్నారు.
 
 తప్పుల తిప్పలు...
 జిల్లాలో ఉన్న దాదాపు 4 లక్షల మంది ఉన్నారు. వారిలో వృద్ధాప్య 1.86లక్షలు, వితంతు 1.09 లక్షలు, వికలాంగ 52 వేలు, అభయహస్తం 25 వేలు, గీత కార్మికులు 11 వేలు, చేనేత 9వేల మంది పెన్షన్‌దారులు ఉన్నారు. వీరికి నెలనెలా సగటున రూ. 12 కోట్లు ప్రభుత్వం ఖర్చుచేస్తోంది. మొత్తం 3.94 లక్షలమంది పెన్షన్‌దారులకు నెలనెలా సగటున రూ.12 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. వీరిలో ఇప్పటివరకు 3.30లక్షల మంది మాత్రమే తమ రేషన్ కార్డు జిరాక్స్ కాపీలను ఎంపీడీఓలకు అప్పగించారు.
 
 మిగిలిన వారిలో 32వేల మందికి సంబంధించి అసలు రేషన్ కార్డు నంబర్లు లేవు. 2012లో నిర్వహించిన ఇంటింటి సర్వే సమయంలో 36వేలకు పైగా మంది రేషన్‌కార్డులు తొలగించారు. వీరిలో దాదాపు 4వేల మంది తిరిగికార్డు పొంది తమ నంబర్‌ను అధికారులకు అందజేశారు. మిగిలిన 32వేల మంది పెన్షన్‌దారుల రేషన్‌కార్డు నంబర్ ఆన్‌లైన్‌లో నమోదు చేస్తే ... చెల్లదు అని సమాధానం వస్తోంది. రేషన్‌కార్డుల్లో నమోదైన మరో 32వేల మంది పేర్లు, నంబర్లు.. ఆన్‌లైన్‌లో ఉన్న పెన్షన్‌దారుల డేటాతో సరిపోలడం లేదు. పేర్లలో ఒక్క అక్షర దోషం ఉన్నా తిరస్కరిస్తున్నారు. ఇది కూడా తలనొప్పిగా మారింది.
 
 అందుబాటులో లేరు..
 రేషన్‌కార్డుల జిరాక్స్‌లు అందిస్తే తప్పులు లేకుండా వివరాలు నమోదు చేయవచ్చని, తద్వారా భవిష్యత్‌లోనూ ఎలాంటి సమస్యలూ ఎదరుకాబోవని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పేర్లు, నంబర్లు తప్పుగా నమోదైన వారి రేషన్‌కార్డుల జిరాక్స్ ప్రతులను సేకరించాలని పంచాయతీ సెక్రటరీలకు అధికారులు సూచించారు. కొంతమందికి సంబంధించిన జిరాక్స్‌లు మాత్రమే సేకరించి వారు చేతులు దులుపుకుంటున్నారు. స్థానికంగా  పెన్షన్‌దారులు అందుబాటులో లేకపోవడంతో సేకరణ సాధ్యం కావడంలేదని అంటున్నారు.
 
 కొందరికే...
 జిల్లాలో ఉన్న పెన్షన్‌దారుల్లో 182మంది మినహా మిగిలిన వారంతా బయోమెట్రిక్ విధానం ద్వారానే పెన్షన్‌పొందుతున్నారు. జిల్లాకేంద్రంలో ఉంటున్న ఈ 182మంది కుష్ఠు వ్యాధిగ్రస్తులు. వీరికి చేతి వేళ్లు లేకపోవడంతో మాన్యువల్ పద్ధతిన నెలనెలా  పెన్షన్ అందజేస్తున్నారు. ఇప్పుడున్న బయోమెట్రిక్ విధానంలోనూ కొత్తగా ఆధార్ అథెంటిక్ పేమెంట్ సిస్టంను సర్కారు ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో ప్రతి  పెన్షన్‌దారుడు నుంచి ఆధార్ నంబర్‌ను సేకరించాలని అధికారులకు సూచించింది. బయోమెట్రిక్ విధానం ద్వారా పెన్షన్ పొందుతున్న 3,94,362మందిలో 1,18,565మంది మాత్రమే తమ ఆధార్ నంబర్‌ను మండలాధికారులకు అందజేశారు. మిగిలిన 2,75,797 మంది అందుకు దూరంగా ఉన్నారు. కనీసం ఆధార్ నమోదు చేసుకుని కార్డు రాని వారు కనీసం ఈఐడీ (ఎన్‌రోల్‌మెంట్ నంబర్) ఇవ్వాలని అధికారులు చెబుతున్నారు. చాలామంది పెన్షన్‌దారులు అసలు ఆధార్ నమోదు చేయించుకోలేదు. వీరేం చెయ్యాలో అర్థం కాక ఆందోళన చెందుతున్నారు.
 

మరిన్ని వార్తలు